సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ నేపథ్యంలో లాక్‌డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న రైతులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వ పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. ఈ మేరకు సోమవారం జరిగిన కేంద్ర కేబినెట్ నిర్ణయాలను మంత్రి ప్రకాశ్ జవడేకర్ మీడియా ముందు వెల్లడించారు. ఆత్మ నిర్భర్ భారత్ పథకానికి రోడ్ మ్యాప్ రూపొందించామని తెలిపారు. కరోనా కారణంగా ఇబ్బందుల్లో కూరుకుపోయిన రైతులు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ఆదుకోవాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించినట్లు స్పష్టం చేశారు. ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు రైతులు, ఎంఎస్‌ఎంఈలను ఆదుకునేలా కీలక నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతంలో రైతులు, ఎంఎస్‌ఎంఈలది కీలక పాత్ర అని పేర్కొన్నారు. (కరోనా సామర్థ్యం తగ్గిపోయింది)
మీడియా సమావేశంలో జవడేకర్ వివరాలను వెల్లడిస్తూ.. ‘సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ప్రత్యేక ప్యాకేజీ ద్వారా సరికొత్త అర్థాన్ని ఇచ్చాం. ఎంఎస్‌ఎంఈలను ఆదుకునేందుకు రూ.50వేలకోట్లు ఈక్విటీ పెట్టుబడులకు అవకాశం కల్పిస్తున్నాం. ఎంఎస్ఎంఈ రంగానికి 20 వేల కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటిస్తున్నాం. ఎంఎస్ఎంఈ పరిశ్రమలకు మార్కెట్లో లిస్టింగ్ చేసే అవకాశం కల్పిస్తున్నాం. వీధి వ్యాపారులను ఆదుకునేందుకు సత్వరమే రూ.10 వేలు రుణం ఇవ్వాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. దీని ద్వారా 50 లక్షల మంది వీధి వ్యాపారులకు లబ్ధి చేకూరనుంది. రైతులను ఆదుకునేందుకు కిసాన్ క్రెడిట్ కార్డుల పథకం అమల్లోకి తెస్తాం. ఇప్పటికే 14 పంటలకు కనీస మద్దతు ధరను ప్రకటించాం’ అని పేర్కొన్నారు. (సీనియర్లకు షాకివ్వనున్న ఇన్ఫోసిస్)
ఈ సమావేశంలో నితిన్ గడ్కరీ మాట్లాడుతూ.. ‘దేశ జీడీపీలో 29% సూక్ష్మ చిన్న పరిశ్రమలదే. ఆరు కోట్ల చిన్న పరిశ్రమలు 11 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నాయి. మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న చిన్న పరిశ్రమలను స్టాక్ మార్కెట్లో పెడతాం. వాటిలో కొన్ని షేర్లను ప్రభుత్వం కొని వారికి మద్దతు ఇస్తుంది’ అని తెలిపారు. ఇక రైతులు తమ రుణాలను చెల్లించే గడువును ఆగస్ట్ వరకు పొడించేందుకు కేంద్రం వెసులుబాటు కల్పించింది.
అలాగే 14 రకాల పంటలకు కనీస ధర కేంద్రం పెంచింది. క్వింటాల్ వరి ధాన్యంపై రూ.53 పెంపుతో.. తాజా ధర రూ.1,868కి చేరింది. పత్తి మద్దతు ధర రూ.260 పెంపుతో క్వింటాల్ పత్తి మద్దతు ధర రూ.5,515కి చేరింది. 2020-21 పంటకు ఇది వర్తిస్తుందని కేంద్రం తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment