ఓ తండ్రి ఆలోచన.. ఒకే ముహూర్తానికి ఆరు పెళ్లిళ్లు | Different wedding style in Kerala | Sakshi
Sakshi News home page

ఓ తండ్రి ఆలోచన.. ఒకే ముహూర్తానికి ఆరు పెళ్లిళ్లు

Jan 9 2022 12:30 AM | Updated on Jan 9 2022 11:38 AM

Different wedding style in Kerala - Sakshi

తనతోపాటు పెళ్లి జరిగిన ఐదుగురు పెళ్లికూతుళ్ల నడుమ రమీజా

ఈ హెడ్డింగ్‌కి అర్థం తెలుసుకోవాలంటే మనం కేరళకు వెళ్లాలి. అక్కడ ఒక తండ్రి తన కుమార్తెకు పెళ్లి చేయదలిచాడు. కాని పెళ్లికి అనవసర ఖర్చు వద్దనుకున్నాడు. కట్నం ఇవ్వకూడదనుకున్నాడు. ఆ డబ్బును సద్వినియోగం చేయాలనుకున్నాడు. కూతురి పెళ్లికి ఎంత డబ్బు దాచాడో ఆ మొత్తం డబ్బును అదే ముహూర్తానికి మరో ఐదు మంది అమ్మాయిల పెళ్లికి ఖర్చు చేశాడు. ఒకే ముహూర్తానికి ఆరు పెళ్ళిళ్లు జరిగాయి. ఈ ఆలోచన మనం చేయలేమా? అసలు పెళ్లికి ఖర్చు అవసరమా? పెళ్లి ఖర్చు అనే సామాజిక రుగ్మత నుంచి బయటపడలేమా? ఒక ఆలోచనాత్మక కథనం.

ఇటీవల హైదరాబాద్‌ గోల్కొండ సమీపంలోని ఒక రిసార్ట్‌లో పెళ్లి జరిగింది. ఆ పెళ్లి ఖర్చు.. అంటే పెళ్లి జరిపేందుకు అయిన ఖర్చు 2 కోట్లు. ఈ మొత్తంలో లాంఛనాలు లేవు. ఇచ్చిపుచ్చుకున్న ఖర్చూ లేదు. కేవలం కల్యాణ మంటపానికి, భోజనానికి, అతిథి మర్యాదలకి, సంగీత్‌కి, అలంకరణలకి, అట్టహాసానికి అయిన ఖర్చు అది. ఆ రెండు కోట్లతో మధ్యతరగతి పెళ్లిళ్లు 20 అయినా చేయొచ్చు. పేద పెళ్ళిళ్లు 50 అయినా చేయొచ్చు.

పెళ్లి ఇద్దరు స్త్రీ, పురుషులు కలిసే సంతోషకరమైన సందర్భం. దానిని సంతోషంగా చేసుకోవాల్సిందే. ఇరువురి ఆత్మీయులు హాజరవ్వాల్సిందే. కాని ఆ పెళ్లిని ఆసరా చేసుకుని తమ సంపదను, అహాన్ని, హోదాని, పలుకుబడిని నిరూపించాలనుకున్నప్పుడే పేచీ వస్తుంది. వెండి అంచు ఉన్న శుభలేఖలు, వాటితో పాటు ఇచ్చే పట్టుచీరలు,  వస్తువులు, భోజనంలో ముప్పై నలభై వంటకాలు, ఖరీదైన వినోద కార్యక్రమాలు ఇవన్నీ పెళ్లి బడ్జెట్‌ను అమాంతం పెంచేస్తాయి. ఉన్నవారికి ఇదంతా తేలికే కావచ్చు. ఇమిటేట్‌ చేయాలనుకునే వారికి చిక్కొచ్చి పడుతుంది. ఇటీవల కేరళ లో అట్టహాసపు పెళ్ళిళ్లు, అందుకు పెళ్లికొడుకులు మారాము చేయడం, ఘనంగా చెప్పుకోవడానికి బైక్‌ దగ్గర కారు అడగడం, కట్నం దగ్గర ఆస్తులు అడగడం, అవి వీలు కాకపోతే భార్యను వేధించడం మామూలు అయిపోయింది.

ఈ నేపథ్యంలో ఇటీవల కన్నూరులో ఒక ఆసక్తికరమైన ఘటన జరిగింది. కన్నూరు సమీపంలోని ఎడచ్చేరీకి చెందిన సలీమ్, రుబీనా జంట తమ కుమార్తె రమీజా పెళ్లిని వినూత్నంగా చేయాలనుకున్నారు. గల్ఫ్‌లో ఉద్యోగం చేసే సలీమ్‌ తన కుమార్తె పెళ్లికి డబ్బు దాచి పెట్టాడు. కాని దానిని కట్నంగా ఇవ్వడం, అట్టహాసపు పెళ్లికి ఖర్చు పెట్టడం వద్దనుకున్నాడు. ఎలాగైనా సరే కట్నం అడగని పెళ్లికొడుకుని వెతికి పెళ్లి చేయాలి అని నిశ్చయించుకున్నాడు. అలాంటి వరుడే దొరికాడు.

దాంతో అతనికి కట్నం డబ్బు మిగిలిపోయింది. దాంతో పాటు పెళ్లి అర్భాటంగా వద్దనుకున్నాడు కాబట్టి ఆ ఖర్చూ మిగిలింది. ఆ మొత్తం డబ్బుతో ఆర్థికంగా వెనుకబడిన ఐదుగురు అమ్మాయిలను ఎంపిక చేసుకుని వారికి అబ్బాయిలను వెతికి తన కుమార్తెకు పెళ్లి జరిగిన ముహూర్తానికే వారికీ పెళ్లి జరిపించాడు. అంతే మొత్తం ఆరు పెళ్ళిళ్లు ఒకే ముహూర్తానికి జరిపించాడు. ఇందులో ఇద్దరు వధువులు హిందువులు కావడంతో వారి పెళ్లి హైందవపద్ధతిలో జరిగింది.

ఈ పెళ్ళిళ్లు జరిపించడంలో సలీమ్, రుబీనా దంపతులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఆ ఐదుగురు అమ్మాయిలకు తగిన అబ్బాయిలను వెతికారు. అలాగే పెళ్లిలో సొంత కూతురితో పాటు మిగిలిన ఐదుగురికీ సమానంగా 10 సవరల బంగారం పెట్టారు. అందరికీ ఒకేరకమైన పట్టు చీరలు తెచ్చారు. ఇంత చక్కగా డబ్బును సద్వినియోగం చేయడం వల్ల ప్రశంసలు పొందారు. ఇందులో మతసామరస్యం కూడా ఉండటంతో పొగడ్తలు మరిన్ని వస్తున్నాయి.

కాలం మారుతుంది. రెండు తీవ్రతలు కనిపిస్తున్నాయి. ఒకటి పెళ్లికి చాలా ఎక్కువగా ఖర్చు పెట్టడం...మరొకటి రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా కేవలం బొకేలు ఇచ్చి పుచ్చుకుని వియ్‌ ఆర్‌ మేరీడ్‌ అనుకోవడం. ఎవరి ఇష్టం వారిదే అయినా పెళ్లి ఖర్చును తగ్గించడం అనేది ఒక అవసరంగా పాటించడం ఆదర్శం అవుతుంది. ఆ ఆదర్శం అందరూ పాటించగలిగితే చాలా కుటుంబాలకు పెళ్లి భారం అనే ఆలోచన తప్పుతుంది. తద్వారా ఆడపిల్లలను కనేందుకు, ఆడపిల్లలను పెంచేందుకు జంకే పరిస్థితి పోతుంది. ‘అమ్మాయి పుడితే ఖర్చు’ అనే మాట ఇంకా ఎంత కాలం? ఆ ఖర్చు పెళ్లి వల్లే కదా? దానిని తేలిక చేయలేమా? సలీం వంటి ఆలోచనలు చేయలేమా?
ఆలోచించాలి అందరం.
 
పెళ్లి ఖర్చును తగ్గించడం అనేది ఒక అవసరంగా పాటించడం ఆదర్శం అవుతుంది. ఆ ఆదర్శాన్ని అందరూ పాటించగలిగితే చాలా కుటుంబాలకు పెళ్లి భారం అనే ఆలోచన తప్పుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement