రాజధానంటే కేవలం వ్యాపార కేంద్రమే కాదు
- రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి
- బెంగళూరులో ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు
సాక్షి, బెంగళూరు : రాజధాని అంటే వ్యాపార కేంద్రాన్ని నిర్మించడమే కాదని.. సకల వసతులతో ప్రజల జీవనానికి అనుకూలమైన నగరాన్ని నిర్మించడమని రాజ్యసభ సభ్యు డు, వైఎస్సార్‌సీపీ నేత విజయసాయిరెడ్డి అభిప్రాయపడ్డారు. ఆదివారమిక్కడ డాక్టర్ వైఎస్సార్ మెమోరియల్ ఫౌండేషన్ కర్ణాటక ఆధ్వర్యంలో దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలుజరిగాయి. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటారన్నారు. ‘వ్యవసాయం దండగ కాదు పండగ’ అని రుజువు చేసిన ఘనత వైఎస్సార్‌కే దక్కుతుందన్నారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్య శ్రీ, డ్వాక్రా మిహ ళలకు పావలా వడ్డీకే రుణాలు తదితర పథకాల ఫలాలను అన్ని వర్గాలకూ అందించారని కొనియాడారు. కాగా, రాజధాని అమరావతిని ప్రజల జీవనానికి అనుకూలంగా నిర్మించినపుడే అది మంచి నగరమవుతుందన్నారు. లేదంటే ‘ఘోస్ట్‌సిటీ’గా మారుతుందన్నారు. అనంతరం ‘గడప గడపకూ వైఎస్సార్’ కార్యక్రమాన్ని విజయసాయిరెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నేతలు తిప్పేస్వామి, తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి, దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి, బియ్యపు మధుసూధన్ రెడ్డి, వైఎస్సార్ మెమోరియల్ ఫౌండేషన్ కర్ణాటక అధ్యక్షుడు భక్తవత్సల రెడ్డి తదితరులు పాల్గొన్నారు.