బీజేపీ నేత, పిలిభిత్ ఎంపీ వరుణ్ గాంధీ రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో మరోసారి బీజేపీ నుంచి పోటీ చేయనున్నారా? దీనికి ప్రస్తుతానికి ఎవరి వద్దా సమాధానం లేదు. అయితే ఆయన తాజాగా నాలుగు సెట్ల నామినేషన్ పత్రాలు కొనుగోలు చేయడం చర్చనీయాంశంగా మారింది.
రాజధాని ఢిల్లీ నుంచి వచ్చిన వరుణ్ గాంధీ ప్రతినిధులు యూపీలోని పిలిభిత్‌లో నాలుగు సెట్ల నామినేషన్ ఫారాలను కొనుగోలు చేసి, తిరిగి ఢిల్లీకి వెళ్లినట్లు మీడియాకు సమాచారం అందింది. మరోవైపు వరుణ్ గాంధీ పిలిభిత్ నుండి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేస్తాంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఆయన అధికార ప్రతినిధి వీటిని ఖండించారు.
వరుణ్ గాంధీ ఆదేశాల మేరకు నాలుగు సెట్ల నామినేషన్ పత్రాలను కొనుగోలు చేశామని, అందులో రెండు హిందీ, రెండు సెట్లు ఇంగ్లీషు భాషలో ఉన్నాయని ఆయన ప్రతినిధి ఎంఆర్ మాలిక్ తెలిపారు. ఈసారి వరుణ్ గాంధీసీటు మారుతున్నదన్న ఊహాగానాలకు తెరదించుతూ ఈ స్థానం నుంచి వరుణ్ గాంధీనే బీజేపీ అభ్యర్థి అని మాలిక్ స్పష్టం చేశారు.
వరుణ్ గాంధీ గత కొన్నేళ్లుగా తన సొంత పార్టీ ప్రభుత్వ విధానాలపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. అయితే ఈ మధ్యనే ఆయన బీజేపీ నేతలతో మంతనాలు జరిపారు. అలాగే ప్రధాని మోదీని ప్రశంసలతో ముంచెత్తారు. కాగా పిలిభిత్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి ఎవరనేది ఆ పార్టీ ఇంకా ప్రకటించనేలేదు. ఏప్రిల్ 19న పిలిభిత్‌లో తొలి దశలో ఓటింగ్ జరగనుంది. బుధవారం నుంచే ఇక్కడ నామినేషన్ల దాఖలు ప్రక్రియ ప్రారంభమైంది. ఏదీఏమైనప్పటికీ వరుణ్ గాంధీ నాలుగు నామినేషన్ పత్రాలు కొనుగోలు చేయడం పలు సందేహాలకు తావిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment