ఇక బ్యాలెట్‌పై అభ్యర్థుల ఫొటోలు | candidates photos will appear on election ballet | Sakshi
Sakshi News home page

ఇక బ్యాలెట్‌పై అభ్యర్థుల ఫొటోలు

Published Thu, Mar 19 2015 3:11 AM | Last Updated on Tue, Aug 14 2018 4:34 PM

ఇక బ్యాలెట్‌పై అభ్యర్థుల ఫొటోలు - Sakshi

ఇక బ్యాలెట్‌పై అభ్యర్థుల ఫొటోలు

  • ఈసీ నిర్ణయం: సీఈఓలకు మార్గదర్శకాలు
  • ఒకే తరహా పేర్లతో గందరగోళాన్ని నివారించటమే లక్ష్యం
  • ఈ ఏడాది మే 1వ తేదీ నుంచి జరిగే ఎన్నికల్లో అమలు
  • అభ్యర్థి పేరుకు, ఎన్నికల గుర్తుకు మధ్య ఫొటో ముద్రణ
  • నామినేషన్ పత్రాలతో పాటే అభ్యర్థులు ఫొటోనూ ఇవ్వాలి
  •  
    న్యూఢిల్లీ: ఏదైనా నియోజకవర్గంలో ఒకే విధమైన పేర్లు గల అభ్యర్థులు ఎన్నికల్లో పోటీచేస్తున్నపుడు ఓటర్లు గందరగోళ పడకుండా బ్యాలెట్ పేపర్ మీద ఆయా అభ్యర్థుల పేర్లు, పార్టీ గుర్తుల పక్కన వారి వారి ఫొటోలను కూడా ముద్రించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్య ఎన్నికల అధికారులకు మార్గదర్శకాలు జారీచేసింది. ఈ ఏడాది మే 1 తర్వాత నిర్వహించే ఎన్నికల్లో.. బ్యాలెట్ పేపర్లు, పోస్టల్ బ్యాలెట్ పేపర్లు, ఈవీఎం (ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లు)పై ప్రదర్శించే బ్యాలెట్ పేపర్లపై అభ్యర్థుల ఫొటోలు  ఉంటాయని అందులో పేర్కొంది. ఒకే రకమైన పేర్లు, పోలిక గల పేర్లతో పలువురు అభ్యర్థులు ఒకే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఉదంతాలు చాలా ఉన్నాయని ఈసీ ప్రస్తావించింది.
     
    ఇద్దరు అంతకన్నా ఎక్కువ మంది అభ్యర్థులు ఒకే రకమైన పేర్లు కలిగివున్నపుడు.. వారి పేర్ల చివర తగిన వివరాలను పేర్కొంటున్నప్పటికీ.. ఓటింగ్ సమయంలో ఓటర్లలో గందరగోళాన్ని తొలగించేందుకు అదనపు చర్యలు అవసరమని భావిస్తున్నామంది. ఈ అంశంపై సుప్రీంకోర్టులో పిటిషన్ విచారణ పెండింగ్‌లో ఉన్న విషయాన్ని గుర్తుచేసింది. ఈ నేపథ్యంలో బ్యాలెట్ పేపర్లపై అభ్యర్థుల ఫొటోలను ముద్రించేందుకు సీఈఓలకు అనుమతిస్తూ.. ఎన్నికల ప్రవర్తనా నియమావళి కింద ప్రస్తుతం అమలులో ఉన్న మార్గదర్శకాలలో ఈసీ మార్పు చేసింది. బ్యాలెట్‌పై అభ్యర్థి పేరుకు - సదరు అభ్యర్థి ఎన్నికల గుర్తుకు మధ్య అతడు లేదా ఆమె ఫొటోను ముద్రించటం జరుగుతుందని వివరించింది.

    ఇందుకోసం అభ్యర్థులు నామినేషన్ పత్రాలతో పాటు.. ఇటీవల తీయించుకున్న  ఫొటోను బ్లాక్ అండ్ వైట్‌లో కానీ, కలర్‌లో కానీ సమర్పించాల్సి ఉంటుందని.. ఈ ఫొటోలు ఎటువంటి యూనిఫాంనూ అంగీకరించరని, టోపీలు, నల్ల కళ్లద్దాలను వినియోగించరాదని పేర్కొంది. అయితే.. అభ్యర్థి నామినేషన్ల సమయంలో తన ఫొటోను ఇవ్వలేకపోతే.. దాని ప్రాతిపదికగా అతడి నామినేషన్‌ను తిరస్కరించటానికి వీలు లేదని స్పష్టంచేసింది. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల ఫొటోలను బ్యాలెట్ పత్రాలపై ముద్రించే ఆలోచన చేస్తున్నామని ఈసీ ఇటీవల సుప్రీంకోర్టుకు నివేదించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement