న్యూఢిల్లీ: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్‌ఈ) 10వ, 12వ తరగతుల ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల పరీక్ష ఫీజును 24 రెట్లు అంటే ప్రస్తుతమున్న రూ.50 నుంచి అమాంతం రూ.1,200కు పెంచింది. అదేవిధంగా జనరల్ కేటగిరీ విద్యార్థుల ఫీజును రూ.750 నుంచి రూ.1,500గా నిర్ణయించింది. ఈ మేరకు సీబీఎస్‌ఈ గత వారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పటికే ఫీజు చెల్లింపు ప్రక్రియ మొదలు కావడంతో పాత రుసుము చెల్లించిన విద్యార్థులు పెంచిన మొత్తాన్ని కూడా చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. పెంచిన ప్రకారం ఫీజును గడువులోగా చెల్లించని విద్యార్థులను 2019–20 వార్షిక పరీక్షలు రాసేందుకు అనుమతించబోమని తెలిపింది.
తాజా విధానం ప్రకారం.. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల విద్యార్థులు ఐదు సబ్జెక్టులకు పరీక్ష ఫీజు రూ.1,200 చెల్లించాలి. ఇంతకు ముందు ఇది రూ.350 మాత్రమే. జనరల్ కేటగిరీ వారికి ఇప్పటి వరకు ఉన్న ఫీజు రూ.750ను రూ.1,500కు పెంచింది. ఈ విధానం 10, 12వ తరగతుల విద్యార్థులకు వర్తిస్తుంది. 12వ తరగతి ఎస్‌సీ, ఎస్‌టీ విద్యార్థులు అదనంగా ఒక సబ్జెక్టు పరీక్ష రాయాలంటే గతంలో ఎలాంటి ఫీజు ఉండేది కాదు. ఇకపై వారు రూ.300 చెల్లించాల్సి ఉంటుంది. జనరల్ కేటగిరీ విద్యార్థులు కూడా అదనపు సబ్జెక్టు కోసం రూ.150 బదులు రూ.300 చెల్లించాల్సి ఉంటుంది. అయితే, 100 శాతం అంధ విద్యార్థులకు మాత్రం సీబీఎస్‌ఈ పరీక్ష రుసుమును మినహాయించింది. మైగ్రేషన్ ఫీజును కూడా రూ.150 నుంచి రూ.350కి పెంచింది.
Comments
Please login to add a commentAdd a comment