philibith
-
‘వరుణ్ విషయంలో బీజేపీని సవాల్ చేయలేను’
ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో బీజేపీ దూసుకుపోతుంది. 400 స్థానాలే లక్ష్యంగా ప్రచారంలో వేగం పెంచింది. ఇక.. ఈసారి కొంతమంది సిట్టింగ్‌లకు బీజేపీ టికెట్ నిరాకరించిన విషయం తెలిసిందే. అందులో ప్రముఖంగా వరుణ్‌గాంధీకి ఫిలిభీత్ స్థానంలో బీజేపీ అధిష్టానం టికెట్ ఇవ్వకపోవటంపై చర్చ జరిగింది. అయితే తాజాగా శనివారం వరణ్ గాంధీకి టికెట్ కేటాయించకపోవటంపై ఆయన తల్లి మేనకా గాంధీ స్పందించారు. ఆమె ఓ జాతీయ మీడియాతో మాట్లాడారు.‘‘వరుణ్ గాంధీ విషయంలో బీజేపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని తాను సవాల్ చేయలేను. నేను పార్టీకి నిర్ణయానికి గౌరవిస్తాను. అలాగే వరుణ్ గాంధీపై నాకు అపారమైన నమ్మకం, విశ్వాస ఉంది. నా కుమారుడు వరుణ్ గాంధీ చాలా సమర్థవంతుడు, తన స్థాయికి తగినట్లు కృషి చేస్తాడు. కొంతమంది ఎంపీ కావాలనుకుంటారు. కానీ, కొంతమంది ఎంపీ పదవికి ఎంపిక కాకుండానే ప్రజల కోసం రాజకీయనాయకులు అవుతారు. జీవితం మన కోసం ఏం నిక్షిప్తం చేసి ఉందో తెలియదు’’ అని మేనకా గాంధీ అన్నారు. ఇక.. మేనకా గాంధీ ఉత్తర ప్రదేశ్‌లోని సుల్తాన్పూర్ పార్లమెంట్ నుంచి బరిలో ఉన్నారు. ప్రజలకు సేవ చేయటం కోసం మరోసారి బీజేపీ టికెట్ కేటాయించటంపై ఆమె ఆనందం వ్యక్తం చేశారు. ఎన్ని ఓట్లను సాధిస్తార్న ప్రశ్నకు స్పందిస్తూ.. వీలైనన్ని ఎక్కువ ఓట్లు సంపాదించటం కోసం ప్రతిరోజూ ప్రయత్నం చేస్తూ ఉంటానని తెలిపారు.వరుణ్ గాంధీ రెండుసార్లు ఫిలిభీత్ పార్లమెంట్ స్థానం నుంచి గెలుపొందిన విషయం తెలిసిందే. బీజేపీ, ప్రభుత్వ విధానాలకు వరుణ్ గాంధీ బహిరంగంగా విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయనకు బీజేపీ ఫిలిభీత్ టికెట్ నిరారించినట్లు ప్రచారం జరిగింది. -
Varun Gandhi: ‘కడశ్వాస వరకు మీతోనే ఉంటా’
లక్నో: కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలకు సొంతపార్టీపైనే విమర్శలు చేస్తూ వార్తలు నిలిచారు బీజేపీ ఫిలీభీత్ ఎంపీ వరుణ్ గాంధీ. దీంతో ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో ఫిలీభీత్ సెగ్మెంట్ నుంచి ఆయనకు టికెట్ నిరాకరించింది బీజేపీ. అక్కడ ఈసారి జితిన్ ప్రసాదను బరిలోకి దింపింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ.. వరుణ్ గాంధీని తమ పార్టీలోకి ఆహ్వానించిన విషయం తెలిసిందే. బీజేపీ తనకు టికెట్ నిరాకరించిన తర్వాత తొలిసారి ఎంపీ వరుణ్ గాంధీ స్పందించారు. ఫిలీభీత్ నియోజకవర్గం, అక్కడి ప్రజలతో తనకు ఉన్న జ్ఞాపకాలు, ఆ ప్రాంతంలో చిన్ననాటి సంఘటనలు గుర్తు చేసుకున్నారు. ‘ఈ లేఖలో నాకు భావోద్వేగం కలిగించే లెక్కలేనన్ని జ్ఞాపకాలు ఉన్నాయి. నేను మూడేళ్లు ఉన్న సమయంలో అంటే 1983లో నా తల్లి చేతులు పట్టుకొని మొదటిసారి ఫిలీభీత్ ప్రాంతంలో అడుగుపెట్టాను. చిన్న పిల్లవాడిగా ఉన్న నాకు.. ఇదే ప్రాంతమే నేను పనిచేసే కార్యస్థలం, ఇక్కడి ప్రజలే నా కుటుంబమవుతుందని ఎలా తెలుస్తుంది. ఇన్నేళ్లు ఫిలీభీత్ ప్రజలకు సేవ చేసే అవకాశం కలగటం నా అదృష్టంగా భావిస్తున్నా. పార్లమెంట్ సభ్యుడి పాత్ర మాత్రమే కాకుండా వ్యక్తిగత ఎదుగుదులకు ఇక్కడి ప్రజల నుంచి ఆదర్శాలు, దయ వంటి విలువైన పాఠాలు నేర్చుకున్నా. ..ఫిలీభీత్ ప్రజలకు ఒక ఎంపీగా నా పదవి కాలం ముగియవచ్చు. కానీ, ఇక్కడి ప్రజలతో ఉన్న బంధం మాత్రం నా చివరిశ్వాస ఆగేవరకు కొనసాగుతుంది. నేను ఎంపీగా లేకున్నా. ఫిలీభీత్ ప్రజలకు సేవ చేయడానికి ఒక కొడుకులా నా జీవితాంతం నా ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. నేను రాజకీయాల్లోకి వచ్చిందే సామాన్యుడి స్వరం వినిపించడానికి.. అందుకే మీ అందరి ఆశీర్వాదం నాకు ఉండాలి. ఫిలీభీత్‌కు, నాకు రాజకీయాలకు అతీతంగా ప్రేమ, నమ్మకంతో కూడిన విడదీయరాని అనుబంధం ఉంది. నేను ఎల్లప్పుడూ ఫిలీభీత్ ప్రజలతోనే ఉంటా’ అని బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ సుదీర్ఘంగా లేఖలో పేర్కొన్నారు. ఇక..1996 నుంచి మేనకా గాంధీ, వరుణ్ గాంధీలకు ఫిలీభీత్ పార్లమెంట్ నియోజకవర్గం కంచుకోట. వరుణ్ గాంధీ ఈ నియోజకవర్గం నుంచి 2009, 2019 సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించారు. -
కన్నయ్య..రామయ్య ఒక్కడేగా: రామ్ లల్లాకు ముస్లిం మహిళ అద్భుత కానుక
అయోధ్య శ్రీరాముని ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి ముహూర్తం సమీపిస్తున్న తరుణంలో అనేక విశేషాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఒక ముస్లిం మహిళ శ్రీరాముడి పట్ల తన భక్తిని చాటుకోవడం విశేషంగా నిలిచింది.అయోధ్య బాలరామునికి 21.6 అడుగుల భారీ వేణువును రూపొందించింది.ప్రపంచంలోనే అత్యంత పొడవైన వేణువును తయారు చేసింది . కన్నయ్య అయినా రామయ్య అయినా ఒకటేగా అంటోంది భక్తి పారవశ్యంతో. అద్వితీయమైన భక్తితో దీన్ని తానే తయారు చేశానని పిలిభిత్ నగరానికి చెందిన ప్రముఖ శిల్పకారుడు, దివంగత నవాబ్ అహ్మద్ భార్య హీనా పర్వీన్ పేర్కొంది. ఇంతకు ముందు పిలిభిత్‌లో 16 అడుగుల వేణువు రికార్డు ఉండేది. తాజాగా రామయ్యకోసం ఈ రికార్డును బ్రేక్ చేసింది. కుమారుడు అర్మాన్ నబీ,సమీప బంధువు షంషాద్ సాయంతో అతి పెద్ద వేణువును తయారు చేసింది. జనవరి 22న రామ జన్మభూమి కాంప్లెక్స్‌లో పిలిభిత్ వేణు నాదం ప్రతిధ్వనించనుంది. అంతేకాదు పర్వీన్ కుటుంబం మూడు తరాలుగా కన్నయ్య వేణువును తయారు చేస్తోంది. Muslim artisan Hina Parveen has made a 21 feet long Bansuri for Bhagawan Ram in Pilibhit This world's largest playable flute has been sent to Ayodhya Dham#RamMandir #RamMandirPranPratishtha pic.twitter.com/xLlOugj4Y5 — Organiser Weekly (@eOrganiser) January 20, 2024 ఈ వేణువును స్థానిక్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌కు అప్పగించారు. ఇది ప్రపంచంలోనే అత్యంత పొడవైన వేణువుగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించుకుందట. ఈ వేణువు తయారీకి వినియోగించిన వెదరును అస్సాం నుండి సుమారు 20 సంవత్సరాల క్రితం తీసుకువచ్చామని పర్వీన్ కుటుంబం తెలిపింది. రెండు వైపుల నుంచి వాయించ గలిగే ఈ వేణువు తయారీకి 10 రోజులు పట్టిందని అలాగే తయారీకి దాదాపు రూ.70-80 వేలు ఖర్చయిందని వెల్లడించింది. -
పీటలపై వధువు.. వరుడికి అప్పుడే చేసిన టెస్ట్‌లో షాకింగ్ విషయం
లక్నో: పెళ్లంటే ఒక తెలియని ఆనందం. పెళ్లిపై ఎన్నో ఆశలు పెంచుకున్న ఓ జంట పెళ్లి చేసుకునే వేళ ఊహించని ట్విస్ట్ వచ్చి పడింది. కొన్ని గంటల్లో ఇద్దరు ఒక్కటవుతున్నారని అనుకుంటున్న సమయంలో ఊహించని ట్విస్ట్ వచ్చి పడి ఆ పెళ్లి వాయిదా పడింది. వారి పెళ్లికి అడ్డంకిగా నిలిచింది ఏమిటో కాదు మహమ్మారి కరోనా. బాజభజంత్రీలతో ఉత్సాహంగా ఊరేగింపుగా బయల్దేరిన వరుడికి పాజిటివ్ తేలింది. దీంతో మండపంలో ఉండాల్సిన అతడు హోం ఐసోలేషన్‌కు వెళ్లాడు. ఆగిపోయిన పెళ్లి వార్త విశేషాలు మీరే చదవండి. ఉత్తరాఖండ్‌లోని ఖటిమా ప్రాంతానికి చెందిన ముంతాజ్‌కు ఉత్తరప్రదేశ్‌లోని ఫిలిబిత్ జిల్లా చందోయ్ గ్రామానికి చెందిన మల్మాతో వివాహం నిశ్చయమైంది. గురువారం జరగాల్సిన పెళ్లి కోసం వరుడు, వారి కుటుంబసభ్యులు బరాత్ నిర్వహించుకుంటూ వధువు గ్రామం చందోయ్‌కు బయల్దేరారు. రాష్ట్ర సరిహద్దులో వీరిని పోలీసులు అడ్డగించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో నెగటివ్ ఉన్నవారినే యూపీలోకి అడుగు పెట్టనిస్తున్నారు. ‘సార్ పెళ్లి ఉంది.. వదిలేయండి’ అని ఎంత బతిమిలాడినా పోలీసులు వినిపించుకోలేదు. చివరకు విసుగు చెంది అక్కడే సరిహద్దులో పరీక్షలు చేయించుకున్నారు. 41 మందికి పరీక్షలు చేయించుకోగా అందరికీ నెగటివ్ వచ్చింది. కానీ ఆ ఒకరికి మాత్రం పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. అది కూడా వరుడికి పాజిటివ్ రావడంతో కుటుంబసభ్యులతో పాటు పోలీసులు షాక్‌కు గురయ్యారు. పెళ్లి ఉండడంతో జాలిపడి పోలీసులు మూడుసార్లు పరీక్షలు చేశారు. మూడింటిలోనూ పాజిటివ్ అని తేలింది. దీంతో వరుడికి కరోనా సోకిందని నిర్ధారించారు. వెంటనే బంధువులను వెనక్కి పంపించారు. వరుడిని ఐసోలేషన్ కేంద్రానికి పంపించారు. ఈ విషయాన్ని వధువు కుటుంబసభ్యులకు చేరవేశారు. ఈ హఠాత్పరిణామానికి వారు అవాక్కయ్యారు. చివరకు చేసేదేమీ లేక పెళ్లిని వాయిదా వేశారు. ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘మీ పెళ్లి మా సావుకొచ్చింది’ అంటూ కరోనా భయంతో బంధువులు వెనక్కి తగ్గారు. -
పిలిభిత్ టైగర్ రిజర్వ్‌కు అవార్డు
లక్నో :ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్ టైగర్ రిజర్వ్(పీటీఆర్)కు మొట్టమొదటి టీఎక్స్2 అవార్డు లభించింది. తక్కువ సమయంలోనే పులుల సంఖ్య రెండింతలు చేసినందుకుగానూ ఈ అవార్డు లభించింది. వివరాల్లోకెళ్తే.. 2010లో పులులను రక్షించేందుకు, వాటి సంఖ్యను పెంచేందుకు రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్ వేదికగా టీఎక్స్2 గ్లోబల్ అవార్డును ఏర్పాటు చేశారు. ఇందులో టైగర్ రిజర్వ్‌లు ఉన్న 13 దేశాలు పోటీ పడ్డాయి. 2010లో ఉన్న పులుల సంఖ్యను 2022 నాటికి రెండింతలు చేయాలన్నది ఈ అవార్డు అసలు లక్ష్యం. యూపీలోని పీటీఆర్ 2018 నాటికే ఈ ఘనతను సాధించింది. 2014 లెక్కల ప్రకారం పిలిభిత్‌లో 25 పులులున్నాయి. అవి 2018 నాటికి 65కు చేరుకున్నాయి. దీంతో మొదటి గ్లోబల్ అవార్డు భారత్‌ను వరించింది. పులులను జాగ్రత్తగా పర్యవేక్షించడం, దాడులను తగ్గించడం ద్వారా పులుల సంఖ్యను పెంచినట్లు పీటీఆర్ అధికారులు చెప్పారు. -
పులిని పట్టుకుంటేనే ఓటేస్తాం
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని ఫిలిబిత్ జిల్లాలో ఓ ఆడ పులి పెద్ద ఎన్నికలకు సమస్యగా మారింది. గత నవంబర్ నెల నుంచి ఇప్పటి వరకు ఐదుగురు ప్రాణాలను బలితీసుకున్న ఈ పులిని పట్టుకుంటేనే ఈ నెల 15వ తేదీన ఈ ప్రాంతంలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేస్తామని, లేదంటే బహిష్కరిస్తామని ప్రజలతోపాటు స్థానిక సంస్థలు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. ఎన్నికల పేరుతో నెల రోజుల క్రితమే తమ వద్దనున్న లైసెన్స్ ఆయుధాలను, ఆఖరికి దీపావళి టపాసులను కూడా పోలీసులు తీసుకెళ్లి స్టేషన్లలో డిపాజిట్ చేసుకున్నారని ఫిలిబిత్ జిల్లాలోని ఓ అసెంబ్లీ సీటు నుంచి బీఎస్పీ తరఫున పోటీ చేస్తున్న డాక్టర్ శైలేంద్ర గ్యాంగ్వర్ తెలిపారు. పులి భయం కారణంగా తాను అసెంబ్లీ నియోజక వర్గంలో ఇంతవరకు ఒక్క బహిరంగ సభను కూడా నిర్వహించలేక పోయానని ఆయన వాపోయారు. ఎక్కడి నుంచి వచ్చి పులి దాడి చేస్తుందోనన్న భయంతో ప్రజలు వణికిపోతున్నారని చెప్పారు. చివరకు వీధి కుక్క మొరిగినా షెల్టర్ కోసం ప్రజలు పరుగులు తీస్తున్నారని ఆయన అన్నారు. ఇక్కడి ప్రజలకు రాత్రిపూట వరండాలో పడుకునే అలవాటని, అలా పడుకున్నవారిని ఆడ పులి లాక్కుపోతుండడంతో ఇంట్లోనే పడుకోవాల్సి వస్తోందని ఆయన వివరించారు. మల్లాపూర్ గ్రామంలో మొదట ఓ బాలుడిని బలి తీసుకోవడంతో ఆ పులికి గ్రామస్థులు మల్లు అని పేరు పెట్టారు. ఇప్పుడు జిల్లా వాసులంతా ఆ పేరుతోనే ఆ పులిని పిలుస్తున్నారు. ఆ పులికి రెండేళ్లు ఉంటాయని అటవి శాఖ అధికారులు తెలియజేశారు. మొన్న మంగళవారం నాడు కూడా 52 ఏళ్ల నన్హేలాల్ అనే వ్యక్తిని సగం తిని పడేసింది. ఫిలిబిత్‌కు చెందిన రాష్ట్ర మంత్రి హేమరాజ్ వర్మ కూడా జోక్యం చేసుకోవడంతో మల్లును పట్టుకునేందుకు అటవిశాఖ అధికారులు రంగంలోకి దిగారు. మత్తు ఇంజెక్షన్ల ప్రయోగం కోసం లక్నో జూ నుంచి ముగ్గరు వెటర్నరీ డాక్టర్లను పిలిపించారు. లఖీంపూర్‌లోని డూడ్వా టైగర్ రిజర్వ్ నుంచి నాలుగు ఏనుగులను రప్పించారు. ఫిలిబిత్ రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో 40–50 పులులు ఉంటాయని అటవి శాఖ అధికారులు చెబుతుండగా, 60-70 ఉంటాయని ప్రజలు చెబుతున్నారు. ఫిబిత్తోపాటు లఖీంపూర్, ఖేరి, బహరాయిక్లతో కూడిన టెరాయ్ ప్రాంతంలో ప్రజలు అక్రమ సెటిల్మెంట్లు చేసుకోవడం వల్ల తరచుగా పులుల దాడులు జరుగుతున్నాయని అటవి శాఖ అధికారులు చెబుతున్నారు.