గాయంతో నవ్వులు పూయించిన కేన్సర్ రోగి
న్యూఢిల్లీ: కేన్సర్ సోకిందని తెలియగానే ఇక మరణ శాసనం రాసుకున్నట్టు భయపడిపోతాం. తీరని విషాదంలో మునిగిపోతాం. కానీ అంతటి విషాదంలో తన గాయానికి, కొంచెం చతురతను జోడించి నలుగురికీ నవ్వులు పంచిన వైనం పలువురి ప్రశంసలందుకుంది. బ్రెయిన్ ఆపరేషన్ తర్వాత మిగిలిన మచ్చతో కలిపి ఒక ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడో కేన్సర్ రోగి. ఫొటో చూసిన నెటిజన్లు ఆ యువకుడిని పలువురు అభినందనల్లో ముంచెత్తారు. త్వరలో కేన్సర్ బారి నుంచి బయట పడాలని ఆకాంక్షించారు. ఆత్మవిశ్వాంసతో కేన్సర్ను జయించాలని కోరుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. బ్రెయిన్ కేన్సర్ బారిన పడి ఓ యువకుడికి ఆపరేషన్ చేసి మెదడులో ఉన్న కణితి తొలగించారు వైద్యులు. ఈ సందర్భంగా ఆపరేషన్ తరువాత కుట్లు వేయడానికి పిన్నులు వాడారు. చూడ్డానికి అచ్చం కోటు జిప్లాగా ఉన్న తన గాయాన్ని చూసి అతనికి ఓ ఐడియా వచ్చింది. అంతే.. తల పైనుంచి మెడ వరకు పిన్నులతో ఉన్న ఆ గాయానికి జిప్లకు చివర ఉండే పిన్ను అంటించాడు. ఆ పిన్నులను తొలగించుకోవడానికి ఆస్పత్రికి వెళ్లేముందు దాన్ని ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
తనకు 'మెడుల్లా బ్లాస్టోమా' అనే వ్యాధి సోకిందని తెలిపాడు. బ్రెయిన్ సర్జరీ అయిందనీ, ఈ సందర్భంగా తన గాయాన్ని ఇలా సరదాగా పోస్ట్ చేశానని కామెంట్ పెట్టాడు.