త్రిమూర్తులు దిగివచ్చినా అది సాధ్యం కాదు!
న్యూఢిల్లీ: మోదీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న వస్తు సేవల పన్ను (జీఎస్టీ)బిల్లును నిర్దేశిత గడువు ఏప్రిల్ 1లోపు అమల్లోకి తేవడం.. బ్రహ్మ, హరిహరాది త్రిమూర్తులు దిగివచ్చినా సాధ్యం కాదని కాంగ్రెస్ సీనియర్ నేత ఆనంద్‌శర్మ పేర్కొన్నారు. 'ప్రధానమంత్రి ముందుకొచ్చి ప్రతిపక్ష నేతతో ఓ యుగళగీతాన్ని పాడినా, మేమంతా కలిసి అధిక సమయం పనిచేసినా గడువు అయినా ఏప్రిల్ 1 (2016)ను అందుకోలేం' అని ఆయన పరిశ్రమల సంస్థ ఫిక్కీ నిర్వహించిన కార్యక్రమంలో పేర్కొన్నారు.
'మన పురాణాలలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల గురించి మనం మాట్లాడుకుంటాం. వాళ్లు ముగ్గురు ఒకచోటకు వచ్చినా 50శాతం రాష్ట్రాల సమ్మతి, మూడు చట్టాలు (కేంద్ర జీఎస్టీ, రాష్ట్రాల జీఎస్టీ, ఐజీఎస్టీ) ఆమోదం సాధ్యపడదు' అని ఆయన పేర్కొన్నారు. జీఎస్టీ రాజ్యాంగ సవరణ బిల్లు ప్రస్తుతం రాజ్యసభలో ఆగిపోయింది. పెద్దలసభలో అధికార ఎన్డీయేకు మెజారిటీ లేకపోవడంతో ఆమోదం కోసం ఎదురుచూపులు చూస్తున్నది. స్వాతంత్ర్యానంతరం పరోక్ష పన్నుల విధానంలో సమగ్ర సంస్కరణలతో తీసుకొస్తున్న బిల్లుగా జీఎస్టీ పేరొందింది.