చిదంబరం అనుమతులపైనా దర్యాప్తు
‘ఎయిర్ సెల్-మాక్సిస్’ చార్జిషీటులో సీబీఐ వెల్లడి
న్యూఢిల్లీ: 2006 నాటి ఎయిర్‌సెల్- మాక్సిస్ పెట్టుబడుల ఒప్పందం కేసులో సీబీఐ దర్యాప్తు అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పీ చిదంబరం వరకు చేరింది. మాక్సిస్ అనుబంధ సంస్థ అయిన మారిషస్‌కు చెందిన గ్లోబల్ కమ్యూనికేషన్ సర్వీసెస్ సంస్థకు 800 మిలియన్ డాలర్లను(రూ. 4,866 కోట్లు) విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డీఐ)గా పెట్టేందుకు విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు(ఎఫ్‌ఐపీబీ) అభ్యర్థనపై ఆర్థిక మంత్రిగా చిదంబరం అనుమతులు ఇచ్చారు. అలా అనుమతులు ఇవ్వడానికి దారితీసిన పరిస్థితులపై ప్రస్తుతం దర్యాప్తు జరుపుతున్నట్లు ప్రత్యేక కోర్టుకు సీబీఐ తెలిపింది. ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఓపీ సైనీకి సమర్పించిన చార్జిషీట్ ప్రకారం.. గరిష్టంగా రూ. 600 కోట్ల విలువైన ఎఫ్‌డీఐలకు మాత్రమే అనుమతులిచ్చే అధికారం కేంద్ర ఆర్థిక మంత్రికి ఉంటుంది.
ఆ మొత్తాన్ని మించిన పెట్టుబడులకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ(సీసీఈఏ) అనుమతించాల్సి ఉంటుంది. గ్లోబల్ కమ్యూనికేషన్స్ సంస్థ పెట్టుబడుల విషయంలో మాత్రం ఆర్థిక మంత్రిగా చిదంబరమే అనుమతులు ఇచ్చారు. ఆయన అలా అనుమతులు ఇవ్వడానికి దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు చేస్తున్నట్లు చార్జిషీట్లో సీబీఐ పేర్కొంది. ఎయిర్‌సెల్- మాక్సిస్ ఒప్పందం కేసులో ఇప్పటివరకు టెలికం మాజీ మంత్రి దయానిధి మారన్, ఆయన సోదరుడు కళానిధి మారన్, మలేసియా దేశస్తుడు ఆగస్టస్ రాల్ఫ్.. తదితరులపై సీబీఐ చార్జిషీట్లు దాఖలు చేసింది. కాగా, ఎయిర్‌సెల్- మాక్సిస్ ఒప్పందానికి అనుమతుల విషయంలో నిబంధనల ప్రకారమే నడుచుకున్నానని చిదంబరం స్పష్టం చేశారు.