ఒవైసీ సభ్యత్వాన్ని రద్దు చేయండి
రాజ్‌నాథ్‌కు తెలంగాణ బీజేపీ నేతల ఫిర్యాదు
సాక్షి, న్యూఢిల్లీ : వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేసేందుకు చర్యలు తీసుకోవాలని తెలంగాణ బీజేపీ ప్రతినిధులు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బీజేపీ నేతలు కిషన్‌రెడ్డి, నాగం జనార్దన్‌రెడ్డి, బద్దం బాల్‌రెడ్డి, ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్ శనివారం హోంమంత్రిని కలసి వినతి పత్రం సమర్పించారు. హైదరాబాద్ పాతబస్తీలో ఎన్‌ఐఏ అరెస్టు చేసిన ఐసిస్ సానుభూతిపరులకు న్యాయ సహాయం అందిస్తామని అసదుద్దీన్ బహిరంగంగా ప్రకటించిన విషయాన్ని హోం మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
ఇలాంటి ప్రకటనలు రాష్ట్ర విధానాలపై నమ్మకాన్ని సడలింపజేస్తాయన్నారు. రాష్ట్ర పోలీస్ యంత్రాం కార్యాచరణను నైతికంగా దెబ్బతీస్తాయన్నా రు. ఒవైసీ ఇలాంటి రెచ్చగొట్టే ప్రకటలు చేయడం ఇది మొదటిసారి కాదని, ఇటీవల భారత్ మాతా కీ జై అని తాను పలకబోనని చెప్పారని, ఇది కోట్లాది ప్రజల మనోభావాలను దెబ్బతీసిందని తెలిపారు. అసదుద్దీన్ ఇలాంటి ప్రకటనలు చేస్తుంటే ఆయన సోదరుడు అక్బరుద్దీన్ హిందూ దేవుళ్లపై దూషణపూరిత వ్యాఖ్యలు చేస్తుంటారన్నారు. గత ప్రభుత్వాలు ఆయనపై కేసులు నమోదు చేయగా, ప్రస్తుత ప్రభుత్వం రక్షణ కవచంగా నిలిచిందన్నారు.
టీఆర్‌ఎస్, ఎంఐఎం మిత్రపక్షాలుగా ఉండడం ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితిని సంక్లిష్టంగా మార్చిందన్నారు. బాధ్యతారాహిత్యంగా ప్రకటనలను చేసిన ఒవైసీని అదుపులో పెట్టాల్సిన అవసరం ఉందని, అందువల్ల తక్షణం జోక్యం చేసుకుని గవర్నర్‌కు తగిన సలహాలు ఇవ్వాలని రాజ్‌నాథ్‌ను కోరారు. ఎన్‌ఐఏ బృందాలు వచ్చే వరకు స్థానిక పోలీసులకు ఐసిస్ ఉగ్రవాదుల జాడ తెలియకపోవడం టీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యమేనని దుయ్యబట్టారు. త్వరలో సేవ్‌హైదరాబాద్ ప్రచారాన్ని నిర్వహిస్తామని ప్రకటించారు.