బకెట్ వాషింగ్ మెషీన్.. | Bucket washing machine .. | Sakshi
Sakshi News home page

బకెట్ వాషింగ్ మెషీన్..

Published Sun, Nov 2 2014 12:57 AM | Last Updated on Sat, Sep 2 2017 3:43 PM

బకెట్ వాషింగ్ మెషీన్..

బకెట్ వాషింగ్ మెషీన్..

వాషింగ్ మెషీన్.. ఇది లేకుండా చాలా మందికి ఇళ్లలో నడవదు.. అదే సమయంలో మరికొందరికి ఇది అవసరమైనా.. ధర వల్ల కొనుక్కునే పరిస్థితీ లేదు. ఈ అంతరాన్ని పూర్తించే పనిలో పడ్డారు ముంబైకి చెందిన వింబస్ నవరచన సంస్థకు చెందిన పీయూష్ అగర్‌వాలా. దాని ఫలితమే ఈ వీనస్ వాషింగ్ మెషీన్. మన వద్ద 25 లీటర్ల బకెట్.. వీనస్ యంత్రం ఉంటే చాలు.. ఎంచక్కా బట్టలు ఉతికేసుకోవచ్చు. ఒక ట్రిప్పులో 3 జతల వరకూ ఉతుకుతుంది.

బకెట్‌లో నీళ్లు పోసి.. డిటర్జెంట్ వేసి.. దానికి వీనస్‌ను క్లాంప్స్ సాయంతో తగిలించేసి.. పవర్ ఆన్ చేస్తే.. 5 నిమిషాల వ్యవధిలో తళతళలాడే తెలుపు మీ సొంతం. వీనస్ యంత్రం బరువు 2.1 కిలోలు. చిన్నసైజు బ్యాగులో పట్టేస్తుంది. అంటే.. మనం ఎక్కడికెళ్తే.. అక్కడికి తీసుకుపోవచ్చు. ప్రస్తుతం దీన్ని ఉత్పత్తి చేసేందుకు వీలుగా పెట్టుబడి కోసం పీయూష్ ఎదురుచూస్తున్నారు. క్రౌడ్ ఫండింగ్ సైట్ ‘ఇండిగోగో’ ద్వారా ప్రయత్నిస్తున్నారు. రూ.50 లక్షలు వస్తే.. ఉత్పత్తి ప్రారంభిస్తారు. 2015 మే సరికి మార్కెట్లోకి తేవాలని యోచిస్తున్నారు.

‘చాలాకాలం పాటు చేతులతో బట్టలు ఉతకడం వల్ల భుజం, నడుం నొప్పి వస్తుంది. రసాయనాలతో కూడిన డిటర్జెంట్లను వాడటం వల్ల చర్మ వ్యాధులు, దద్దుర్లు రావచ్చు. ముఖ్యంగా వాషింగ్‌మెషీన్ కొనుక్కోలేని అల్పాదాయ వర్గాల వారికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. అంతేకాదు.. ఇంటికి దూరంగా వేరే ప్రాంతాల్లో చదువుకునే విద్యార్థులకూ ఉపయుక్తంగా ఉంటుంది. ఇప్పటికే కొన్నిటిని పరిమిత స్థాయిలో రూ.2,500 చొప్పున విక్రయించాం. భారీ స్థాయిలో ఉత్పత్తి ప్రారంభిస్తే.. ఇది రూ.1,500 కే లభిస్తుంది.’ అని పీయూష్ చెప్పారు. త్వరలో బ్యాటరీతో పనిచేసే దాన్నీ తేవాలని యత్నిస్తున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement