నలుగురికి 499 మార్కులు | CBSE Class 10 results announced | Sakshi
Sakshi News home page

నలుగురికి 499 మార్కులు

Published Wed, May 30 2018 2:27 AM | Last Updated on Wed, May 30 2018 5:49 AM

CBSE Class 10 results announced - Sakshi

న్యూఢిల్లీ: సీబీఎస్‌ఈ (సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌) పదవ తరగతి ఫలితాల్లో నలుగురు విద్యార్థులు 500కి అత్యధికంగా 499 మార్కులు సాధించారు. మంగళవారం వెలువడిన ఈ ఫలితాల్లో మొత్తంగా 86.7 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. అబ్బాయిల్లో 85.32 శాతం, బాలికల్లో 88.67 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. గుర్గావ్‌కు చెందిన ప్రాకార్‌ మిత్తల్, యూపీలోని బిజ్నూర్‌కు చెందిన రిమ్‌జిమ్‌ అగర్వాల్, షమ్లీకి చెందిన నందినీ గార్గ్, కొచ్చి అమ్మాయి శ్రీలక్ష్మిలు 500కి 499 మార్కులు సాధించారు.

మరో ఏడుగురికి 498మార్కులు, 14 మందికి 497 మార్కులొచ్చాయి. ఉత్తీర్ణతా శాతం పరంగా చూస్తే తిరువనంతపురం (99.6 శాతం), చెన్నై (97.37 శాతం), అజ్మీర్‌ (91.86 శాతం) రీజియన్లు మెరుగైన ఫలితాలు సాధించాయి. దేశం మొత్తం మీద 27,426 మంది విద్యార్థులు 95 శాతానికిపైగా మార్కులు తెచ్చుకున్నారు. అంగ వైకల్యం కలిగిన విద్యార్థుల ఉత్తీర్ణతా శాతం 92.55 కాగా, గుర్గావ్‌కు చెందిన అనుష్క పండా, ఘజియాబాద్‌కు చెందిన సాన్యా గాంధీలు 489 మార్కులు పొందారు. నిరంతర సమగ్ర మూల్యాంకనం (సీసీఈ) విధానాన్ని సీబీఎస్‌ఈ రద్దు చేశాక జరిగిన తొలి పరీక్షలివే. పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ శుభాకాంక్షలు చెప్పారు. ఫెయిల్‌ అయిన విద్యార్థులు మనో నిబ్బరంతో ఉండాలని కోరారు.

12వ తరగతి టాపర్లను కలిసిన కేజ్రీవాల్‌
సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాల్లో ఢిల్లీలో టాపర్లుగా నిలిచిన వారిని ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియాలు విద్యార్థుల ఇళ్లలోనే కలిశారు. ఢిల్లీ విద్యాశాఖ మంత్రి కూడా అయిన సిసోడియాతో కలసి కేజ్రీవాల్‌.. టాపర్లు భారతీ రాఘవ్, ప్రిన్స్‌ కుమార్, ప్రాచీ ప్రకాశ్, చిత్రా కౌశిక్‌ల ఇళ్లకు వెళ్లారు. అలాగే 12వ తరగతి వొకేషనల్‌ విద్య విభాగంలో టాపర్‌గా నిలిచిన షహనాజ్‌ను కలిసేందుకు దర్యాగంజ్‌ ప్రాంతంలో ఉన్న అనాధశ్రమాన్ని కూడా వారిరువురూ సందర్శించారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే బడ్జెట్‌లో విద్యా రంగానికి కేటాయింపులను రెండింతలు చేసిన విషయాన్ని కేజ్రీవాల్‌ ప్రస్తావిస్తూ.. అది డబ్బు ఎక్కువ ఖర్చు చేయడం కాదనీ, పిల్లల భవిష్యత్తు కోసం పెడుతున్న పెట్టుబడి అని మంగళవారం అన్నారు.

సీబీఎస్‌ఈకి లీకు వీరుల జాబితా
సీబీఎస్‌ఈ పరీక్షల్లో 10వ తరగతి గణితం, 12వ తరగతి ఆర్థిక శాస్త్రం ప్రశ్న పత్రాలు లీకయ్యి సంచలనం సృష్టించడం తెలిసిందే. అలా ప్రశ్న పత్రాలను ముందుగానే అందుకుని పరీక్షలు రాసిన విద్యార్థుల వివరాలను పోలీసులు సీబీఎస్‌ఈకి సమర్పించారు. లీకేజీ వ్యవహారంలో ఢిల్లీ, హిమాచల్‌ ప్రదేశ్‌ల్లో పోలీసులు కొందరిని అరెస్టు చేసి కేసులు నమోదు చేశారు. అరెస్టయిన వారి నుంచి వివరాలను రాబట్టి, ప్రశ్న పత్రాలను ముందుగానే అందుకున్న విద్యార్థుల జాబితాను పోలీసులు సీబీఎస్‌ఈకి పంపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement