పండగ చేస్కొని బుక్కయ్యారు
తిరువంతపురం: కేరళీయులు అత్యంత ప్రతిష్టాత్మకంగా, ఉత్సాహంగా జరుపుకునే పండుగ ఓనం. అయితే కేరళలోని ఓ మెడికల్ కాలేజీ ఆవరణలో నిర్వహించిన ఓనం ఉత్సవం వివాదానికి దారి తీసింది. అత్యంత పరిశుభ్రంగా ఉండాల్సిన ఆపరేషన్ థియేటర్లో పండుగ ఉత్సవాలు జరుపుకొని బుక్కయ్యారు ఆసుపత్రి సిబ్బంది. ఓనం పండుగ సందర్భంగా నిర్శహించే 'ఓనసాద్య' విందును అట్టహాసంగా నిర్వహించుకోవడంతో విమర్శలు చెలరేగాయి.
తిరువనంతపురం మెడికల్ కాలేజీలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఆసుపత్రి డాక్టర్లు, ఇతర సిబ్బంది ఓనం పండుగను ఉత్సాహంగా జరుపుకున్నారు. ఆసుపత్రి ఆవరణను పూలతో అందంగా అలంకరించి, ముగ్గులు పెట్టి ఉత్సవాలు జరుపుకున్నారు. పరస్పరం స్వీట్లు పంచుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
ఆపరేషన్ థియేటర్ కు అత్యంత సమీపంలో పండుగ చేస్కోవడం పట్ల రోగులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అత్యంత హైజీనిక్ గా ఉండాల్సిన ఏరియాలో ఇలా చేయడం వల్ల రోగుల భద్రతను ప్రశ్నార్ధకం చేశారని మండిపడ్డారు. ఆసుపత్రిలోని కొంతమంది సిబ్బందికి మాత్రమే అనుమతి ఉండే ఆపరేషన్ థియేటర్కు అంతమందిని అనుమతించడం సరికాదని ఆరోపించారు. దీని వల్ల బాక్టీరియా వ్యాపించి, ఇన్ఫెక్షన్స్ ముదరవా అంటూ పై అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ విచారణకు ఆదేశించింది. దీనిపై సమగ్ర నివేదిక అందించాలని మున్సిపల్ అధికారులను మంత్రి వీఎస్ శివకుమార్ ఆదేశించారు.
మరోవైపు ఆపరేషన్ జోన్లో ఓనం పండుగ నిర్వహించడంపై నిపుణులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. పండుగలు, ఉత్సవాలు జరుపుకోవడం తప్పుకాదుకానీ, ఆపరేషన్ జోన్ను బాక్టీరియా రహితంగా చూసుకోవాల్సిన బాధ్యత సిబ్బంది ఉందని వ్యాఖ్యానించారు.
అయితే ఈ ఆరోపణలను మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డా. థామస్ ఖండిస్తున్నారు. థియేటర్కు వందమీటర్ల దూరంలో పూవులతో అలంకరించామంటున్నారు. ఆరోగ్యం బాగా క్షీణించిన రోగులకు కేటాయించే పాలియేటివ్ కేర్ రూములో విందు ఏర్పాటు చేశామంటూ సమర్ధించుకున్నారు. చాలా సంవత్సరాలుగా ఇక్కడ ఓనం జరుపుకుంటున్నామని తెలిపారు.