సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ వేదికగా కాంగ్రెస్ అసంతృప్త నేతలు అధిష్టానంపై పోరును తీవ్రతరం చేసేందుకు సిద్ధమవుత్తున్నారు. పార్టీలో ప్రక్షాళనపేరుతో అధిష్టాన తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేసిన జీ–23 నాయకులు కీలక సమావేశాన్ని ఏర్పాటుచేయాలని యోచిస్తున్నారు. గులాం నబీ ఆజాద్ జీ–23 లో కీలక సభ్యుడు అయిన కారణంగానే ఆయన రాజ్యసభ పదవీకాలాన్ని పొడిగించకుండా, అధిష్టానం పక్కన పెట్టిందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. అంతేగాక రాజ్యసభా పక్ష నాయకుడిగా గులాంనబీ పదవీకాలం ముగిసిన తర్వాత సీనియర్ నేత ఆనంద్ శర్మను కాదని, అధిష్టానం రాహుల్‌గాంధీ విధేయుడిగా పేరున్న మల్లికార్జున ఖర్గేకు అప్పగించినప్పటి నుంచి, జీ–23 నేతలు అధిష్టానంపై అసహనాన్ని ఏదో ఒక రూపంలో వ్యక్తపరుస్తూనే ఉన్నారు.
రాజ్యసభ పక్ష నాయకుడి పదవి ఆనంద్ శర్మకు రాకుండా అడ్డుకోవడంలో అధిర్ రంజన్ చౌధరి వంటి వారు కీలకపాత్ర పోషించారని జీ–23 బృందం గట్టిగా నమ్ముతోంది. ఈ నేపథ్యంలోనే బెంగాల్ ఎన్నికల పొత్తు విషయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అధిర్ రంజన్ చౌధరిపై ఆనంద్ శర్మ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఐఎస్‌ఎఫ్‌తో పొత్తు కాంగ్రెస్ భావజాలానికి పూర్తి విరుద్ధమని, అలాంటి నిర్ణయం తీసుకునే ముందు పార్టీస్థాయిలో వివరణాత్మక చర్చ జరగాలని ఆనంద్ శర్మ తన ట్వీట్‌లో అభ్యంతరం వ్యక్తం చేస్తూ అధిర్ రంజన్ చౌదరిని టార్గెట్ చేశారు. ఆనంద్ శర్మ ట్వీట్ల తరువాత, అధిర్ రంజన్ చౌదరి సైతం ఘాటుగానే జవాబిచ్చారు. వీరి మాటల యుద్ధం కాస్తా ఇప్పుడు కాంగ్రెస్ అంతర్గత పోరును మళ్ళీ తెరపైకి తీసుకొచ్చింది. చదవండి: (ఎమర్జెన్సీ విధించడం తప్పే: రాహుల్ గాంధీ)
ఢిల్లీ పీసీసీలోనూ..
మరోవైపు అసమ్మతి వర్గంలో కీలకంగా ఉన్న నలుగురు నేతలు ఢిల్లీకి చెందిన వారు కావడంతో, ఢిల్లీ పీసీసీలోనూ అంతర్గత పోరు మొదలయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. త్వరలో జరుగబోయే కీలక సమావేశంలో పార్టీ అసంతృప్త నాయకుల భవిష్యత్తు కార్యాచరణపై చర్చలు జరుగనున్నాయి. కేంద్ర మాజీ మంత్రి కపిల్ సిబల్, ఢిల్లీ పీసీసీ మాజీ అధ్యక్షుడు అర్విందర్ సింగ్ లవ్లీ, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్, మాజీ ఉపాధ్యక్షుడు యోగానంద్ శాస్త్రిలు జీ –23లో ఉన్నారు. అయితే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఢిల్లీ పీసీసీలో ఈ అసంతృప్త నాయకుల జాబితా పెరుగుతోందని సమాచారం.
గతంలో 23 మంది..
పార్టీని బలోపేతం చేసే విషయంలో అధిష్టానం తీరు మార్చుకోవాలంటూ గతేడాది సోనియాగాంధీకి 23 మంది అసంతృప్త నేతలు రాసిన లేఖ పార్టీలో పెద్ద ఎత్తున దుమారానికి కారణమైన విషయం తెలిసిందే. కొన్ని నెలల క్రితం సోనియాగాంధీ నివాసంలో జీ –23 నేతలతో జరిగిన కీలక సమావేశంలో తమ అభిప్రాయాలను పలువురు పార్టీ సీనియర్లు రాహుల్, సోనియా, ప్రియాంక గాంధీల ముందుంచారు. అయితే ఆ సమావేశం జరిగిన తర్వాత కూడా కాంగ్రెస్ అధిష్టానం జీ–23 నేతలు చేసిన సూచనలను పట్టించుకున్న దాఖలాలు లేవని, అçసంతృప్తి కారణంగా పార్టీని వీడాలనుకుంటున్న నాయకులతో ప్రత్యేకంగా చర్చించిన పరిస్థితి సైతం లేదని పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. అందుకే, త్వరలో జరపాలనుకుంటున్న సమావేశం ద్వారా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల్లో ఒక బలమైన సందేశాన్ని పంపించాలని ఢిల్లీ కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment