13 మంది తృణమూల్ నేతలపై సీబీఐ కేసు
నారదా స్టింగ్ ఆపరేషన్ వ్యవహారంలో 13 మంది తృణమూల్ కాంగ్రెస్ నేతలపై సీబీఐ ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. వారిలో పార్టీ సీనియర్ నాయకులు సౌగత రాయ్, ముకుల్ రాయ్, మదన్ మిత్రా సహా పలువురు ఉన్నారు. నెలరోజుల్లోగా ఈ కేసు విషయం తేల్చాలని సీబీఐని సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఆ గడువు సోమవారంతో ముగుస్తుండటంతో సీబీఐ ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. పలువురు తృణమూల్ మంత్రులు, ఎంపీలు అవినీతి నిరోధక చట్టం కింద నేరం చేశారని, దాంతోపాటు కుట్రలకు కూడా పాల్పడ్డారని ఈ కేసులో పేర్కొన్నారు. నారదా చానల్ చేసిన స్టింగ్ ఆపరేషన్ తాలుకు వీడియో ఫుటేజిని కూడా సీబీఐ క్షుణ్ణంగా పరిశీలించింది.
ఈ కేసులో ఇంకా.. సుల్తాన్ అహ్మద్, ఇక్బాల్ అహ్మద్, కకోలి ఘోష్, ప్రసూన్ బెనర్జీ, సుశేందు అధికారి, సోవన్ చటర్జీ, సుబ్రత ముఖర్జీ, సయ్యద్ హుస్సేన్ మీర్జా, ఫిర్హాద్ హకీమ్ తదితరులున్నారు. చిట్‌ఫండ్ స్కాంతో సంబంధం ఉన్న ఇద్దరు ఎంపీలు సుదీప్ బెనర్జీ, తపస్ పాల్ ఇప్పటికే సీబీఐ అదుపులో ఉన్నారు. తృణమూల్ నాయకులు తమ పదవులను అడ్డుపెట్టుకుని లంచాలు తీసుకున్నారనేందుకు ప్రాథమిక ఆధారాలున్నాయని సీబీఐ అధికారులు తెలిపారు. త్వరలోనే వారిని ప్రశ్నిస్తామన్నారు. ఈ కేసును పూర్తిగా విచారించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేస్తారు. స్టింగ్ ఆపరేషన్ సమయంలో వాళ్లు డబ్బులు ఇచ్చిన నారద న్యూస్ ప్రతినిధి మాథ్యూ శామ్యూల్‌ను ఇప్పటికే సీబీఐ ప్రశ్నించింది.