సాక్షి, ముంబై: నీరవ్ మోదీ (48) న్యూయార్క్‌లో ఒక హోటల్‌లో ఉన్నాడని పలు వార్తలు హల్ చల్ చేస్తుండగా... ఆయన ఎక్కడ ఉన్నదీ తమకు స్పష్టంగా తెలియదనీ విదేశాంగ శాఖ ప్రకటించింది. నీరవ్ మోదీ తమ అధికారులు ఎవరితోనూ సన్నిహితంగా లేడని, ఈ దశలో ఎక్కడ ఉన‍్నదీ చెప్పలేమని విదేశాంగ శాఖ ప్రతినిధి రవీష్ కుమార్ తెలిపారు. ప్రస్తుతం అతని పాస్‌పోర్ట్ నిలిపివేసినందువల్ల ఇక వేరే ఏ దేశానికి వెళ్లలేడని ఆయన పేర్కొన్నారు. ఇపుడు ఎక్కడ ఉన్నాడో అక్కడే ఉంటాడన్నారు.
వేలకోట్ల రూపాయల ఎగవేసి లండన్‌కు చెక్కేసిన మాల్యాను ఇండియాకు వెనక్కి రప్పించేందుకు కష్టాలు పడుతున్న కేంద్రప్రభుత్వానికి మోదీని తిరిగి దేశానికి రప్పించడం పెద్ద సవాలేనని నిపుణులు భావిస్తున్నారు. అంతేకాదు నీరవ్ మోదీ కేసు మాల్యా మాదిరిగా లోన్ డిఫాల్ట్ కేసు కాదని, నీరవ్ మోదీ వేల కోట్ల రూపాయల మేర బ్యాంకులను బురిడీ కొట్టించాడని, మోస పూరితంగా వ్యవహరించాడని ఇది తీవ్రమైన అంశంగా పరిగణించాలని అభిప్రాయపడ్డారు. అయితే బెల్జియన్ పాస్‌పోర్ట్ ఉంటే.. పీఎన్‌బీకి భారీ ఎత్తున నష్టం కలిగించి దేశం విడిచిన డైమండ్ వ్యాపారిని దేశానికి రప్పించడం అంత సులువు కాదని వ్యాఖ్యానించారు.
మరోవైపు దర్యాప్తు సంస్థ సీబీఐ తాజా ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసింది. గీతాంజలి జెమ్స్ సహా (గిలి ఇండియా, నక్షత్ర బ్రాండ్) మూడు కంపెనీలను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చింది. గీతాంజలి జెమ్స్ రూ. 4,886కోట్ల మేరకు మోసానికి పాల్పడిందని సీబీఐ వెల్లడించింది. ఈ మూడు కంపెనీలకు 36 అనుబంధ సంస్థలున్నాయి. వీటిల్లో 17 సంస్థలు ముంబైలోను, ఒకటి హైదరాబాద్‌లోను ఉండగా, మిగిలినవి విదేశాల్లో ఉన్నాయని సీబీఐ శుక్రవారం నాటి విచారణలో తేలింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ముంబై, పుణే, సూరత్, హైదరాబాద్, కోయంబత్తూర్ తదితర 26 ప్రదేశాల్లో సోదాలు నిర్వహిస్తోంది. గీతాంజలి గ్రూపునకు చెందిన ఆస్తులు, ఇతర నిందిత కంపెనీ డైరెక‍్టర్ల నివాసాలతోపాటు ప్లాంట్లు, ఫ్యాక్టరీలు, కార్యాలయాల్లో ఈ దాడులు చేపట్టినట్టు సీబీఐ అధికారి తెలిపారు. అలాగే మోదీ అరెస్ట్‌కు సహకరించాల్సిందిగా ఇంటర్‌పోల్‌ను సీబీఐ కోరింది.
ఇది ఇలా ఉంటే భారీ స్కాం వెలుగులోకి రావడంతో పంజాబ్ నేషనల్ బ్యాంకు శుక్రవారం సాయంత్రం ఇన్వెస్టర్లతో సమావేశం నిర్వహించింది. ఆరునెలల్లో పరిస్థితిని పూర్తిగా అదుపులోకి తీసుకొస్తామని హామి ఇచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment