ట్రైనీ ఐపీఎస్ మృతిపై సీబీఐ విచారణ
హైదరాబాద్ : సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడమీ (ఎన్‌పీఏ)లో శిక్షణ పొందుతున్న ఐపీఎస్ అధికారి మనూ ముక్త్ మానవ్ అనుమానాస్పద మృతిపై కేంద్ర ప్రభుత్వం మంగళవారం సీబీఐ విచారణకు ఆదేశించింది. గత ఏడాది నేషనల్ పోలీస్ అకాడమీ స్విమ్మింగ్ పూల్లో మనూ ముక్త్ మానవ్ మృతి చెందిన విషయం తెలిసిందే.
గత ఏడాది ఆగస్ట్లో తోటి ట్రైనీల విందులో మద్యం సేవించి, అనంతరం స్విమ్మింగ్ పూల్‌లోకి దిగడంతో మనూ ముక్త్ మానవ్ ప్రమాదవశాత్తు మృతి చెందారు. హర్యానా రాష్ట్రం హిస్సార్ జిల్లాకు చెందిన మను ముక్త్త్ మానవ్ (30) 2013లో హిమాచల్‌ప్రదేశ్ ఐపీఎస్ క్యాడర్‌గా ఎంపికయ్యారు. కాగా శిక్షణ పొందుతున్న వారంతా ఆఫీసర్స్ క్లబ్‌లో విందు చేసుకున్నారు.
ఈ విందులో మద్యం సేవించిన మానవ్ మరో ఇద్దరు ట్రైనీలతో కలిసి ఎన్‌పీఏలో ఉన్న స్విమింగ్ పూల్‌లో ఈత కొట్టేందుకు వెళ్లారు. స్విమ్మింగ్‌పూల్‌లో దిగిన కొద్దిసేపటికే మానవ్ నీటిలో మునిగి మృతి చెందారు. దాంతో మానవ్ తల్లిదండ్రులు.. తమ కుమారుడి మృతి పట్ల విచారణ జరపాలని కేంద్రాన్ని కోరారు.