ఇక అలాంటి సీన్లను కట్ చేయరంట!
న్యూఢిల్లీ: ఇక నుంచి సినిమాలకు కత్తెర గొడవ తప్పనుంది. అడల్ట్ కంటెంట్ కూడా అనుమతిచ్చేలా ప్రతిపాదించిన కొత్త సర్టిఫికేషన్, రేటింగ్ విధానానికి సెన్సార్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్(సీబీఎఫ్సీ) ఓకే చెప్పింది. ఆయా కేటగిరీల్లోని చిత్రాలకు సర్టిఫికేషన్ ఇచ్చే విధానాన్ని పునఃపరిశీలించి కొత్త ప్రతిపాదనలు చేసేందుకు శ్యాంబెనగల్ కమిటీని వేయగా పలు అంశాలను ప్రతిపాదించింది. సీన్లను కత్తిరించడంగానీ, కొన్ని పదాలను నిషేధించడంగానీ చేయకుండా వాటికంటూ ప్రత్యేక సర్టిఫికెట్ ఇచ్చే విధానాన్ని బెనగల్ కమిటీ సెన్సార్ బోర్డుకు ప్రతిపాదించింది.
గతంలో సినిమాల్లోని ముద్దుల సీన్ల విషయంలో, లైంగికపరమైన సన్నివేశాల విషయంలో కేంద్ర సెన్సార్ బోర్డుకు చిత్ర నిర్మాతలకు గొడవలు జరగుతుండేది. అలాంటి సన్నివేశాలకు కత్తెర వేయడమే కాకుండా ఆ సినిమాకు సెన్సార్ బోర్డు యూ/ఏ అనే సర్టిఫికెట్ ఇచ్చేది. ఇది చిత్ర నిర్మాతలకు మింగుడుపడక ఘర్షణ పరిస్థితి నెలకొనేది. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా శ్యాంబెనగల్ అధ్యక్షతన కమిటీ వేయగా కత్తెరకు అవకాశాలు ఇవ్వకుండా తాజాగా ప్రతిపాదనలు చేసింది.
దీని ప్రకారం సినిమాల విడుదలకు ముందు ఇచ్చే సర్టిఫికెట్ విషయంలో కేంద్ర సెన్సార్ బోర్డు పని మరింత పరిమితం కానుంది. కాగా, బెనగల్ సూచించిన ప్రతిపాదనలు నేరుగా అమలుచేయడం సాధ్యం కాదు. వీటిని తొలుత సీబీఎఫ్సీ కేంద్ర సమాచార ప్రసారాల వ్యవహారాల శాఖకు పంపించనుంది. వాటిని పరిశీలించి అంగీకరించి సినిమాటోగ్రాఫ్ చట్టాన్ని/నిబంధనను సవరిస్తేగానీ ఈ కొత్త విధానం అమలులోకి వస్తుంది. కాగా, టీవీ చానెళ్లలో ఇలాంటి సినిమాలు ఎలా ప్రసారం చేయాలనే అంశంలో మాత్రం స్పష్టత రాలేదు.