న్యూఢిల్లీ: భారతదేశ ప్రజాస్వామిక విలువలు, లౌకిక వ్యవస్థకు దేశంలోని ప్రస్తుత ‘అల్లకల్లోల రాజకీయ వాతావరణం’ ముప్పుగా పరిణమించిందని ఢిల్లీ ఆర్చిబిషఫ్ అనిల్ కౌటో చేసిన వ్యాఖ్యలు వివాదానికి తెరలేపాయి. కర్ణాటకలో ఎన్నికలకు కొద్దిరోజుల ముందు ఢిల్లీ ఆర్చిడయోసిస్ పరిధిలోని అన్ని చర్చిలు, మత సంస్థలకు ఆయన లేఖ రాస్తూ.. 2019 సాధారణ ఎన్నికల నేపథ్యంలో మే 13 నుంచి ప్రార్థనా ఉద్యమానికి పిలుపునిచ్చారు. దేశం కోసం ప్రతీ శుక్రవారం క్రైస్తవులు ఉపవాసం ఉండాలని ఆయన సూచించారు.
ఈ వ్యాఖ్యల్ని కేంద్ర ప్రభుత్వం తప్పపడుతూ.. అవి కౌటో వివక్షపూరిత మనస్తత్వాన్ని చాటిచెపుతున్నాయని విమర్శించింది. అయితే తన లేఖ మోదీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి కాదని కౌటో మంగళవారం వివరణిచ్చారు. ‘దేశం కోసం వారానికి ఒక రోజు వెచ్చించాలని నేను చెప్పాను. ముఖ్యంగా ఎన్నికలు వస్తున్నందున ఈ సూచన చేశాను. అందువల్ల ఇది ఏ విధంగాను నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి రాసిన లేఖ కాదు.
గత నాలుగేళ్లలో వార్తా పత్రికలు, మీడియాలో ఎన్నో వార్తలు చూశాం. ప్రజల ఆహార అలవాట్లు, దాడుల ఘటనలతో పాటు నలుగురు న్యాయమూర్తులు బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేయడం చూశాం. వీటిపై న్యాయవ్యవస్థ స్థాయిలో ఆందోళన వ్యక్తమైంది. ఒక పౌరుడిగా నేను కూడా ఆందోళన వ్యక్తం చేశాను’ అని లేఖలోని అంశాల్ని ఆయన సమర్థించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment