![CBIs Nageswara Rao Apologises To Supreme Court For Transfer Of Officer - Sakshi](/styles/webp/s3/article_images/2019/02/12/cbi%20nageswrao.jpg.webp?itok=Qlcv73hI)
సాక్షి, న్యూఢిల్లీ : బిహార్‌లోని ప్రభుత్వ వసతి గృహాల్లో బాలికలపై లైంగిక దాడి ఘటనలపై విచారణ జరుపుతున్న అధికారిని బదిలీ చేయడం పట్ల అప్పటి సీబీఐ తాత్కాలిక చీఫ్ ఎం నాగేశ్వరరావు సుప్రీం కోర్టుకు చెప్పిన క్షమాపణలను సర్వోన్నత న్యాయస్ధానం తోసిపుచ్చింది. సీబీఐ డైరెక్టర్‌గా ఎం నాగేశ్వరరావు కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని స్పష్టం చేస్తూ ఆయనకు రూ లక్ష జరిమానా విధించింది. నాగేశ్వరరావుతో పాటు సీబీఐ డైరెక్టర్ ప్రాసిక్యూషన్ బాసూరాం కూడా దోషేనని ఆయనకూ జరిమానా విధించింది. వీరు చేసినది పొరపాటు కాదని, ఉద్దేశపూర్వకమైన చర్యంటూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గగోయ్ పేర్కొన్నారు. కాగా, అంతకుముందు సీబీఐ మాజీ తాత్కాలిక చీఫ్ నాగేశ్వరావు సర్వోన్నత న్యాయస్ధానం ఉత్తర్వులను తాను కలలో కూడా ఉల్లంఘించనని పేర్కొన్నారు.
ముజఫర్‌పూర్ షెల్టర్ హోం కేసును విచారిస్తున్న అధికారిని బదిలీ చేసే ముందు కోర్టు అనుమతి కోరకపోవడం తన తప్పిదమేనని సీబీఐ మాజీ తాత్కాలిక చీఫ్ నాగేశ్వరరావు అంగీకరించారు. తన పొరపాటును తాను పూర్తిగా తెలుసుకున్నానని, బేషరతుగా క్షమాపణ చెబుతున్నానంటూ తానెన్నడూ కోర్టు ఉత్తర్వులను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించలేదని నాగేశ్వరరావు సుప్రీం కోర్టుకు దాఖలు చేసిన అఫిడవిట్‌లో పేర్కొన్నారు.
సుప్రీం కోర్టు అనుమతిలేకుండా తాను షెల్టర్ హోం కేసును విచారిస్తున్న సీబీఐ అధికారి ఏకే శర్మను బదిలీ చేసి ఉండాల్సింది కాదని అఫిడవిట్‌లో ఆయన స్పష్టం చేశారు. కాగా షెల్టర్ హోం కేసును విచారిస్తున్న అధికారిని బదిలీ చేయడంపై నాగేశ్వరరావు తీరును గత వారం సుప్రీం కోర్టు ఆక్షేపించింది. న్యాయస్ధానం ఉత్తర్వులతో మీరు చెలగాటమాడారని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గగోయ్ నాగేశ్వరరావు తీరును తప్పుపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment