
ప్రతి రైలుకూ భద్రత కల్పించలేం
''వెళ్లే వచ్చే ప్రతి రైలుకూ మేం రక్షణ కల్పించలేం''... రాజధాని ఎక్స్ప్రెస్ ప్రమాదం గురించి ప్రస్తావించినప్పుడు తూర్పు మధ్య రైల్వే జనరల్ మేనేజర్ మధురేష్ కుమార్ స్పందన ఇదీ!! మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో శతాబ్ది, రాజధాని లాంటి ప్రీమియం రైళ్లు ఏవైనా వెళ్తుంటే దానికి ముందుగా ఒక 'పైలట్ ఇంజన్' వెళ్లాలి. రైలు వెళ్లే మార్గం సురక్షితంగా ఉందా, లేదా అనే విషయాన్ని ఈ పైలట్ ఇంజన్ పరీక్షించాలి. ఇది తప్పనిసరిగా చేయాల్సిన ప్రక్రియ. కానీ, బుధవారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదానికి ముందు ఈ పరీక్ష చేయలేదు. ఈ విషయాన్ని రైల్వే అధికారులు కూడా అంగీకరించారు. అయితే ఇంత ప్రమాదం జరిగి, ఐదుగురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయినా.. రక్షణ కల్పించే విషయంలో మాత్రం జనరల్ మేనేజర్ చాలా బాధ్యతారహితంగా సమాధానం ఇచ్చారని బాధితులు అంటున్నారు.
న్యూఢిల్లీ నుంచి అసోం వెళ్తున్న రాజధాని ఎక్స్ప్రెస్ బీహార్లో పట్టాలు తప్పి, ఐదుగురు మరణించిన విషయం తెలిసిందే. బీహార్లోనే జరిగిన మరో సంఘటనలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. రాజధాని సంఘటన వెనుక నక్సల్స్ హస్తం ఏమైనా ఉందేమోనని అధికారులు అనుమానిస్తున్నారు. అయితే కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ మాత్రం ఇది నక్సల్స్ పని అనడం తొందరపాటు అవుతుందని వ్యాఖ్యానించారు.