సీబీఐకి పదేళ్లుగా విశ్వసనీయతా లోపం: జైట్లీ
అమృత్‌సర్: కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) గత దశాబ్దకాలంలో విశ్వసనీయతా లోపంతో బాధపడిందని శుక్రవారం బీజేపీ నేత అరుణ్ జైట్లీ అన్నారు. రాజకీయ ప్రత్యర్థులను దోషులుగా నిలబెట్టేందుకు అధికార పార్టీ సీబీఐ డెరైక్టర్లను నియంత్రిస్తుండటంతో ఈ పరిస్థితి ఏర్పడిందని ఆయన వ్యాఖ్యానించారు. ‘సీబీఐ.. డెరైక్టర్ల ద్వారా నియంత్రణలో ఉండే సంస్థ. ఆ సంస్థ డెరైక్టర్లు స్వతంత్ర వ్యవస్థల ద్వారా కాకుండా ప్రభుత్వం ద్వారా నియమితులవుతున్నారు.
అందువల్ల వారు ప్రభుత్వ నియంత్రణలో మాత్రమే కాకుండా అధికార పార్టీలోని కీలక వ్యక్తుల నియంత్రణలోనూ ఉంటున్నారు. రాజస్థాన్, గుజరాత్‌లలో బీజేపీ నేతలపై దాఖలైన అసమంజస చార్జిషీట్లను గమనిస్తే ఈ విషయం తెలుస్తుంది’ అని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అందరూ నిజాయితీతో ఉండాలని, సీబీఐ అధికారులు ఇతరుల కన్నా మరింత నిజాయితీగా ఉండాల్సిన అవసరం ఉందని జైట్లీ అభిప్రాయపడ్డారు.