
సాక్షి, చెన్నై: తమిళనాడు సీఎం, తిరునల్వేలి కలెక్టర్, ఎస్పీలపై వ్యంగ్య కార్టూన్ వేసిన జి.బాల అలియాస్ బాలక్రిష్ణన్‌ను పోలీసులు అరెస్టుచేశారు. తిరునల్వేలి కలెక్టర్ చేసిన ఫిర్యాదు మేరకు క్రైమ్ బ్రాంచి పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. వడ్డీ వ్యాపారుల వేధింపులకు తాళలేక గత నెల 23న ఇసక్కి ముత్తు అనే వ్యక్తి తన ఇద్దరు పిల్లలు, భార్యతో కలిసి తిరునల్వేలి కలెక్టరేట్‌లో నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ‘లయన్స్ మీడియా’ వెబ్‌సైట్‌ను నడుపుతున్న బాల ఓ వ్యంగ్య కార్టూన్ వేశారు. అందులో అగ్నికి ఆహుతువున్న వ్యక్తి దగ్గర సీఎం పళనిస్వామి, తిరునల్వేలి జిల్లా కలెక్టర్ సందీప్, పోలీసు కమిషనర్‌లు నగ్నంగా ఉన్నట్లు వేశారు. ఈ కార్టూన్ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. కాగా, బాల అరెస్టును కార్టూనిస్టు, పాత్రికేయ సంఘాలు తీవ్రంగా ఖండించాయి. బాలను బలంతంగా లాక్కెళ్లిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి.
Comments
Please login to add a commentAdd a comment