Goods and Service Tax
-
హిట్టా..ఫట్టా..: జీఎస్టీ అమలై ఏడాది పూర్తి
-
డబ్బు గుట్టగా పోసుక్కుర్చున్నామా: కేంద్ర మంత్రి
సాక్షి, హైదరాబాద్ : పెట్రోల్‌ను వస్తు సేవల పన్ను(జీఎస్టీ) కిందకు తీసుకురావాలని ఇంధన శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆదివారం కోరారు. వినియోగదారులు పెట్రోల్‌ను జీఎస్టీ కిందకు తీసుకురావాలని కోరుకుంటున్నారని చెప్పారు. దేశమంతటా కూడా ఒకే రకమైన పన్ను వేయాలని కోరారు. ప్రస్తుతం జీఎస్టీ కింద సెంట్రల్ జీఎస్టీ, వ్యాట్ అని రెండు రకాలుగా పన్ను వసూలు చేస్తున్నారు. ఈ రెండింటినీ కలిపి ఒకే రకమైన పన్ను వేయాలని ఆర్థిక శాఖకు పంపిన ప్రపోజల్లో ప్రధాన్ పేర్కొన్నారు. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ రేట్లలో తగ్గుదల, పెరుగుదలలు అంతర్జాతీయ మార్కెట్లను అనుసరించి మాత్రమే జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు. కేంద్రానికి పన్ను ద్వారా వచ్చిన ఆదాయం ఆర్థిక సంఘం ప్రతిపాదనల మేరకు 42 శాతం రాష్ట్రాలకే పంచుతున్నామని వెల్లడించారు. అంతేకాక రాష్ట్రాలు అదనంగా విధించుకుంటున్న పన్ను వల్ల కూడా వాటికి ఆదాయం సమకూరుతోందని చెప్పారు. కేంద్రానికి వచ్చే నిధులను ప్రజల సంక్షేమ పథకాలకే ఖర్చు చేస్తున్నామని అన్నారు. 'మేం రోడ్లు నిర్మించాలని, ఇళ్లు కట్టించాలని మీరు(ప్రజలను ఉద్దేశించి) అనుకోవడం లేదా?' అని ప్రశ్నించారు. 'మాకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది?. మేమేమైనా డబ్బులు గుట్టగా పోశామనుకుంటున్నారా?' అని అన్నారు. దేశాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకే తాము కృషి చేస్తున్నామని చెప్పారు. గతంలో ఒక ఇంటికి రూ. 75 వేలు ఖర్చు చేస్తే.. ప్రస్తుతం రూ.1.5 లక్షలు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. -
నవశకానికి నాంది నేడు...
స్వతంత్ర భారతావనిలో మరో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమవుతోంది. దేశ చరిత్రలోనే అతిపెద్ద ఆర్థిక సంస్కరణగా అభివర్ణిస్తున్న జీఎస్టి (వస్తు సేవ పన్ను) చట్టం శుక్రవారం అర్ధరాత్రి నుంచి అమలులోకి రానుంది. పార్లమెంటు సెంట్రల్ హాలులో జరిగే ఆరంభ వేడుకకు రాజకీయ అతిరథ మహారథులందరికీ ఆహ్వానాలు అందాయి. రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆర్థిక మంత్రులు పాల్గొననున్నారు. భిన్న రంగాల్లోని నిపుణులు, సెలబ్రిటీలనూ ఆహ్వానించారు. మోదీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. – శుక్రవారం రాత్రి 10.45 గంటలకు కార్యక్రమం మొదలవుతుంది. 80 నిమిషాల పాటు కార్యక్రమం సాగుతుంది. – రాష్ట్రపతి రాకముందు మొదట జీఎస్టిపై 10 నిమిషాల నిడివిగల షార్ట్‌ఫిల్మ్‌ను ప్రదర్శిస్తారు. – వేదికపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధాని మోదీ, లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహజన్, మాజీ ప్రధాని దేవేగౌడ ఆసీనులవుతారు. – ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ క్లుప్తంగా జీఎస్టి గురించి వివరిస్తారు. – ప్రధాని, రాష్ట్రపతి చెరో 25 నిమిషాల సేపు ఆహుతులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. – రెండు నిమిషాల వీడియో క్లిప్‌ను ప్రదర్శించాక... సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలకు జీఎస్టీ అమలులోకి వచ్చిందనేందుకు సూచికగా గంట మోగిస్తారు. – రతన్ టాటా, అమితాబచ్చన్, లతా మంగేష్కర్, న్యాయకోవిదులు సోలీ సొరాబ్జీ, కేకే వేణుగోపాల్, హరీష్ సాల్వే, ఆర్బీఐ మాజీ గవర్నర్లు సి.రంగరాజన్, బిమల్ జలాన్, వైవీ రెడ్డి, డి.సుబ్బారావు, ప్రస్తుత గవర్నర్ ఉర్జిత్ పటేల్, విఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త ఎం.ఎస్.స్వామినాథన్, మెట్రో నిపుణుడు శ్రీధరన్... ఇలా వివిధ రంగాల్లో లబ్ధ ప్రతిష్టులైన 100 మందికి ఆహ్వానాలు పంపారు. – సుప్రీంకోర్టు జడ్జిలు, అన్ని రాష్ట్రాల హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులను కూడా ఆహ్వానించారు. సీఐఐ, ఫిక్కీ, అసోచామ్ల చైర్మన్లనూ ఈ కార్యక్రమానికి పిలిచారు. – కేంద్ర మంత్రులు, సీనియర్ అధికారులు, ఎంపీలు పాల్గొననున్నారు. – ఈ మెగా షోను పకడ్బందీగా నిర్వహించాలనే ఉద్దేశంతో గురువారం రాత్రి రిహార్సల్స్ కూడా నిర్వహించారు. కీలక ఘట్టాలకు వేదిక పార్లమెంటు భవన సముదాయంలో ఉన్న సెంట్రల్ హాల్ వృత్తాకారంలో ఉంటుంది. ఎన్నో చారిత్రక ఘట్టాలకు ఇది వేదికైంది. 70 ఏళ్ల క్రితం... 1947 ఆగష్టు 14న అర్ధరాత్రి అధికార మార్పిడి ఇక్కడే జరిగింది. భారతావని స్వేచ్ఛావాయువులు పీల్చిన ఆ క్షణాన ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నెహ్రూ జాతినుద్దేశించి భావోద్వేగంతో కూడిన ప్రసంగాన్ని ఇక్కడి నుంచే చేశారు. భారత స్వాతంత్ర రజతోత్సవ, స్వర్ణోత్సవ వేడుకలను ఇదే సెంట్రల్ హాల్ వేదిక. మన ప్రజాస్వామ్యానికి మూలస్తంభమైన రాజ్యాంగాన్ని రచించిన సభ సమావేశాలు జరిగిందీ ఇక్కడే. ప్రతి సంవత్సరం పార్లమెంటు సమావేశాల తొలిరోజు సెంట్రల్ హాలులోనే భారత రాష్ట్రపతి ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. కొత్త రాష్ట్రపతిగా ఎన్నికైన వారు బాధ్యతలు స్వీకరించేది కూడా సెంట్రల్ హాలులోనే. ఇతర దేశాధినేతలు వచ్చినపుడు వారు భారత పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగించేది కూడా ఇక్కడే. అందుకే మోదీ ప్రభుత్వం జీఎస్టి ప్రారంభానికి ఈ చారిత్రక భవనాన్ని ఎంచుకుంది. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నపుడు... సంప్రదింపులకు, పిచ్చాపాటి మాట్లాడుకోవడానికి ఎంపీలు సెంట్రల్ హాల్లోకి చేరుతారు. విషయసేకరణ నిమిత్తం ఎంపీలతో మాట్లాడటానికి వీలుగా పాసులున్న సీనియర్ జర్నలిస్టులను సెంట్రల్ హాలులోకి అనుమతిస్తారు. కాంగ్రెస్ దూరం... ఈ మెగా షోకు దూరంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకుంది. నిజానికి జీఎస్టీ కాంగ్రెస్ ఆలోచన. జీఎస్టి తేవడానికి అవసరమైన తొలి రాజ్యాంగ సవరణ బిల్లును 2011లో యూపీఏ ప్రభుత్వంలో ఆర్థికమంత్రిగా ప్రణబ్ ముఖర్జీ ప్రవేశపెట్టారు. తమ ఆలోచన అయిన జీఎస్టి ఆరంభానికి దూరంగా ఉండటం మంచిది కాదని మాజీ ఆర్థికమంత్రి పి.చిదంబరం తదితరులు వాదించినట్లు తెలుస్తోంది. వ్యాపారవర్గాల నుంచి తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇంత హడావుడిగా జీఎస్టిని అమల్లోకి తేవాల్సిన అవసరం ఏముందని మరికొందరు వాదించారు. చివరకు ఈ కార్యక్రమానికి దూరంగా ఉండాలని కాంగ్రెస్ నిర్ణయించుకుంది. జీఎస్టికి సంబంధించి మొదటి నుంచి పలు అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్న తృణమూల్ కాంగ్రెస్ కూడా గైర్హాజరు కానుంది. డీఎంకే కూడా రావడం లేదు. సీపీఐ కూడా వెళ్లకూడదని నిర్ణయించుకుంది. నవ భారతం ఆవిర్భవించిదని ప్రకటించడానికి నరేంద్ర మోదీ చేపట్టిన ఓ పబ్లిసిటీ స్టంట్‌గా ఈ కార్యక్రమాన్ని సీపీఐ సీనియర్ నేత డి.రాజా అభివర్ణించారు. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి కూడా గైర్హాజరు కానున్నారు. అయితే ఈ కార్యక్రమానికి సంబంధించి సీపీఎం పార్టీపరంగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
చెప్పులు, దుస్తులపై జీఎస్టీ మోత
-
చెప్పులు, దుస్తులపై జీఎస్టీ మోత
న్యూఢిల్లీ: ఖరీదైన చెప్పులు, రెడీమెడ్ దుస్తులపై జీఎస్టీ మోత మోగించనుంది. రూ. 500 లోపు ఉన్న చెప్పులపై 5శాతం పన్ను విధించాలని, రూ. 500లు దాటితే ఏకంగా 18శాతం పన్ను విధించాలని జీఎస్టీ మండలి తాజాగా నిర్ణయించింది. అలాగే రెడీమెడ్ దుస్తులపై జీఎస్టీ మోత మోగనుంది. నూలు, మిల్లు వస్త్రాలపై 5శాతం పన్ను విధించనుండగా, రెడీమెడ్ దుస్తులపై 12శాతం పన్ను విధించాలని నిర్ణయించారు. శనివారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో వస్తుసేవల పన్ను (జీఎస్టీ) మండలి 15వ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తెలుగు రాష్ట్రాల ఆర్థికమంత్రులు ఈటల రాజేందర్, యనమల రామకృష్ణుడు కూడా పాల్గొన్నారు. ఈ సమావేశంలో బంగారం, బీడీలు, చెప్పులు, దుస్తులు సహా పలు నిత్యావసరాల వస్తువులపై ఈ సమావేశంలో జీఎస్టీ కింద పన్ను ఖరారు చేశారు. తినే బిస్కెట్లపై ఏకంగా 18శాతం పన్ను విధించగా, సామాన్యులు తాగే బీడీలపై 28శాతం పన్నుతో మోత మోగించారు. భారతీయులకు బాగా ఇష్టమైన బంగారం మీద మాత్రం కాస్తా కనికరం చూపించారు. స్వర్ణం మీద కేవలం 3శాతం జీఎస్టీతో సరిపెట్టారు. -
త్రిమూర్తులు దిగివచ్చినా అది సాధ్యం కాదు!
న్యూఢిల్లీ: మోదీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న వస్తు సేవల పన్ను (జీఎస్టీ)బిల్లును నిర్దేశిత గడువు ఏప్రిల్ 1లోపు అమల్లోకి తేవడం.. బ్రహ్మ, హరిహరాది త్రిమూర్తులు దిగివచ్చినా సాధ్యం కాదని కాంగ్రెస్ సీనియర్ నేత ఆనంద్‌శర్మ పేర్కొన్నారు. 'ప్రధానమంత్రి ముందుకొచ్చి ప్రతిపక్ష నేతతో ఓ యుగళగీతాన్ని పాడినా, మేమంతా కలిసి అధిక సమయం పనిచేసినా గడువు అయినా ఏప్రిల్ 1 (2016)ను అందుకోలేం' అని ఆయన పరిశ్రమల సంస్థ ఫిక్కీ నిర్వహించిన కార్యక్రమంలో పేర్కొన్నారు. 'మన పురాణాలలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల గురించి మనం మాట్లాడుకుంటాం. వాళ్లు ముగ్గురు ఒకచోటకు వచ్చినా 50శాతం రాష్ట్రాల సమ్మతి, మూడు చట్టాలు (కేంద్ర జీఎస్టీ, రాష్ట్రాల జీఎస్టీ, ఐజీఎస్టీ) ఆమోదం సాధ్యపడదు' అని ఆయన పేర్కొన్నారు. జీఎస్టీ రాజ్యాంగ సవరణ బిల్లు ప్రస్తుతం రాజ్యసభలో ఆగిపోయింది. పెద్దలసభలో అధికార ఎన్డీయేకు మెజారిటీ లేకపోవడంతో ఆమోదం కోసం ఎదురుచూపులు చూస్తున్నది. స్వాతంత్ర్యానంతరం పరోక్ష పన్నుల విధానంలో సమగ్ర సంస్కరణలతో తీసుకొస్తున్న బిల్లుగా జీఎస్టీ పేరొందింది. -
జీఎస్టీతో తయారీ వ్యయం తగ్గుతుంది
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వచ్చే ఏడాది నుంచి అమల్లోకి రానున్న గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ (జీఎస్టీ)తో తయారీ రంగ వ్యయం గణనీయంగా తగ్గుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. హైదరాబాద్‌లో గురువారం ‘జీఎస్టీ’పై అసోచామ్ జాతీయ సదస్సును నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అసోచామ్ పరోక్ష పన్నుల చైర్మన్ నిహల్ కొఠారి మాట్లాడుతూ ప్రస్తుత జీఎస్టీలో కొన్ని పరిష్కరించాల్సిన సమస్యలు ఉన్నప్పటికీ కొత్త విధానం వల్ల తయారీ రంగానికి వ్యయాలు బాగా తగ్గుతాయన్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న పన్నుల విధానం చాలా సంక్లిష్టంగా ఉందని, దీని వల్ల ఉత్పత్తులు, సేవల ధరలు బాగా పెరుగుతున్నాయన్నారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒకే పన్నుల విధానం అమల్లోకి వస్తే వస్తూత్పత్తి వ్యయం బాగా తగ్గ అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జీఎస్టీపై పుస్తకం రాసిన సుమిత్ దత్త్ ముంజుందర్, ఎఫ్టీఏపీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రవీంద్ర మోడీ తదితరులు పాల్గొన్నారు. -
జీఎస్టీ కనీస పరిమితి రూ.10 లక్షలు
న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) కనీస పరిమితిని (థ్రెషోల్డ్ లిమిట్) రూ.25 లక్షల నుంచి రూ.10 లక్షలకు తగ్గించాలని వివిధ రాష్ట్రాల ఆర్థిక మంత్రులు పట్టుబట్టారు. ఐదేళ్ల జీఎస్టీ పరిహార వ్యవస్థను రాజ్యాంగ సవరణ బిల్లులో చేర్చాలని కేంద్రాన్ని కోరారు. జీఎస్టీ అమలుకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు రాష్ట్ర ఆర్థిక మంత్రుల సాధికార కమిటీ బుధవారం న్యూఢిల్లీలో సమావేశమైంది. కొత్త పన్నుల వ్యవస్థ నిర్మాణంపై తాము గత సమావేశంలో చేసిన ప్రతిపాదనలపై కేంద్రం ఇంకా స్పందించనేలేదని కమిటీ చైర్మన్ అబ్దుల్ రహీం రాథర్ చెప్పారు. పెట్రోలియం, పొగాకు, ఆల్కహాల్ వంటి ఉత్పత్తులను జీఎస్టీ పరిధి నుంచి మినహాయించాలని మంత్రులు ప్రతిపాదించారు. మినహాయింపుల జాబితాను రాజ్యాంగ సవరణ బిల్లులో చేర్చాలని డిమాండ్ చేశారు. ఐదేళ్లు అమల్లో ఉండే పరిహార వ్యవస్థ ఉండాలనీ, దాన్ని కూడా బిల్లులో చేర్చాలనీ కోరారు. రూ.1.50 కోట్ల లోపు టర్నోవర్ ఉండే వ్యాపారాల నుంచి పన్నుల వసూలుకు పాలనాధికారాలే కాకుండా చట్టపరమైన అధికారాలు కూడా ఉండాలని డిమాండ్ చేశారు. రూ.కోటిన్నర లోపు వ్యాపారాలపై పన్ను మదింపు, ఆడిట్, ఇతర అంశాల్లో జోక్యం వద్దని కేంద్రానికి సిఫార్సు చేశారు. ద్వంద్వ నియంత్రణ విధానం ప్రకారం రూ.1.50 కోట్లకు మించిన వార్షిక టర్నోవర్ ఉండే వ్యాపారుల నుంచి పన్నులను కేంద్రం వసూలు చేస్తుంది. తర్వాత, ఆయా రాష్ట్రాలకు వాటి వాటాలను చెల్లిస్తుంది. కోటిన్నర లోపు టర్నోవర్ ఉండే కంపెనీల నుంచి ట్యాక్సులను రాష్ట్రాలు వసూలు చేసి, కేంద్రానికి దాని వాటాను చెల్లిస్తాయి. కమిటీ సిఫార్సుల ప్రకారం రూ.10 లక్షల్లోపు వార్షిక టర్నోవర్ ఉండే వ్యాపారాలపై జీఎస్టీ విధించరు. ఈ పరిమితి సాధారణ కేటగిరీ రాష్ట్రాల్లో రూ.10 లక్షలు, ప్రత్యేక కేటగిరీ, ఈశాన్య రాష్ట్రాల్లో రూ.5 లక్షలుగా ఉండాలని నిర్ణయించినట్లు రాథర్ వివరించారు. అనేక రాష్ట్రాల్లో వ్యాట్ కనీస పరిమితి రూ.10 లక్షలుగా ఉండడం గమనార్హం.