న్యూఢిల్లీ/ముంబై: పంజాబ్ నేషనల్ బ్యాంకు(పీఎన్‌బీ) కుంభకోణం కేసులో సీబీఐ కొరడా ఝుళిపించింది. ఇంతవరకూ పీఎన్‌బీ అధికారుల అరెస్టుతోనే సరిపెట్టిన సీబీఐ.. నీరవ్ మోదీ కంపెనీ ‘ఫైర్ స్టార్ డైమండ్’లో అత్యున్నత హోదాలో కొనసాగుతున్న కంపెనీ ప్రెసిడెంట్(ఫైనాన్స్) విఫుల్ అంబానీని అదుపులోకి తీసుకుంది. ఆయనతోపాటు మరో నలుగురు ఎగ్జిక్యూటివ్‌లను కూడా అరెస్టు చేసింది. ప్రముఖ వ్యాపారవేత్త దివంగత ధీరూభాయ్ అంబానీకి విఫుల్ బంధువని తెలుస్తోంది. మరోవైపు ఆదాయపు పన్ను శాఖ ఈ కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ సింఘ్వీ భార్య అనితా సింఘ్వీకి నోటీసులు జారీచేసింది.
నీరవ్ కంపెనీలకు చెందిన 8 మంది, గీతాంజలి గ్రూపునకు చెందిన 10 మంది ఉన్నత స్థాయి అధికారుల్ని సీబీఐ సుదీర్ఘంగా విచారించింది. అనంతరం విఫుల్ అంబానీతో పాటు నీరవ్ కంపెనీలకు చెందిన ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ కవితా మన్కికర్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ అర్జున్ పాటిల్, నక్షత్ర గ్రూపు, గీతాంజలి గ్రూపుల సీఎఫ్‌ఓ కపిల్ ఖండేల్‌వాల్, గీతాంజలి గ్రూపు మేనేజర్ నితెన్ షాహిలను అరెస్టుచేసింది. అలాగే పీఎన్‌బీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌తో పాటు మరో 9 మంది సీనియర్ అధికారుల్ని విచారించింది.
మోదీ, చోక్సీలకు చెందిన 13 ప్రాంతాల్లో ఈడీ సోదాలు నిర్వహించి రూ. 10 కోట్ల ఆస్తుల్ని సీజ్ చేసింది. పన్ను ఎగవేత కేసులో గీతాంజలి జెమ్స్ ప్రమోటర్ మెహుల్ చోక్సీ, అతని అనుబంధ కంపెనీలకు చెందిన 20 ప్రాంతాల్లో ఆదాయపు పన్ను శాఖ దాడులు నిర్వహించింది. గీతాంజలి జెమ్స్ మూసివేతకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. దాదాపు 5 వేల మంది ఉద్యోగులను రాజీనామాలు ఇవ్వాలని కోరుతూ యాజమాన్యం పింక్ స్లిప్‌లు జారీ చేసింది. కాగా, నీరవ్ కేసును సిట్‌తో దర్యాప్తు చేయించాలంటూ దాఖలైన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు బుధవారం విచారించనుంది.
నీరవ్ కంపెనీతో సంబంధం లేదు: సింఘ్వీ
అభిషేక్ సింఘ్వీ భార్య, కుమారుడు డైరెక్టర్లుగా ఉన్న కంపెనీకి ఈ కేసుతో ప్రమేయముందని బీజేపీ ఇప్పటికే ఆరోపించగా.. నాలుగేళ్ల క్రితం మోదీ షోరూం నుంచి రూ. 6 కోట్ల ఆభరణాలు కొనుగోలుకు ఎంత నగదు చెల్లించారు? చెక్కు రూపంలో ఎంత ఇచ్చారు? వాటి ఆదాయ మార్గాలు చెప్పాలని అనితా సింఘ్వీని ఐటీ శాఖ కోరింది. చెక్కు ద్వారా రూ. 1.5 కోట్లు, నగదు రూపంలో రూ4.8 కోట్లు అనిత చెల్లించినట్లు ఐటీ అంచనాకు వచ్చింది. నోటీసుపై సింఘ్వీ ట్వీటర్‌లో స్పందిస్తూ.. నగదు రూపంలో కొనుగోలుకు ఎలాంటి ఆధారం లేదని, మొత్తం రూ. 1.56 కోట్లు చెక్కు రూపంలోనే చెల్లించామని చెప్పారు.
స్కాంను గుర్తించడంలో విఫలం: జైట్లీ
పీఎన్‌బీ కుంభకోణంపై ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఎట్టకేలకు మౌనాన్ని వీడారు. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘ఆర్థిక నేరగాళ్లను పట్టుకునేందుకు చివరిదాకా చట్టబద్ధంగా పోరాడడం ప్రభుత్వ భాద్యత’ అని చెప్పారు.
నీరవ్ మోదీ, పంజాబ్ నేషనల్ బ్యాంకు కేసును ప్రస్తావించకుండా.. ఏడేళ్ల నుంచి కుంభకోణం జరుగుతున్నా బ్యాంకు ఆడిటర్లు ఎందుకు గుర్తించలేకపోయారని ప్రశ్నించారు. ‘మేనేజ్‌మెంట్లకు అధికారం కట్టబెట్టినప్పుడు.. ఆ అధికారాన్ని సమర్థంగా, సరైన పద్దతిలో వినియోగిస్తారని ఆశిస్తాం. మేనేజ్‌మెంట్‌లు విఫలమయ్యాయా? అని ప్రశ్నించుకుంటే సమాధానం అవుననే అనిపిస్తోంది. ఎవరు దారితప్పారో గుర్తించడంలో విఫలమయ్యారు.’ అని జైట్లీ పేర్కొన్నారు.
రొటొమ్యాక్‌కు చెందిన 14 బ్యాంకు ఖాతాలు అటాచ్
రొటొమ్యాక్ కుంభకోణంలో ఆ కంపెనీ, దాని ప్రమోటర్లకు చెందిన 14 బ్యాంకు ఖాతాల్ని ఆదాయపు పన్ను శాఖ అటాచ్ చేసింది. పన్ను ఎగవేత ఆరోపణల మేరకు ఈ చర్యలు తీసుకుంది. 11 ఖాతాల్ని సోమవారం రాత్రి అటాచ్ చేయగా.. మరో మూడు ఖాతాలు గత నెలలోనే అటాచ్ చేసింది. విక్రమ్ కొఠారి, మరో ఇద్దరు కుటుంబసభ్యులు దేశం వదిలి పారిపోకుండా ముందు జాగ్రత్తగా అన్ని ఎయిర్‌పోర్టులు, నౌకాశ్రయాలకు ఈడీ సమాచారమిచ్చింది.
ఆరోపణల్ని నిరూపించలేరు..
నీరవ్ దేశం వదిలి పారిపోయారన్న వార్తల్ని అతని తరఫు న్యాయవాది విజయ్ అగర్వాల్ తోసిపుచ్చుతూ.. రూ. 5–6 వేల కోట్లకు పైగా ఆస్తుల్ని వదిలి ఎవరైనా ఎందుకు దేశం వదిలి పారిపోతారని ప్రశ్నించారు. ప్రస్తుతం నీరవ్, చోక్సీలు ఎక్కడున్నారు? భారత్‌కు ఎప్పుడు వస్తారన్న ప్రశ్నలకు మాత్రం ఆయన సమాధానం దాటవేశారు. ‘నేను కేసును అధ్యయనం చేశాను. ఈ కేసుకూ 2జీ, బోఫోర్స్ గతే పడుతుంది. ఆరోపణల్ని కోర్టులో నిరూపించలేరు. అందుకు ఎలాంటి ఆధారాలు లేవు’ అని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment