డబ్బు గుట్టగా పోసుక్కుర్చున్నామా: కేంద్ర మంత్రి
సాక్షి, హైదరాబాద్ : పెట్రోల్‌ను వస్తు సేవల పన్ను(జీఎస్టీ) కిందకు తీసుకురావాలని ఇంధన శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆదివారం కోరారు. వినియోగదారులు పెట్రోల్‌ను జీఎస్టీ కిందకు తీసుకురావాలని కోరుకుంటున్నారని చెప్పారు. దేశమంతటా కూడా ఒకే రకమైన పన్ను వేయాలని కోరారు. ప్రస్తుతం జీఎస్టీ కింద సెంట్రల్ జీఎస్టీ, వ్యాట్ అని రెండు రకాలుగా పన్ను వసూలు చేస్తున్నారు. ఈ రెండింటినీ కలిపి ఒకే రకమైన పన్ను వేయాలని ఆర్థిక శాఖకు పంపిన ప్రపోజల్‌లో ప్రధాన్ పేర్కొన్నారు.
ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ రేట్లలో తగ్గుదల, పెరుగుదలలు అంతర్జాతీయ మార్కెట్లను అనుసరించి మాత్రమే జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు. కేంద్రానికి పన్ను ద్వారా వచ్చిన ఆదాయం ఆర్థిక సంఘం ప్రతిపాదనల మేరకు 42 శాతం రాష్ట్రాలకే పంచుతున్నామని వెల్లడించారు. అంతేకాక రాష్ట్రాలు అదనంగా విధించుకుంటున్న పన్ను వల్ల కూడా వాటికి ఆదాయం సమకూరుతోందని చెప్పారు.
కేంద్రానికి వచ్చే నిధులను ప్రజల సంక్షేమ పథకాలకే ఖర్చు చేస్తున్నామని అన్నారు. 'మేం రోడ్లు నిర్మించాలని, ఇళ్లు కట్టించాలని మీరు(ప్రజలను ఉద్దేశించి) అనుకోవడం లేదా?' అని ప్రశ్నించారు. 'మాకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది?. మేమేమైనా డబ్బులు గుట్టగా పోశామనుకుంటున్నారా?' అని అన్నారు. దేశాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకే తాము కృషి చేస్తున్నామని చెప్పారు. గతంలో ఒక ఇంటికి రూ. 75 వేలు ఖర్చు చేస్తే.. ప్రస్తుతం రూ.1.5 లక్షలు ఖర్చు చేస్తున్నామని చెప్పారు.