నవ్వు ఆరోగ్యానికి మంచిదని మనందరికి తెలుసు. తీరికలేని లైఫ్‌స్టైల్, బాధ్యతలు, బరువులతో నవ్వడం కూడా మర్చిపోతున్నాం. ఇది చాలదన్నట్లు రెండేళ్లపాటు ప్రపంచాన్ని శాసించిన కరోనా పుణ ్యమా... ముఖానికి మాస్కుల తాళం పడింది. శానిటైజర్లు ఆవిరైపోయినట్లే ముఖాల మీద నవ్వులు మాయ మయ్యాయి. ఇప్పుడు చాలామందికి చక్కగా నవ్వడం ఎలాగో తెలియడం లేదు. ఈ జాబితాలో జపాన్ వాసులు ముందు వరుసలో ఉన్నారు. గత కొద్దికాలంగా నవ్వడం మర్చిపోయిన జపనీయులు ప్రస్తుతం నవ్వులు ్రపాక్టీస్ చేయడం కోసం కోచింగ్ సెంటర్‌లకు క్యూ కడుతున్నారు. ఇది కాస్త చిత్రంగా, మనకు నవ్వొస్తున్నా సరే... హహ్హా నవ్వుల కోసం వారు తెగ హడావుడి చేస్తున్నారు.
నవ్వు ఆరోగ్యమేగాక, నవ్వడం వల్ల ముఖ కండరాలకు మంచి వ్యాయామం జరిగి ముఖం మరింత గ్లోగా కనిపిస్తుంది. ఒత్తిడి దూరమవుతుంది. ఎక్కడైనా పని లేదా ఉద్యోగం చేయాలన్నా ముఖం మీద చిరునవ్వు తప్పనిసరి. దానితోనే నలుగురితోపాటు ముందుకు సాగగలం. ఇదే విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న జపనీయులు శ్రద్ధగా నేర్చుకుని మరీ నవ్వుతున్నారు. అక్కడి స్మైలింగ్ కోచింగ్ సెంటర్లకు డిమాండ్ బాగా పెరిగిపోయింది.
కోవిడ్ ఆంక్షలు, కొన్ని రకాల ఫ్లూల వల్ల దాదాపు మూడేళ్లపాటు మాస్కులు ధరించిన జపనీయులు నవ్వడం మర్చిపోయారు. ప్రస్తుతం అక్కడి ప్రభుత్వం ఆంక్షలు సడలించడంతో ‘స్మైలింగ్ లెసన్స్’ నేర్చుకుంటున్నారు. చక్కగా నవ్వేందుకు ఏకాగ్రతతో పాఠాలు వింటున్నారు. ఒక్కో స్మైలింగ్ ట్రైనర్ దగ్గర మూడు వేలమంది క్లాసులకు హాజరవుతున్నారంటే అక్కడి డిమాండ్ ఏంటో తెలుస్తోంది.
హాలీవుడ్ స్మైల్...
గతంలో రేడియో హోస్ట్‌గా పనిచేసిన కైకో క్వానో స్మైలింగ్ ఇన్‌స్టిట్యూట్‌ను నడుపుతున్నారు. ‘‘హాలీవుడ్ స్టైల్ స్మైలింగ్ టెక్నిక్’’ను నేర్పించడం ఈమె ప్రత్యేకత. కళ్లను నెలవంకలా తిప్పి, బుగ్గలను గుండ్రంగా పెట్టి పై దవడలోని ఎనిమిది దంతాలు కనిపించేలా నవ్వడమే హాలీవుడ్ స్మైల్. ప్రస్తుతం జపనీస్ విద్యార్థులు ఈ నవ్వుని ఎగబడి నేర్చుకుంటున్నారు. ‘‘విద్యార్థులు, నిరుద్యోగులు అధిక సంఖ్యలో మా దగ్గర క్లాసులు చెప్పించుకుంటున్నారు.
భవిష్యత్‌లో చేయబోయే ఉద్యోగాలకు నవ్వు ముఖ్యమని వారంతా క్లాసులకు హాజరవుతున్నారు. స్మైల్ ఎడ్యుకేషన్ గతంలోకంటే ఇప్పుడు నాలుగు రెట్లు పెరిగింది. ఒక్కోక్లాసుకు మన రూపాయల్లో సుమారు రూ.4,500 తీసుకుంటున్నాము. నవ్వుతూ ఎవరిని పలకరించినా అ΄్యాయంగా దగ్గరవుతారు’’ అని క్వానో చెబుతోంది. నవ్వితే ముత్యాలేమీ రాలిపోవు, నాలుగు రకాలుగా మంచే జరుగుతుంది కాబట్టి మనం కూడ మనసారా నవ్వుదాం.
‘‘నవ్వు అనేది సహజసిద్ధంగా జరగాల్సిన ఒక ప్రక్రియ. ఇది చాలా ముఖ్యమైనది. ఎవరినైనా కలిసినప్పుడు మొదట మన నవ్వే పలకరిస్తుంది. మంచి మర్యాదలు మన నవ్వులోనే కనిపిస్తాయి. నవ్వడం మానేస్తే ముఖ కండరాలను ఎలా వాడాలో మెదడు మర్చిపోతుంది అని నిపుణులు చెబుతున్నారు. అందుకే నవ్వడం చాలా ముఖ్యం’’ అని స్మైలింగ్ ఇన్‌స్ట్రక్టర్ మిహోకిటానో చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment