
అర్జున్ పాటిల్ భార్య సుజాత పాటిల్
ముంబై : పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) భారీ కుంభకోణం కేసు నేపథ్యంలో గీతాంజలి జెమ్స్‌కు చెందిన పలువురు అధికారులతో పాటు, నీరవ్ మోదీకి చెందిన ఫైర్ స్టార్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్‌లను సీబీఐ అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. వీరిని నిన్న సీబీఐ సెషన్స్ కోర్టు ముందు హాజరుపరిచారు. ఈ కేసు విచారణ నేపథ్యంలో వీరిని మార్చి 5 వరకు పోలీసు కస్టడీలో ఉంచనున్నట్టు సీబీఐ సెషన్స్ కోర్టు ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఫైర్ స్టార్ గ్రూప్‌కు చెందిన సీనియర్ ఎగ్జిక్యూటివ్ అర్జున్ పాటిల్ భార్య సుజాత పాటిల్ తీవ్రంగా స్పందించారు. నీరవ్ మోదీ భారత్‌కు వస్తే, తన చెప్పుతో కొడతానంటూ వ్యాఖ్యానించారు. సెషన్స్ కోర్టు వెలుపల సుజాత పాటిల్ ఈ విధంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్‌ఓయూల దరఖాస్తులను రూపొందించారనే క్రమంలో ఫైర్ స్టార్‌కు చెందిన ఈ సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది. ఈ ఎల్‌ఓయూలతోనే నీరవ్ మోదీ అక్రమాలకు పాల్పడినట్టు తెలుస్తోంది.
''అర్జున్ నెలకు రూ.30వేలు మాత్రమే సంపాదిస్తారు. ఒక్క రూపాయి కూడా అదనంగా తీసుకోరు. ఏం చెప్తే అదే చేస్తారు. ఆయన ఎలాంటి అక్రమాలు పాల్పడలేదు'' అని సుజాత చెప్పారు. రేప్, మర్డర్ చేసిన వారు మాత్రం దర్జాగా బయట తిరుగుతున్నారు, కానీ అమాయకుడైన తన భర్తను మాత్రం అరెస్ట్ చేశారంటూ కన్నీటి పర్యంతమయ్యారు. సీబీఐ తమ ఇంట్లో సోదాలు చేసిందని, కానీ ఏం దొరకలేదన్నారు. ఈ విషయంలో తామేమీ దాయడం లేదని కుండబద్దలు కొడుతున్నట్టు చెప్పింది. ప్రస్తుత పరిణామాలు టీవీ సీరియల్ మాదిరి ఉన్నాయంటూ ఆమె సీబీఐ, మోదీ, మీడియాను నిందించారు.
Comments
Please login to add a commentAdd a comment