వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని ఫిలిభిత్ సిట్టింగ్ ఎంపీ వరుణ్ గాంధీకి బీజేపీ మొండిచెయ్యి చూపడంతో ఆయన నెక్స్ట్ స్టెప్ ఏంటనేది చర్చనీయాంశంగా మారింది. పార్టీ అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉంటారా? లేదా ఇతర పార్టీలో చేరి బీజేపీ రెబల్‌గా రంగంలోకి దిగుతారా అనేది ఆసక్తికరంగా మారింది.
తాజాగా బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీకి కాంగ్రెస్ ఆఫర్ ఇచ్చింది. ఆయన్ను తమ పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నామని కాంగ్రెస్ సీనియర్ నేత అధిర్ రంజన్ చౌదరి పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన మాట్లాడుతూ.. వరుణ్ కుటుంబ మూలాలు ‘గాంధీ’తో ముడిపడి ఉండటం వల్లే ఆయనకు బీజేపీ టికెట్ నిరాకరించిందని విమర్శించారు.
వరుణ్ గాంధీ కాంగ్రెస్‌లో చేరాలని అధిర్ రంజన్ చౌదరి కోరారు. ఒకవేళ ఆయన పార్టీలో చేరితే సంతోషిస్తామన్నారు. వరుణ్ ఉన్నతమైన నాయకుడని, బాగా చదువుకున్న నేతగా అభివర్ణించారు. పారదర్శకత కలిగిన వ్యక్తిగా తెలిపారు. వరుణ్‌కు గాంధీ కుటుంబంతో సంబంధాలు ఉన్నాయని, అందుకే ఆయనకు బీజేపీ టికెట్ ఇవ్వలేదని చెప్పారు. వరుణ్ గాంధీ కాంగ్రెస్‌లో చేరాలని తాము కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.
కాగా పిలిభిత్ లోక్‌సభ స్థానం గత నాలుగు ఎన్నికల్లో బీజేపీ ఖాతాలోనే ఉంది. అయితే ప్రస్తుతం ఫిలిభిత్ నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్న వరుణ్ గాంధీని కాదని జితిన్ ప్రసాద్‌ను పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన విషయం తెలిసిందే. కొంతకాలంగా వరుణ్ బీజేపీ పార్టీ విధానాలను వ్యతిరేకిస్తూ తన గళం విప్పారు. సొంత పార్టీపై బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలోనే పార్టీ ఆయనకు టికెట్ నిరాకరించినట్లు సమాచారం.
చదవండి: కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేలను బరిలోకి దింపిన బీజేపీ
Comments
Please login to add a commentAdd a comment