బ్యాంకులకు రూ.1,700 కోట్ల టోపీ | CBI books VMC Systems in bank fraud case | Sakshi
Sakshi News home page

బ్యాంకులకు రూ.1,700 కోట్ల టోపీ

Published Sat, Sep 29 2018 12:24 AM | Last Updated on Sat, Sep 29 2018 12:25 AM

CBI books VMC Systems in bank fraud case - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: టెలికం, నెట్‌వర్కింగ్, పవర్‌ కన్వర్షన్‌ పరికరాల తయారీలో ఉన్న హైదరాబాద్‌ కంపెనీ వీఎంసీ సిస్టమ్స్‌.. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ) నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్షియానికి రూ.1,700 కోట్ల మేర కుచ్చుటోపీ పెట్టింది. పీఎన్‌బీ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) వీఎంసీతో పాటు, కంపెనీ ప్రమోటర్లు ఉప్పలపాటి హిమబిందు, ఉప్పలపాటి వెంకట రామారావు, బి.వెంకట రమణపై కేసు నమోదు చేసింది.

వీరిపై నేరపూరిత కుట్ర, మోసం, ఫోర్జరీ కేసులు పెట్టటమే కాక... వీఎంసీ సిస్టమ్స్‌ ఆఫీసుతో పాటు డైరెక్టర్ల నివాసాల్లో మొత్తం మూడు చోట్ల సోదాలు కూడా చేసింది. సంస్థకు హైదరాబాద్‌ దగ్గర్లోని రావిర్యాల వద్ద ప్లాంటు ఉంది. ఇక్కడ ఉత్పత్తయ్యే ఉపకరణాలను బీఎస్‌ఎన్‌ఎల్‌తోపాటు వివిధ కంపెనీలకు సరఫరా చేస్తోంది. ఆకాశ్‌ ట్యాబ్లెట్ల విషయంలో దేశవ్యాప్తంగా వివాదాల్లో చిక్కుకున్న డేటావిండ్‌తో ఈ కంపెనీకి గతంలో భాగస్వామ్యం ఉండేది. ట్యాబ్లెట్లు, స్మార్ట్‌ఫోన్లను డేటావిండ్‌తో పాటు పలు కంపెనీలకు సరఫరా చేసింది.

ఇవీ కేసు పూర్వాపరాలు..
నిర్వహణ మూలధనం కోసమని వీఎంసీ సిస్టమ్స్‌ 2009 ఆగస్టు 12న పీఎన్‌బీ, ఎస్‌బీఐ, కార్పొరేషన్‌ బ్యాంక్, ఆంధ్రా బ్యాంక్, జేఎం ఫైనాన్షియల్‌ అసెట్స్‌ రీకన్‌స్ట్రక్షన్‌ కంపెనీల నుంచి రూ.1,010.50 కోట్లు రుణంగా తీసుకుంది. ఈ రుణాలు చెల్లించకుండా డిఫాల్టయింది. బ్యాంకులు ఆరా తీయడంతో కంపెనీ అక్రమాలు బయటపడ్డాయి. రూ.1,010.50 కోట్ల నిర్వహణ మూలధన రుణాల్లో రూ.43.83 కోట్లను బ్యాంకుల అనుమతి లేకుండానే ఏప్రిల్‌ 2013– ఏప్రిల్‌ 2014 మధ్య వేరే బ్యాంకుల ఖాతాలకు మళ్లించింది.

మిగతా నిధులను కూడా ఇలాగే వేరే ఖాతాలకు దారి మళ్లించి ప్రమోటర్లు స్వాహా చేసినట్టు సీబీఐకి పీఎన్‌బీ ఫిర్యాదు చేసింది. తీసుకున్న అప్పు ఇప్పుడు వడ్డీతో కలిపి రూ.1,700 కోట్లయింది. దీన్లో రూ.539 కోట్లు పీఎన్‌బీకే రావాలి. మిగిలిన రూ.1,207 కోట్లు ఎస్‌బీఐ, కార్పొరేషన్‌ బ్యాంక్, ఆంధ్రా బ్యాంక్, జేఎం ఫైనాన్షియల్‌ అసెట్స్‌ రీకన్‌స్ట్రక్షన్‌లకు రావాల్సి ఉంది.  

అన్నీ అబద్ధాలే..
అప్పులు తీర్చాలంటూ బ్యాంకులు ఒత్తిడి చేయడంతో వీఎంసీ ఏదో ఒక సాకు చెబుతూ వచ్చింది. బీఎస్‌ఎన్‌ఎల్‌ నుంచి తమకు రూ.262 కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉన్నట్టు చెప్పింది. అనుమానం వచ్చిన బ్యాంకు అధికారులు ఆరా తీయగా వీఎంసీకి తాము చెల్లించాల్సింది రూ.33  కోట్లు మాత్రమేనని బీఎస్‌ఎన్‌ఎల్‌ తేల్చి చెప్పింది.

ఇంకా ఐటీఐ, న్యుట్రినో పవర్‌ సిస్టమ్స్, వీపీ సిస్టమ్స్‌ల నుంచి రూ.352.99 కోట్ల వరకు బకాయిలు రావాల్సి ఉన్నట్టు వీఎంసీ చెప్పింది. ఎస్‌బీఐ అధికారులు దీనిపై ఆరా తీయగా, అవన్నీ అబద్ధాలేనని తేలటంతో.. పీఎన్‌బీ సీబీఐని ఆశ్రయించింది. బ్యాంకు రుణాలను ప్రమోటర్లు ఏయే ఖాతాలకు మళ్లించారనే అంశంపైనా సీబీఐ శోధిస్తోంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement