ఐఐటీల్లో మరో వెయ్యి సీట్లు! | Central HRD to plan increase the IIT seats | Sakshi
Sakshi News home page

ఐఐటీల్లో మరో వెయ్యి సీట్లు!

Published Sat, Sep 30 2017 2:30 AM | Last Updated on Sat, Sep 30 2017 3:32 AM

Central HRD to plan increase the IIT seats

సాక్షి, హైదరాబాద్‌: దేశంలోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థలైన ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ)ల్లో మరో వెయ్యి సీట్లు పెరిగే అవకాశం ఉంది. ఇందుకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ (ఎంహెచ్‌ ఆర్‌డీ) ఆమోదం తెలిపినట్లు తెలిసింది. 20 17–18 విద్యా సంవత్సరంలో ఐఐటీల్లో 400 సీట్లను పెంచిన కేంద్రం 2018–19 విద్యా సంవత్సరంలో 1000 సీట్లను పెంచేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అయితే టాప్‌ ఐఐటీలైన ఢిల్లీ, బాంబే, మద్రాస్, ఖరగ్‌పూర్‌లలో కాకుండా ఇతర, కొత్తగా పెట్టిన ఐఐటీల్లో ఈ సీట్లను పెంచే అవకాశం ఉంది. అయితే 2018–19 విద్యా సంవత్సరంలో అన్ని ఐఐటీల్లో బాలికల కోసం 14% సీట్లను పెంచాలని ఐఐటీల జాయింట్‌ అడ్మిషన్‌ బోర్డు (జేఏబీ) సిఫారసు చేసిన నేపథ్యంలో ఆ టాప్‌ ఐఐటీల్లోనూ సీట్ల సంఖ్యను పెం చాల్సి రావొచ్చని ఐఐటీ వర్గాలు పేర్కొంటు న్నాయి. ప్రస్తుతం ఐఐటీల్లో 10,998 సీట్లు అందుబాటులో ఉండగా పెరిగే సీట్లతో కలిపి 11,998సీట్లు అందుబాటులోకి రానున్నాయి.

డిమాండ్‌ ఉన్న కోర్సుల్లోనే సీట్ల పెంపు
ఐఐటీల్లోని 10,998 సీట్లకు ఏడు దశల్లో కౌన్సెలింగ్‌ నిర్వహించినా ప్రస్తుత విద్యా సంవత్సరంలో 121 సీట్లు మిగిలిపోయాయి. అయితే పెద్దగా డిమాండ్‌ లేని కోర్సుల్లోనే ఆ సీట్లు మిగిలిపోయాయి. ఈ నేపథ్యంలో డిమాండ్‌ లేని కోర్సుల్లో సీట్లను రద్దు చేయాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ఇప్పటికే జాయింట్‌ అడ్మిషన్‌ బోర్డుకు సూచించింది. దీంతో వచ్చే ఏడాది డిమాండ్‌ లేని కోర్సుల్లో సీట్లను తగ్గించడం లేదా కోర్సులనే రద్దు చేయడం జరగొచ్చని... డిమాండ్‌ ఉన్న కోర్సుల్లోనే ఈ సీట్ల పెంపు ఉంటుందని ఐఐటీల అ«ధికారులు చెబుతున్నారు.

పూర్తిగా ఆన్‌లైన్‌లోనే జేఈఈ అడ్వాన్స్‌డ్‌
2018–19 విద్యా సంవత్సరంలో ఐఐటీల్లో ప్రవేశాల కోసం మే 20న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షను నిర్వహించేందుకు ఐఐటీల కౌన్సిల్‌ ఇదివరకే నిర్ణయం తీసుకుంది. పరీక్ష నిర్వహణ బాధ్యతలను కాన్పూర్‌ ఐఐటీకి అప్పగించింది. అయితే ఎప్పటిలాగే ఆన్‌లైన్‌తోపాటు ఆఫ్‌లైన్‌లో కూడా పరీక్ష నిర్వహిస్తారేమోనన్న ఆలోచన విద్యార్థుల్లో ఉంది. అయితే 2018 మే 20న నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షను పూర్తిగా ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తామని ఐఐటీ కాన్పూర్‌ జేఈఈ అడ్వాన్స్‌డ్‌ వెబ్‌సైట్‌లో స్పష్టం చేసింది. మే 20న ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు పేపర్‌–1 పరీక్ష, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్‌–2 పరీక్ష ఉంటుందని తెలిపింది. ఇందుకు సంబంధించిన సమగ్ర వివరాలతో ఇన్ఫర్మేషన్‌ బ్రోచర్‌ను అక్టోబర్‌ మొదటి వారంలో అందుబాటులోకి తెస్తామని ప్రకటించింది.

నవంబర్‌లో జేఈఈ మెయిన్‌..
జేఈఈ మెయిన్‌ ఫలితాలు వెల్లడైన నాటి నుంచే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ప్రారంభించనుంది. ఇక జేఈఈ మెయిన్‌ నోటిఫికేషన్‌ను నవంబర్‌ మూడో వారంలో జారీ చేసేందుకు సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) కసరత్తు ప్రారంభించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement