రాహుల్‌పై వరుణ్ ప్రశంసల జల్లు
అమేథీలో స్త్రీల సాధికారతకు రాహుల్ కృషి భేష్ అని కితాబు
తన వ్యాఖ్యల అర్థం అది కాదంటూ ఆనక వివరణ
సుల్తాన్‌పూర్/రాయబరేలి: బీజేపీకి చెందిన వరుణ్‌గాంధీ తన పెదనాన్న కుమారుడైన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీని కీర్తించి ఇరకాటంలో పడ్డారు. ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్న వరుణ్(మేనకాగాంధీ కుమారుడు) మంగళవారం రాత్రి సుల్తాన్‌పూర్‌లో ఓ ఉపాధ్యాయ బృందాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ.. రాహుల్‌గాంధీ స్వయంసహాయక సంఘాల ద్వారా తన నియోజకవర్గం అమేథీలోని మహిళల సాధికారతకు చక్కగా కృషి చేస్తున్నారంటూ ప్రశంసలు కురిపించారు. మహిళల ఉన్నతికోసం రాహుల్ తరహాలో కృషిచేయాల్సిన అవసరముందంటూ.. ఇదేరీతిలో సుల్తాన్‌పూర్‌లో చేయాలని తాను భావిస్తున్నానని పేర్కొన్నారు.
ఒకవైపు రాహుల్‌పై బీజేపీ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్న తరుణంలో వరుణ్ ఇలా ప్రశంసలు కురిపించడం ఆ పార్టీని ఇరకాటంలోకి నెట్టింది. మరోవైపు వరుణ్ వ్యాఖ్యలను బుధవారం రాయబరేలీకి వచ్చిన రాహుల్‌గాంధీ వద్ద విలేకరులు ప్రస్తావించగా.. తమ కృషికి ఇతరుల నుంచి ప్రశంసలు లభించడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో నష్టనివారణ చర్యలు చేపట్టిన వరుణ్‌గాంధీ దీనిపై బుధవారం ట్విట్టర్ ద్వారా వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలను ఏ రాజకీయ పార్టీనో లేదా అభ్యర్థినో సమర్థించినట్టుగా భావించడం తగదని సూచించారు.