ఆపరేషన్‌ ‘ఎల్లో’.. సీబీఐ హెడ్‌క్వార్టర్స్‌లో తిష్టకు టీడీపీ కుట్ర! | The Role Of TDP In The Issue Of CBI Officers Fighting Case | Sakshi
Sakshi News home page

Published Thu, Oct 25 2018 3:23 AM | Last Updated on Thu, Oct 25 2018 3:00 PM

The Role Of TDP In The Issue Of CBI Officers Fighting Case - Sakshi

సాక్షి ప్రత్యేక ప్రతినిధి–న్యూఢిల్లీ: ‘‘కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)లో చోటుచేసుకున్న తాజా పరిణామాలను తెలుగుదేశం పార్టీ తనకు అనుకూలంగా మార్చుకోవడానికి తెరవెనుక పెద్ద మంత్రాంగమే నడిపింది. సీబీఐ హెడ్‌క్వార్టర్స్‌లో తిష్ట వేయడానికి వీలుగా బలహీన మనస్తత్వం ఉన్న అధికారులను ప్రలోభాలకు గురి చేయడానికి మాస్టర్‌ ప్లాన్‌ వేసింది. దానికోసం తన పార్టీకి చెందిన ఇద్దరు రాజ్యసభ సభ్యులకు ఈ అసైన్‌మెంట్‌  అప్పగించింది. సీబీఐ కీలక అధికారితో ఆ ఇద్దరు రాజ్యసభ సభ్యులు అత్యంత సన్నిహితంగా మెలిగారు. ప్రధాని మోదీకి ఆ అధికారిని సన్నిహితుడిగా భావించిన ఎల్లో గ్యాంగ్‌.. ఆయన ద్వారా కొన్ని కేసులను ఆపరేట్‌ చేసింది.

అంతటితో ఆగకుండా సీబీఐ వ్యవస్థను తలకిందులు చేసే వ్యూహానికి పదునుపెట్టింది. కీలకమైన అధికారుల మధ్య ఘర్షణ వాతావరణానికి కారణమైంది. సీబీఐ కేసు ఎదుర్కొంటున్న ఓ వ్యక్తిని దీనికోసం పావుగా వాడుకుంది. ఇప్పుడదే మొత్తం సీబీఐ విశ్వసనీయతకు అగ్నిపరీక్షగా మారింది’’ ఢిల్లీలోని ఓ సీబీఐ అధికారి ఆవేదన ఇది. బీజేపీ నేతలకు ఈ వ్యవహారం గురించి తెలిసినా టీడీపీ తమ భాగస్వామి కావడంతో ఏనాడు పట్టించుకోలేదు. సీబీఐ డైరెక్టర్, స్పెషల్‌ డైరెక్టర్‌ మధ్య ఘర్షణల నేపథ్యంలో డైరెక్టర్‌గా ఎం. నాగేశ్వరరావు నియామకం వెనుక టీడీపీ స్కెచ్‌ స్పష్టంగా కనిపిస్తోందని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఓ సీనియర్‌ బీజేపీ నేత అన్నారు.

ప్రస్తుత డైరెక్టర్‌ నియామకం అనివార్యంగా జరిగిపోవడానికి టీడీపీ మంత్రాంగమే ప్రధాన కారణమనేది ఢిల్లీలో బీజేపీ నేతల అభిప్రాయంగా ఉంది. గతంలో ఎన్డీఏ ప్రభుత్వంలో చక్రం తిప్పిన ఓ మంత్రి దగ్గర తమకు ఉన్న పలుకుబడిని ఉపయోగించి టీడీపీ నేతలు సీబీఐ వ్యవస్థలోకి చొరబడ్డారని ఢిల్లీలోని సీబీఐ హెడ్‌క్వార్టర్స్‌లో పలువురు అధికారులు మండిపడుతున్నారు. సీబీఐని అపఖ్యాతిపాలు చేసే వ్యవహారం నడపడం వెనుక ఎల్లో గ్యాంగ్‌ వద్ద పెద్ద కథే ఉంది.

ఎన్డీఏతో తెగతెంపులు చేసుకున్న తరువాత తన, తన ప్రభుత్వ అవినీతి కార్యకలాపాలపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించవచ్చంటూ గత 4–5 నెలలుగా వస్తున్న వార్తలను గమనించిన టీడీపీ అధినేత చంద్రబాబు ఆ సంస్థ అధిపతిగా తనకు అనుకూలుడైన వ్యక్తిని నియమించుకోవడమో లేదా ఆ సంస్థకు విశ్వసనీయత లేదని చెప్పించేందుకో పెద్ద కథ నడిపించారన్నది ఢిల్లీలోని అధికార వర్గాల కథనం.

సీబీఐ విచారణకు ఆదేశిస్తారేమోనన్న భయంతోనే...
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రభుత్వ అవినీతి వ్యవహారాలు తమకు తెలుసునని, దీనిపై విచారణకు సిద్ధంగా ఉండాలని ఏపీ బీజేపీ నేతలు ప్రకటనలు చేస్తూ రావడంతో ఎందుకైనా మంచిదని భావించిన టీడీపీ... కీలకస్థాయిలోని అధికారులను మచ్చిక చేసుకునే పనిలో పడింది. అప్పటికే ఢిల్లీలో సీబీఐ అధికారులతో సన్నిహిత సంబంధాలు నెరపుతున్న ఇద్దరు రాజ్యసభ సభ్యులు తమ జోరును పెంచారు. ఇద్దరు సీనియర్‌ అధికారుల మధ్య ప్రచ్చన్న యుద్ధాన్ని వారు అనుకూలంగా మలచుకున్నారని సీబీఐ వర్గాలే బాహాటంగా చెబుతున్నాయి.

సీబీఐలో తమకు చెందిన ఓ అధికారి (ఇతర రాష్ట్రాల కేడర్‌కు చెందిన)ని తమిళనాడు జోన్‌కు జాయింట్‌ డైరెక్టర్‌గా నియమించేందుకు వారు సీవీసీని వాడుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. చెన్నై ప్రధాన కార్యాలయం కింద సీనియర్‌ అధికారిగా ఉంటూ హైదరాబాద్‌లో వై.ఎస్‌. జగన్‌ కేసులను పర్యవేక్షించడంతోపాటు బెయిల్‌ రద్దు చేయాలంటూ కోర్టులో పిటిషన్‌ వేయడం వెనుక ఈ అధికారి ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఆ తరువాత సదరు అధికారిని చండీగఢ్‌కు బదిలీ చేశారు. ఇలా సీబీఐలో పోస్టింగ్‌లను శాసించే స్థాయికి చేరుకున్న టీడీపీ ప్రముఖులు... అంతటితో ఆగకుండా అధికారులు, కేసులు ఎదుర్కొంటున్న వారితో రాజీలు కుదిర్చే పనిలో పడ్డారు.

ఈ నేపథ్యంలోనే ఇద్దరు సీనియర్‌ అధికారుల మధ్య వచ్చిన పొరపొచ్ఛాలు వారి ఉద్యోగాలు పోవడానికి కారణమయ్యాయి. ‘‘గతంలో ఎప్పుడూ మేము ఇలాంటి ఘటనలు చూడలేదు. సీబీఐ కేసుల్లో పరోక్షంగా కేంద్రంలో అధికారంలో ఉన్నవారు జోక్యం చేసుకోవడం సహజం. అది ఎక్కడా బయటకు కనిపించేలా ఉండదు. కానీ టీడీపీ చర్యలను సీబీఐలో చాలా మంది ప్రత్యక్షంగా చూశారు. వై.ఎస్‌. జగన్‌ కేసులకు సంబంధించి ఓ రాజ్యసభ సభ్యుడు నేరుగా వచ్చి స్పెషల్‌ డైరెక్టర్‌ను కలువడం సీబీఐ హెడ్‌క్వార్టర్స్‌లో పెద్ద సంచలనమే అయ్యింది’’ అని ఓ ఎస్పీ స్థాయి అధికారి పేర్కొన్నారు.

అనుకూలత కోసం అడ్డదారులు...
న్యాయవ్యవస్థలో అయినా, సీబీఐ, ఈడీ, ఆదాయపన్ను శాఖల్లో అయినా తమకు అనుకూలమైన వారు ఉండేలా చూసుకునేందుకు టీడీపీది మొదటి నుంచే అడ్డదారే! ఏపీ సీఎం చంద్రబాబు అవినీతిపై విచారణకు ఆదేశించాలని ఎవరైనా న్యాయస్థానాలకు వెళ్తే తమకు అనుకూలమైన బెంచ్‌ దగ్గరకు ఆ కేసు వెళ్లేదాకా నాట్‌ బిఫోర్‌ ప్రయోగాన్ని తెలుగు రాష్ట్రాలకు పరిచయం చేసిందే తెలుగుదేశం పార్టీ. సంక్షోభ సమయాల్లో వ్యవస్థలను వారికి అనుకూలంగా మలుచుకోవడం ఒక ఎత్తయితే, రాజకీయ ప్రత్యర్థులపై లేనిపోని ఆరోపణలు చేసి ఇబ్బందులు సృష్టించడం మరో ఎత్తు. అందులో భాగంగానే ఎన్డీఏ భాగస్వామిగా ఢిల్లీలో చక్రం తిప్పి హైదరాబాద్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌లో తమకు అనుకూలంగా ఉండే అధికారులను నియమించుకుని వై.ఎస్‌. జగన్‌కు వ్యతిరేకంగా ఎన్నో కుట్రలకు పాల్పడ్డారు.

ఇప్పుడు కేసులు తమపైకి ఎక్కడ వస్తాయోనన్న భయంతో కావాల్సిన అధికారులను కీలకస్థాయిలో నియమించుకోవడానికి అన్ని స్థాయిల్లో ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే సీవీసీ ద్వారా సీబీఐ డైరెక్టర్‌గా నాగేశ్వరరావును నియమించేలా చంద్రబాబు పావులు కదిపారని బీజేపీ నేతలు ప్రైవేటు సంభాషణల్లో చెప్పుకుంటున్నారు. నాగేశ్వరరావు నియామకాన్ని కాంగ్రెస్‌ సహా అన్ని విపక్షాలు తప్పుపట్టినా టీడీపీ స్పందించలేదు. నాగేశ్వరరావు నియామకాన్ని విపక్షాలు తప్పుపట్టడం, సుప్రీంలో పిటిషన్‌ దాఖలు కావడంతో కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ మీడియా ముందుకు వచ్చి కేంద్ర విజిలెన్స్‌ కమిషనర్‌ సూచన మేరకే నాగేశ్వరరావును నియమించామని చెప్పారు. నాగేశ్వరరావు నియామకంపై టీడీపీ నోరు మెదపకపోగా సీబీఐ వ్యవస్థ దిగజారిందని, దానికి ప్రధాని మోదీయే కారణమంటూ ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు సన్నాయి నొక్కులు నొక్కడం రాజకీయ వర్గాలను విస్మయానికి గురి చేసింది. 

చదవండి: తెరచాటు బంధానికి ప్రతీకా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement