న్యూఢిల్లీ : ఎంబ్రాయిర్ కుంభకోణం ఒప్పందంపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ కుంభకోణానికి సంబంధించి ప్రధాన సూత్రధారిగా ఉన్న ఎన్నారై ఏజెంట్ విపిన్ కన్నా పేరును సీబీఐ ఎఫ్ఐఆర్లో చేర్చింది. ఈ సందర్భంగా సీబీఐ అధికారి దేవ్ప్రీత్ సింగ్ శుక్రవారమిక్కడ మాట్లాడుతూ ఎంబ్రాయిర్ ఒప్పందంపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, విచారణ ప్రారంభించినట్లు తెలిపారు. యుపిఏ హయాంలో బ్రెజిల్ కంపెనీ ఎంబ్రాయిర్ నుంచి మూడు విమానాలను 208 మిలియన్ అమెరికన్ డాలర్లకు 2008లో భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) కొనుగోలు చేసింది. ఈ క్రమంలో దీనికోసం మధ్యవర్తిత్వం వహించిన మూడో వ్యక్తికి ముడుపులు అందాయనే ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే.
కాగా 2008లో అప్పటి ప్రభుత్వం మూడు విమానాలను ఎంబ్రాయిర్ కంపెనీ నుంచి డిఆర్‌డీవోకి కొనుగోలు చేసిన విషయం విదితమే. ఒప్పందం మేరకు 2011లో ఒకటి, 2013లో రెండు విమానాలును డీఆర్డీఓకు బ్రెజిల్ కంపెనీ అందచేసింది. అయితే డీఅర్‌డీవో నిబంధనలు ప్రకారం మూడోవ్యక్తి ప్రమేయముండకూడదు. ఈ క్రమంలో ఒప్పందం విషయంలో మధ్యవర్తిత్వం వహించిన మూడో వ్యక్తికి ముడుపులు అందాయనే ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణల నేపథ్యంలోనే భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఈ కేసును సిబిఐకి అప్పగించింది.
ఎంబ్రాయిర్ స్కాంపై సీబీఐ ఎఫ్ఐఆర్
Published Fri, Oct 21 2016 1:07 PM | Last Updated on Fri, Oct 5 2018 9:09 PM