పులిని పట్టుకుంటేనే ఓటేస్తాం
పులిని పట్టుకుంటేనే ఓటేస్తాం
Published Fri, Feb 10 2017 7:24 PM | Last Updated on Tue, Sep 5 2017 3:23 AM
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని ఫిలిబిత్ జిల్లాలో ఓ ఆడ పులి పెద్ద ఎన్నికలకు సమస్యగా మారింది. గత నవంబర్ నెల నుంచి ఇప్పటి వరకు ఐదుగురు ప్రాణాలను బలితీసుకున్న ఈ పులిని పట్టుకుంటేనే ఈ నెల 15వ తేదీన ఈ ప్రాంతంలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేస్తామని, లేదంటే బహిష్కరిస్తామని ప్రజలతోపాటు స్థానిక సంస్థలు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. ఎన్నికల పేరుతో నెల రోజుల క్రితమే తమ వద్దనున్న లైసెన్స్ ఆయుధాలను, ఆఖరికి దీపావళి టపాసులను కూడా పోలీసులు తీసుకెళ్లి స్టేషన్లలో డిపాజిట్ చేసుకున్నారని ఫిలిబిత్ జిల్లాలోని ఓ అసెంబ్లీ సీటు నుంచి బీఎస్పీ తరఫున పోటీ చేస్తున్న డాక్టర్ శైలేంద్ర గ్యాంగ్వర్ తెలిపారు.
పులి భయం కారణంగా తాను అసెంబ్లీ నియోజక వర్గంలో ఇంతవరకు ఒక్క బహిరంగ సభను కూడా నిర్వహించలేక పోయానని ఆయన వాపోయారు. ఎక్కడి నుంచి వచ్చి పులి దాడి చేస్తుందోనన్న భయంతో ప్రజలు వణికిపోతున్నారని చెప్పారు. చివరకు వీధి కుక్క మొరిగినా షెల్టర్ కోసం ప్రజలు పరుగులు తీస్తున్నారని ఆయన అన్నారు. ఇక్కడి ప్రజలకు రాత్రిపూట వరండాలో పడుకునే అలవాటని, అలా పడుకున్నవారిని ఆడ పులి లాక్కుపోతుండడంతో ఇంట్లోనే పడుకోవాల్సి వస్తోందని ఆయన వివరించారు. మల్లాపూర్ గ్రామంలో మొదట ఓ బాలుడిని బలి తీసుకోవడంతో ఆ పులికి గ్రామస్థులు మల్లు అని పేరు పెట్టారు. ఇప్పుడు జిల్లా వాసులంతా ఆ పేరుతోనే ఆ పులిని పిలుస్తున్నారు. ఆ పులికి రెండేళ్లు ఉంటాయని అటవి శాఖ అధికారులు తెలియజేశారు. మొన్న మంగళవారం నాడు కూడా 52 ఏళ్ల నన్హేలాల్ అనే వ్యక్తిని సగం తిని పడేసింది.
ఫిలిబిత్‌కు చెందిన రాష్ట్ర మంత్రి హేమరాజ్ వర్మ కూడా జోక్యం చేసుకోవడంతో మల్లును పట్టుకునేందుకు అటవిశాఖ అధికారులు రంగంలోకి దిగారు. మత్తు ఇంజెక్షన్ల ప్రయోగం కోసం లక్నో జూ నుంచి ముగ్గరు వెటర్నరీ డాక్టర్లను పిలిపించారు. లఖీంపూర్‌లోని డూడ్వా టైగర్ రిజర్వ్ నుంచి నాలుగు ఏనుగులను రప్పించారు. ఫిలిబిత్ రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో 40–50 పులులు ఉంటాయని అటవి శాఖ అధికారులు చెబుతుండగా, 60-70 ఉంటాయని ప్రజలు చెబుతున్నారు. ఫిబిత్‌తోపాటు లఖీంపూర్, ఖేరి, బహరాయిక్‌లతో కూడిన టెరాయ్ ప్రాంతంలో ప్రజలు అక్రమ సెటిల్‌మెంట్లు చేసుకోవడం వల్ల తరచుగా పులుల దాడులు జరుగుతున్నాయని అటవి శాఖ అధికారులు చెబుతున్నారు.
Advertisement
Advertisement