కాళేశ్వరం ప్రాజెక్టు(పాత చిత్రం)
ఢిల్లీ : కాళేశ్వరం ప్రాజెక్టుపై సుప్రీంకోర్ట్‌లో కేసు దాఖలు చేసినట్లు విశ్రాంత నీటిపారుదల శాఖ ఇంజనీర్ దొంతుల లక్ష్మీనారాయణ తెలిపారు. రీడిజైన్ పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నట్లు పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ కేసును ఈ నెల 9న సుప్రీం కోర్టు విచారణకు స్వీకరించనుంది. ప్రాజెక్ట్ నీటి నిల్వ సామర్ధ్యం అవసరానికి మించి ఉందని, రీడిజైన్ పేరుతో ప్రజాధనం వృధా చేస్తున్నట్లు తెలిపారు. కాళేశ్వరాన్ని పర్యాటక ప్రాంతంగా కేసీఆర్ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోందని, కానీ 19 రిజర్వాయర్ల నిర్మాణంతో నీటి అవసరాలకు మించి అదనపు సామర్ధ్యంతో ప్రాజెక్టు నిర్మిస్తున్నారని పిటిషన్లో వెల్లడించారు.
నిల్వ సామర్థ్యం 144 టీఎంసీలు అంటూ.. మొదటి పంటకు 170 టీఎంసీల నీరు ఇస్తామంటూ ప్రభుత్వం పొంతన లేని లెక్కలు చెబుతోందని పేర్కొన్నారు. ఎత్తిపోతల పథకం అంటే అధిక వ్యయంతో కూడుకున్నదని, అనాలోచితంగా ప్రభుత్వం కమీషన్లు, కాంట్రాక్టుల కోసం రీడిజైన్ చేశారని ఆరోపించారు. 50 వేల కోట్ల రూపాయల నిర్మాణం వ్యయం అయ్యే దానికి రీడిజైన్ పేరుతో 90 వేల కోట్ల రూపాయలకు తీసుకొచ్చారని తెలిపారు. అనవసరంగా ప్రజలను నిర్వాసితులుగా చేస్తున్నట్లు పిటిషన్‌లో వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment