న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ సీనియర్ నేత ఆనంద్ శర్మ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఓటర్ల విశ్వాసం కోల్పోయిన ప్రస్తుత ఎన్నికల సంఘాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సంఘం సభ్యులపై విచారణ జరిపించి, చర్యలు తీసుకోవాలని కోరారు. ఎన్నికల సంఘం(ఈసీ) సభ్యులు, కేంద్ర ఎన్నికల కమిషనర్‌ల ఎంపిక, నియామకానికి సంబంధించిన విధానాన్ని రూపొందించేందుకు సుప్రీంకోర్టు ప్రత్యేక ధర్మాసనాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
రాజ్యాంగం ప్రకారం ఎన్నికల నిష్పాక్షికంగా జరిపేందుకు అవసరమైన మార్గదర్శకాలను ఈ ధర్మాసనం రూపొందించాలన్నారు. అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో కేంద్ర మాజీ మంత్రి ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇటీవల అయిదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల తీరు, ఎన్నికల సంఘం వ్యవహార శైలిపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయని సోమవారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా జరపాలన్న రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 పేర్కొన్న ఆదేశాలను ఎన్నికల కమిషన్ ఉల్లంఘించిందని ఆనంద్ శర్మ ఆరోపించారు. బెంగాల్‌లో ఈసీ చర్యలు పూర్తిగా ఏకపక్షంగా ఉన్నాయనీ, ఇలాంటి తీరు గర్హనీయమని తెలిపారు. బీజేపీకి అనుకూలంగా ఈసీ వ్యవహరించిందనేందుకు పలు ఆధారాలున్నాయన్నారు.
ఇటీవలి ఎన్నికల్లో భారీ ర్యాలీలపై నియంత్రణలు విధించని ఈసీని కోవిడ్ ప్రోటోకాల్స్ ఉల్లంఘించినందుకు జవాబుదారీగా చేయాలన్నారు. కోవిడ్ ప్రోటోకాల్స్ అమలు చేయకుండా, కరోనా వ్యాప్తికి, మరణాలకు కారణమైన ఈసీపై హత్యానేరం కింద కేసులు పెట్టాలని ఇటీవల మద్రాస్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
చదవండి: జైలు నుంచి అసెంబ్లీకి..
Comments
Please login to add a commentAdd a comment