న్యూఢిల్లీ: రాష్ట్రపతి బాడీగార్డుల నియామక ప్రక్రియలో మూడు కులాల వారికే ప్రాధాన్యం ఇచ్చారనే ఆరోపణలతో ఢిల్లీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. హరియాణాకు చెందిన గౌరవ్ యాదవ్ అనే వ్యక్తి ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. దీనిని పరిశీలించిన ధర్మాసనం.. నాలుగు వారాల్లోగా వివరణ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు రక్షణ మంత్రిత్వ శాఖ, ఆర్మీ చీఫ్, ఆర్మీ నియామక బోర్డు డైరెక్టర్‌లతో పాటు రాష్ట్రపతి భద్రతా సిబ్బంది కమాండెంట్‌లకు నోటీసులు జారీ చేసింది.
జస్టిస్ ఎస్.మురళీధర్, సంజీవ్ నారులాతో కూడిన ధర్మాసనం బుధవారం ఈ మేరకు వ్యాఖ్యానించింది. కోర్టుకు సమర్పించిన వివరణలో ఏమైనా పొరపాట్లు, సవరణలు ఉంటే వాటిని వచ్చే ఏడాది మే 8వ తేదీ లోపు అందించవచ్చని పేర్కొంది. రాష్ట్రపతి బాడీగార్డుల కోసం 2017 సెప్టెంబర్ 4న చేపట్టిన నియామక ప్రక్రియలో కేవలం జాట్లు, రాజ్‌పుత్‌లు, జాట్ సిక్కు వర్గాల వారి దరఖాస్తులను మాత్రమే ఆహ్వానించారని గౌరవ్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు.
రాష్ట్రపతి బాడీగార్డుగా ఎంపికయ్యేందుకు తనకు అన్ని అర్హతలు ఉన్నా పైన పేర్కొన్న మూడు కులాలకు చెందిన వాడిని కాకపోవడంతో ఉద్యోగం సాధించలేకపోయానని కోర్టుకు నివేదించారు. న్యాయవాది రామ్ నరేశ్ యాదవ్ ద్వారా గౌరవ్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. బాడీగార్డుల నియామకంలో మూడు కులాల వారినే అర్హులుగా ప్రకటించడం వల్ల మిగతా కులాల వారికి అన్యాయం జరిగిందని.. ఇది ఓ రకంగా కుల వివక్ష వంటిదేనని రామ్ నరేశ్ తెలిపారు. ఉద్యోగాల నియామకాన్ని కుల ప్రాతిపదికన చేపట్టడం రాజ్యాంగ నియమాల ఉల్లంఘన కిందకి వస్తుందని పేర్కొన్నారు. అందువల్ల బాడీగార్డుల నియామక ప్రక్రియను రద్దు చేయాలని కోర్టును కోరారు.
Comments
Please login to add a commentAdd a comment