
నవశకానికి నాంది నేడు...
స్వతంత్ర భారతావనిలో మరో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమవుతోంది. దేశ చరిత్రలోనే అతిపెద్ద ఆర్థిక సంస్కరణగా అభివర్ణిస్తున్న జీఎస్‌టి (వస్తు సేవ పన్ను) చట్టం శుక్రవారం అర్ధరాత్రి నుంచి అమలులోకి రానుంది. పార్లమెంటు సెంట్రల్ హాలులో జరిగే ఆరంభ వేడుకకు రాజకీయ అతిరథ మహారథులందరికీ ఆహ్వానాలు అందాయి. రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆర్థిక మంత్రులు పాల్గొననున్నారు. భిన్న రంగాల్లోని నిపుణులు, సెలబ్రిటీలనూ ఆహ్వానించారు. మోదీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.
– శుక్రవారం రాత్రి 10.45 గంటలకు కార్యక్రమం మొదలవుతుంది. 80 నిమిషాల పాటు కార్యక్రమం సాగుతుంది.
– రాష్ట్రపతి రాకముందు మొదట జీఎస్‌టిపై 10 నిమిషాల నిడివిగల షార్ట్‌ఫిల్మ్‌ను ప్రదర్శిస్తారు.
– వేదికపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధాని మోదీ, లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహజన్, మాజీ ప్రధాని దేవేగౌడ ఆసీనులవుతారు.
– ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ క్లుప్తంగా జీఎస్‌టి గురించి వివరిస్తారు.
– ప్రధాని, రాష్ట్రపతి చెరో 25 నిమిషాల సేపు ఆహుతులను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
– రెండు నిమిషాల వీడియో క్లిప్‌ను ప్రదర్శించాక... సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలకు జీఎస్‌టీ అమలులోకి వచ్చిందనేందుకు సూచికగా గంట మోగిస్తారు.
– రతన్ టాటా, అమితాబచ్చన్, లతా మంగేష్కర్, న్యాయకోవిదులు సోలీ సొరాబ్జీ, కేకే వేణుగోపాల్, హరీష్ సాల్వే, ఆర్‌బీఐ మాజీ గవర్నర్లు సి.రంగరాజన్, బిమల్ జలాన్, వైవీ రెడ్డి, డి.సుబ్బారావు, ప్రస్తుత గవర్నర్ ఉర్జిత్ పటేల్, విఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త ఎం.ఎస్.స్వామినాథన్, మెట్రో నిపుణుడు శ్రీధరన్... ఇలా వివిధ రంగాల్లో లబ్ధ ప్రతిష్టులైన 100 మందికి ఆహ్వానాలు పంపారు.
– సుప్రీంకోర్టు జడ్జిలు, అన్ని రాష్ట్రాల హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులను కూడా ఆహ్వానించారు. సీఐఐ, ఫిక్కీ, అసోచామ్‌ల చైర్మన్‌లనూ ఈ కార్యక్రమానికి పిలిచారు.
– కేంద్ర మంత్రులు, సీనియర్ అధికారులు, ఎంపీలు పాల్గొననున్నారు.
– ఈ మెగా షోను పకడ్బందీగా నిర్వహించాలనే ఉద్దేశంతో గురువారం రాత్రి రిహార్సల్స్ కూడా నిర్వహించారు.
కీలక ఘట్టాలకు వేదిక
పార్లమెంటు భవన సముదాయంలో ఉన్న సెంట్రల్ హాల్ వృత్తాకారంలో ఉంటుంది. ఎన్నో చారిత్రక ఘట్టాలకు ఇది వేదికైంది. 70 ఏళ్ల క్రితం... 1947 ఆగష్టు 14న అర్ధరాత్రి అధికార మార్పిడి ఇక్కడే జరిగింది. భారతావని స్వేచ్ఛావాయువులు పీల్చిన ఆ క్షణాన ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నెహ్రూ జాతినుద్దేశించి భావోద్వేగంతో కూడిన ప్రసంగాన్ని ఇక్కడి నుంచే చేశారు. భారత స్వాతంత్ర రజతోత్సవ, స్వర్ణోత్సవ వేడుకలను ఇదే సెంట్రల్ హాల్ వేదిక.
మన ప్రజాస్వామ్యానికి మూలస్తంభమైన రాజ్యాంగాన్ని రచించిన సభ సమావేశాలు జరిగిందీ ఇక్కడే. ప్రతి సంవత్సరం పార్లమెంటు సమావేశాల తొలిరోజు సెంట్రల్ హాలులోనే భారత రాష్ట్రపతి ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. కొత్త రాష్ట్రపతిగా ఎన్నికైన వారు బాధ్యతలు స్వీకరించేది కూడా సెంట్రల్ హాలులోనే. ఇతర దేశాధినేతలు వచ్చినపుడు వారు భారత పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగించేది కూడా ఇక్కడే. అందుకే మోదీ ప్రభుత్వం జీఎస్‌టి ప్రారంభానికి ఈ చారిత్రక భవనాన్ని ఎంచుకుంది. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నపుడు... సంప్రదింపులకు, పిచ్చాపాటి మాట్లాడుకోవడానికి ఎంపీలు సెంట్రల్ హాల్‌లోకి చేరుతారు. విషయసేకరణ నిమిత్తం ఎంపీలతో మాట్లాడటానికి వీలుగా పాసులున్న సీనియర్ జర్నలిస్టులను సెంట్రల్ హాలులోకి అనుమతిస్తారు.
కాంగ్రెస్ దూరం...
ఈ మెగా షోకు దూరంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకుంది. నిజానికి జీఎస్‌టీ కాంగ్రెస్ ఆలోచన. జీఎస్‌టి తేవడానికి అవసరమైన తొలి రాజ్యాంగ సవరణ బిల్లును 2011లో యూపీఏ ప్రభుత్వంలో ఆర్థికమంత్రిగా ప్రణబ్ ముఖర్జీ ప్రవేశపెట్టారు. తమ ఆలోచన అయిన జీఎస్‌టి ఆరంభానికి దూరంగా ఉండటం మంచిది కాదని మాజీ ఆర్థికమంత్రి పి.చిదంబరం తదితరులు వాదించినట్లు తెలుస్తోంది. వ్యాపారవర్గాల నుంచి తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇంత హడావుడిగా జీఎస్‌టిని అమల్లోకి తేవాల్సిన అవసరం ఏముందని మరికొందరు వాదించారు.
చివరకు ఈ కార్యక్రమానికి దూరంగా ఉండాలని కాంగ్రెస్ నిర్ణయించుకుంది. జీఎస్‌టికి సంబంధించి మొదటి నుంచి పలు అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్న తృణమూల్ కాంగ్రెస్ కూడా గైర్హాజరు కానుంది. డీఎంకే కూడా రావడం లేదు. సీపీఐ కూడా వెళ్లకూడదని నిర్ణయించుకుంది. నవ భారతం ఆవిర్భవించిదని ప్రకటించడానికి నరేంద్ర మోదీ చేపట్టిన ఓ పబ్లిసిటీ స్టంట్‌గా ఈ కార్యక్రమాన్ని సీపీఐ సీనియర్ నేత డి.రాజా అభివర్ణించారు. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి కూడా గైర్హాజరు కానున్నారు. అయితే ఈ కార్యక్రమానికి సంబంధించి సీపీఎం పార్టీపరంగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
– సాక్షి నాలెడ్జ్ సెంటర్