కాలక్షేపంతో కుస్తీ.. నచ్చిన వాటితో దోస్తీ... కాదని బయటకెళ్తే అవుద్ది సుస్తీ... ప్రస్తుత యువత పాటిస్తున్న లాక్‌డౌన్ ఫార్ములా ఇది. అయితే ఈ యువత ఇప్పుడు నెట్టింట్లో గొడవలకు దిగుతున్నారు. అవును కొందరు యూట్యూబ్‌కు జై కొడుతుంటే మరికొందరు టిక్‌టాక్‌కు దాసోహం అంటున్నారు. దీన్నే కాన్సెప్ట్‌గా తీసుకున్న ఓ యువకుడు వీడియో తీసి యూట్యూబ్‌లో పోస్ట్ చేశాడు. గమనిక ఏంటంటే అతడు యూట్యూబ్ సపోర్టర్. ఇక ఈ వీడియోలో ఓ వ్యక్తి టిక్‌టాక్ లేనిదే యూట్యూబ్ లేదని బల్లగుద్ది చెప్తుంటే... యూట్యూబరేమో అంత సీన్ లేదంటూ గాలి తీసేస్తున్నాడు. అంతేనా.. వీటికి ఫన్నీ వీడియోలను జత చేస్తూ కౌంటర్లు ఇవ్వడం ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తోంది. కానీ టిక్‌టాకర్లను మాత్రం ఉడికిస్తోంది. (ఏడాది తర్వాత ఆ అద్భుతాన్ని చూశా)
తిడుతూనే కామెడీ పండిస్తాడు
అజేయ్ నగర్.. ఇతనో యూట్యూబర్, కమెడియన్, ర్యాపర్. దేన్నైనా రోస్ట్ అదే.. ఉతికారేయడం అతనికి మంచినీళ్లు తాగినంత సులువు. అయితే తిడుతూనే కామెడీ పండించడం అతని ప్రత్యేకత. అందుకే ఇతనికి మన దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అతని ఛానల్‌కు ఉన్న 12.2 మిలియన్ల సబ్‌స్క్రైబర్సే అతని ఫాలోయింగ్‌కు నిదర్శనం. దీంతోపాటు అతను క్యారీస్‌లైవ్ అనే మరో ఛానల్ తెరిచాడు. ఇంకేముందీ, అందులోనూ వీడియో అప్‌లోడ్ చేసిన కొద్ది క్షణాలకే మిలియన్ల లైకులు వచ్చిపడుతున్నాయి.
టిక్‌టాక్ పనికి మాలిన యాప్
ఇదిలా వుండగా సోషల్ మీడియా యాప్స్‌ను వెనక్కు నెట్టేందుకు టిక్‌టాక్ తెగ ప్రయత్నిస్తోంది. అయితే ఇదో పనికి మాలిన యాప్ అని, దీన్ని నిషేధించాలంటూ పలువురు డిమాండ్ చేసిన సంఘటనలు కూడా విదితమే. వీటన్నింటిపై ఆవేదన చెందిన ఓ టిక్‌టాక్ యూజర్ అమీర్ సిద్దిఖీ టిక్‌టాక్ వల్ల ఎంతో మేలు జరుగుతుందంటూ, దాని గురించి వివరిస్తూనే పాపులర్ యూట్యూబర్‌లపైనా విమర్శలు ఎక్కు పెట్టాడు. మరి యూట్యూబ్ వాళ్లేమైనా తక్కువ తిన్నారా? అతనికి ధీటుగా బదులిస్తూ కౌంటర్లిచ్చారు. అయితే అందులో క్యారీమినటిగా ప్రసిద్ధి పొందిన అజేయ్ నగర్ వీడియో మాత్రం తెగ వైరల్ అయింది. దీనికి వచ్చిన రికార్డులు చూస్తే మీరు నోరెళ్లబెట్టకుండా ఉండరు.
► ఎంతో వేగంగా 5 మిలియన్ల లైకులు సాధించుకున్న ఇండియన్ వీడియో
► తొలి 24 గంటల్లో ఎక్కువమంది భారతీయులు లైక్ చేసిన వీడియో
► తొలి 24 గంటల్లో ప్రపంచంలోనే ఎక్కువమంది లైక్ చేసిన రెండో వీడియో
► యూట్యూబ్‌లో నాల్గవ మోస్ట్ లైక్‌డ్ ఇండియన్ వీడియో
► అత్యధిక కామెంట్లు వచ్చిన రెండో ఇండియన్ వీడియో
► ఒక్కరోజులో అత్యధిక సబ్‌స్క్రైబర్లు
► 24 గంటల్లో ఎక్కువ మంది భారతీయులు చూసిన ఎనిమిదవ వీడియో
ఇక #carryminati హ్యాష్‌ట్యాగ్ ప్రస్తుతం ట్విటర్‌లో ట్రెండింగ్‌గా నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment