'కావేరి నీళ్లు ఇప్పట్లో వదలం'
కర్ణాటక: ఇప్పట్లో కావేరి నీళ్లు ఇవ్వడం కుదరదని కర్ణాటక స్పష్టం చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టుకు వివరణ ఇచ్చింది. గతంలో ఇచ్చిన తీర్పును సమీక్షించి సవరణ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేసింది. డిసెంబర్ వరకు తమిళనాడుకు నీళ్లు ఇవ్వలేమని అత్యున్నత న్యాయస్థానానికి చెప్పింది. 42 వేల క్యూసెక్కుల నీటిని వదులుతామని అయితే, అది కూడా డిసెంబర్ తర్వాత మాత్రమే చేస్తామని తెలిపింది. తమ రాష్ట్రంలో పలు నగరాలు తాగునీటి సమస్యను ఎదుర్కొంటున్నాయని, అవి ఆ సమస్యనుంచి బయటపడిన తర్వాత చూస్తామని చెప్పింది.
తమిళనాడు రాష్ట్రానికి ఈ నెల(సెప్టెంబర్) 27 వరకు రోజుకు 6వేల క్యూసెక్కుల కావేరీ జలాలను విడుదల చేయాలని సుప్రీంకోర్టు కర్ణాటకను ఆదేశించింది. కావేరి పర్యవేక్షక కమిటీ గతంలో ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ కర్ణాటక ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టి నాలుగు వారాల్లోగా కావేరీ నదీ యాజమాన్య బోర్డు ఏర్పాటు చేయాలని ఆ సందర్భంగా కేంద్రాన్ని ఆదేశించింది. ఆ సమయంలో తమిళనాడులో తీవ్ర నీటి కొరత ఉందని ఆ రాష్ట్ర న్యాయవాది నఫ్రే న్యాయస్థానం దృష్టికి తీసుకురాగా తదుపరి విచారణ 27వ తేదీకి వాయిదా పడింది. ఈ నేపథ్యంలో తాము నీళ్లు ఇప్పట్లో ఇవ్వబోమని కర్ణాటక మరోసారి చెప్పినందున రేపు జరగబోయే విచారణ సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి.