‘ఆట’ కోసం ఆర్డినెన్స్‌ | Central government sayes ok to Tamil Nadu Jallikattu Proposal | Sakshi
Sakshi News home page

‘ఆట’ కోసం ఆర్డినెన్స్‌

Published Sat, Jan 21 2017 3:07 AM | Last Updated on Tue, Sep 5 2017 1:42 AM

Central government sayes ok to Tamil Nadu Jallikattu Proposal

తమిళనాడు జల్లికట్టు ప్రతిపాదనకు కేంద్రం ఓకే
నేడో, రేపో ఆర్డినెన్స్‌ జారీ: సీఎం ప్రకటన
కదం తొక్కిన తమిళ యువత.. రాష్ట్ర బంద్‌ సక్సెస్‌



సాక్షి ప్రతినిధి, చెన్నై/న్యూఢిల్లీ: జల్లికట్టు కోసం తమిళ తంబీలు ఉగ్రరూపం దాల్చి కేంద్రాన్ని తమ దారికి తెచ్చుకున్నారు. అన్నివర్గాల ప్రజలు ముఖ్యంగా యువత అకుంఠిత దీక్షతో అనుకున్నది సాధించారు. నిషేధిత జల్లికట్టు నిర్వహణ కోసం ఆర్డినెన్స్‌ తీసుకొచ్చేందుకు కేంద్రం శుక్రవారం రాత్రి అంగీకరించింది. నాలుగురోజుల నిరసనలు, శుక్రవారం నాటి బంద్‌తో తమిళనాడు మొత్తం స్తంభించడంతో ఆర్డినెన్స్‌కు ఆగమేఘాలపై ఆమోదం తెలిపింది. జల్లికట్టుపై నిషేధం తొలగించడానికి రాష్ట్రం రూపొందించిన ముసాయిదా ఆర్డినెన్స్‌ను కేంద్ర హోం, న్యాయ, పర్యావరణ మంత్రిత్వ శాఖలు యథాతథంగా ఆమోదించాయి.

ఆర్డినెన్స్‌ ద్వారా జంతుహింస నిరోధక చట్టాన్ని సవరించి, అందులోని ‘ప్రదర్శన జంతువులు’(పర్‌ఫామింగ్‌ యానిమల్స్‌) జాబితా నుంచి ఎద్దులను తొలగిస్తారు. ఆర్డినెన్స్‌ను నేరుగా తిరిగి రాష్ట్రానికి పంపామని కేంద్ర హోం శాఖ ప్రతినిధి ఒకరు చెప్పారు. రాష్ట్రపతికి నివేదించకుండానే దీన్ని రాష్ట్రానికి పంపడం విశేషం. తమిళనాడు కేబినెట్‌ శనివారం ఉదయం ఆర్డినెన్స్‌ను ఆమోదించి, దాన్ని ప్రకటించాల్సిందిగా గవర్నర్‌ విద్యాసాగర్‌రావుకు సిఫార్సు చేసే అవకాశముంది. ఆర్డినెన్స్‌ ఒకటి, రెండు రోజుల్లో జారీ అవుతుందని, తానే స్వయంగా జల్లికట్టును ప్రారంభిస్తానని సీఎం పన్నీర్‌సెల్వం చెప్పారు. ఢిల్లీలో గురువారం ప్రధాని మోదీ నుంచి హామీ పొందిన ఆయన శుక్రవారం ఉదయం చెన్నైలో విలేకర్లతో మాట్లాడారు. మరోపక్క జల్లికట్టు కోసం కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను అన్నాడీఎంకే ఎంపీలు ఢిల్లీలో కలిశారు. కేంద్రం సమస్యను పరిష్కరిస్తుందని ఆయనతోపాటు పర్యావరణ మంత్రి అనిల్‌ దవే, న్యాయ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌లు హామీ ఇచ్చారు.  

వారం పాటు సుప్రీం ఆదేశాలుండవు
సమస్య పరిష్కారం కోసం కేంద్రం తమిళనాడుతో చర్చిస్తోందని అటార్నీ జనరల్‌ ముకుల్‌ రోహత్గీ సుప్రీం కోర్టుకు తెలిపారు. కేసుపై వారం రోజుల వరకు ఆదేశాలివ్వొద్దని విజ్ఞప్తి చేయగా కోర్టు అంగీకరించింది.

బంద్‌కు భారీ స్పందన
జల్లికట్టు కోసం వివిధ కార్మిక, ప్రజా సంఘాలు శుక్రవారం చేపట్టిన తమిళనాడు బంద్‌ విజయవంతమైంది. రాష్ట్రమంతటా దుకాణాలు, విద్యాసంస్థలు మూతపడ్డాయి. రవాణా, ప్రజా రవాణా వాహనాలు పరిమిత సంఖ్యలో నడవగా, పలు రైళ్లు రద్దయ్యాయి. 8 లక్షల మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు బంద్‌లో పాల్గొన్నారు. బ్యాంకుల కార్యకలాపాలకు కూడా ఆటంకం కలిగింది.విపక్ష డీఎంకే పలు చోట్ల రైల్వే రోకో నిర్వహించింది. చెన్నైలో ఆ పార్టీ నేతలు స్టాలిన్, కనిమొళిలతోపాటు 5వేల మంది పార్టీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. అన్నాడీఎంకే, బీజేపీ మినహా అన్ని పార్టీలూ, కార్మిక సంఘాలు బంద్‌లో పాల్గొన్నాయి. మద్రాసు హైకోర్టు లాయర్లు విధులను బహిష్కరించారు.

కోలీవుడ్‌అండ
జల్లికట్టు మద్దతుదారులకు కోలీవుడ్‌ వెన్నుదన్నుగా నిలిచింది. రజనీకాంత్, అజిత్‌ కుమార్, సూర్య, కార్తీ, విశాల్, నాజర్, త్రిష, షాలిని తదితర నటులతోపాటు పలువురు నిర్మాత, దర్శకులు మెరీనా బీచ్‌లో నిరాహారదీక్ష, మౌన నిరసన నిర్వహించారు. డైరక్టర్‌ లారెన్స్‌ స్పృహ తప్పగా వెంటనే ఆస్పత్రికి తరలించారు.

నలుపెక్కిన మెరీనా బీచ్‌
నిరసనలకు కేంద్రమైన చెన్నై మెరీనా బీచ్‌లో శుక్రవారం ఐదోరోజు లక్షలాదిమంది ప్రజలు జల్లికట్టు కోసం గర్జించారు. బీచ్‌కు దారితీసే రోడ్లన్నీ నల్ల దుస్తులు ధరించిన ఆందోళనకారులతో కిక్కిరిశాయి. మహిళలు, బాలలు కూడా భారీ సంఖ్యలో పాల్గొన్నారు. హిజ్రాలు కూడా గళం విప్పారు. ఆర్డినెన్స్‌ యత్నాలను స్వాగతిస్తున్నామని, అయితే ఆట పూర్తయ్యాకే నిరసన విరమిస్తామని ఆందోళనకారులు తేల్చిచెప్పారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ జరక్కుండా నిరసన కొనసాగిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement