లక్నో: కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలకు సొంతపార్టీపైనే విమర్శలు చేస్తూ వార్తలు నిలిచారు బీజేపీ ఫిలీభీత్ ఎంపీ వరుణ్ గాంధీ. దీంతో ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో ఫిలీభీత్ సెగ్మెంట్ నుంచి ఆయనకు టికెట్ నిరాకరించింది బీజేపీ. అక్కడ ఈసారి జితిన్ ప్రసాదను బరిలోకి దింపింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ.. వరుణ్ గాంధీని తమ పార్టీలోకి ఆహ్వానించిన విషయం తెలిసిందే. బీజేపీ తనకు టికెట్ నిరాకరించిన తర్వాత తొలిసారి ఎంపీ వరుణ్ గాంధీ స్పందించారు. ఫిలీభీత్ నియోజకవర్గం, అక్కడి ప్రజలతో తనకు ఉన్న జ్ఞాపకాలు, ఆ ప్రాంతంలో చిన్ననాటి సంఘటనలు గుర్తు చేసుకున్నారు.
‘ఈ లేఖలో నాకు భావోద్వేగం కలిగించే లెక్కలేనన్ని జ్ఞాపకాలు ఉన్నాయి. నేను మూడేళ్లు ఉన్న సమయంలో అంటే 1983లో నా తల్లి చేతులు పట్టుకొని మొదటిసారి ఫిలీభీత్ ప్రాంతంలో అడుగుపెట్టాను. చిన్న పిల్లవాడిగా ఉన్న నాకు.. ఇదే ప్రాంతమే నేను పనిచేసే కార్యస్థలం, ఇక్కడి ప్రజలే నా కుటుంబమవుతుందని ఎలా తెలుస్తుంది. ఇన్నేళ్లు ఫిలీభీత్ ప్రజలకు సేవ చేసే అవకాశం కలగటం నా అదృష్టంగా భావిస్తున్నా. పార్లమెంట్ సభ్యుడి పాత్ర మాత్రమే కాకుండా వ్యక్తిగత ఎదుగుదులకు ఇక్కడి ప్రజల నుంచి ఆదర్శాలు, దయ వంటి విలువైన పాఠాలు నేర్చుకున్నా.
..ఫిలీభీత్ ప్రజలకు ఒక ఎంపీగా నా పదవి కాలం ముగియవచ్చు. కానీ, ఇక్కడి ప్రజలతో ఉన్న బంధం మాత్రం నా చివరిశ్వాస ఆగేవరకు కొనసాగుతుంది. నేను ఎంపీగా లేకున్నా. ఫిలీభీత్ ప్రజలకు సేవ చేయడానికి ఒక కొడుకులా నా జీవితాంతం నా ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. నేను రాజకీయాల్లోకి వచ్చిందే సామాన్యుడి స్వరం వినిపించడానికి.. అందుకే మీ అందరి ఆశీర్వాదం నాకు ఉండాలి. ఫిలీభీత్‌కు, నాకు రాజకీయాలకు అతీతంగా ప్రేమ, నమ్మకంతో కూడిన విడదీయరాని అనుబంధం ఉంది. నేను ఎల్లప్పుడూ ఫిలీభీత్ ప్రజలతోనే ఉంటా’ అని బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ సుదీర్ఘంగా లేఖలో పేర్కొన్నారు.
ఇక..1996 నుంచి మేనకా గాంధీ, వరుణ్ గాంధీలకు ఫిలీభీత్ పార్లమెంట్ నియోజకవర్గం కంచుకోట. వరుణ్ గాంధీ ఈ నియోజకవర్గం నుంచి 2009, 2019 సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment