పహ్లాజ్ నిహలానీపై వేటు
► ప్రసూన్ జోషికిసెన్సార్ బోర్డు బాధ్యతలు
► సభ్యురాలిగా విద్యాబాలన్
న్యూఢిల్లీ: జాతీయ సెన్సార్ బోర్డు(సీబీఎఫ్‌సీ) చైర్మన్ పహ్లాజ్ నిహలానీపై వేటు పడింది. సీబీఎఫ్‌సీ పదవినుంచి ఆయన్ను తొలగిస్తున్నట్లు కేంద్ర సమాచార ప్రసార శాఖ శుక్రవారం ఆదేశించింది. ఈయన స్థానంలో బాలీవుడ్ గీత రచయిత ప్రసూన్ జోషిని నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. సినీనటి విద్యాబాలన్‌కు కూడా కొత్త కమిటీలో చోటు కల్పించింది. జూలై చివర్లోనే నిహలానీని తప్పిస్తారని కేంద్రం సంకేతాలిచ్చింది. సీబీఎఫ్‌సీ కమిటీలో నిర్మాణాత్మక మార్పులు జరగనున్నాయని ఇటీవలే సెన్సార్ బోర్డులో సభ్యుడిగా ఎంపికైన∙దర్శక, నిర్మాత వివేక్ అగ్నిహోత్రి వెల్లడించారు.
బ్లాక్, తారే జమీన్‌పర్, భాగ్ మిల్కా భాగ్, రంగ్ దే బసంతి, ఢిల్లీ–6, నీర్జా చిత్రాలకు జోషి పాటలు రాశారు. పద్మశ్రీ అవార్డును, ఉత్తమ గీతరచయితగా జాతీయ అవార్డు అందుకున్న జోషి.. స్వచ్ఛ్ భారత్ అభియాన్‌తో పాటుగా పలు పథకాల ప్రచార గీతాలను రచించారు. జోషిని సీబీఎఫ్‌సీ చీఫ్‌గా నియమించటంపై చిత్రపరిశ్రమ హర్షం వ్యక్తం చేసింది. జోషి నేతృత్వంలోని కమిటీలో విద్యాబాలన్‌తోపాటు గౌతమీ తాడిమల్ల, జీవితా రాజశేఖర్ తదితరులు సభ్యులుగా ఉన్నారు.
వివాదాల పుట్ట నిహలానీ.. 2015లో సెన్సార్ బోర్డు చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించి నప్పటినుంచీ నిహలానీ చుట్టూ వివాదాలు ముసురుకున్నాయి. ఆరెస్సెస్ అండదండలతోనే నిహలానీకి ఈ పదవి దక్కిందనే విమర్శలూ ఉన్నాయి. వివాదాస్పద వ్యాఖ్యలు, చిత్రాల సెన్సార్ విషయంలో చిత్రసీమ నిహలానీ తీరును చాలాసార్లు బహిరంగంగానే విమర్శించింది. తనను ‘ట్రూ ఇండియన్’గా పరిచయం చేసుకునే నిహలానీ.. చాలా చిత్రాలకు కట్స్, బీప్స్, ఖండనల విషయంలో అతిగా వ్యవహరించేవారని విమర్శలున్నాయి.
హాలీవుడ్ చిత్రం ‘ఫిఫ్టీ షేడ్స్ ఆఫ్ గ్రే’ చిత్రంలో అశ్లీలం ఎక్కువగా ఉందంటూ భారత్‌లో విడుదలకు అనుమతించ కపోవటంతో తొలిసారిగా నిహలానీ వార్తల్లో కెక్కారు. జేమ్స్ బాండ్ చిత్రం ‘స్పెక్టర్’లోనూ చాలా సీన్లను ఈయన తొలగించారు. ఆ తర్వాత ఎన్‌హెచ్ 10, దమ్ లగాకే హైస్సా, అలీగఢ్, ఉడ్తా పంజాబ్, హరామ్ ఖోర్, లిప్‌స్టిక్ అండర్ మై బుర్ఖా, ఇందు సర్కార్, బాబుమషాయ్ బందూక్‌బాజ్ మొదలైన చిత్రాల్లోనూ కీలక సన్నివేశాల్లో దృశ్యాలను తొలగించారు.