ఎన్నారై భర్తలూ.. మీ ఆగడాలకు ఇక చెక్‌! | Centre Acts Tough On NRIs Abandoning Their Wives | Sakshi
Sakshi News home page

ఎన్నారై భర్తలూ.. మీ ఆగడాలకు ఇక చెక్‌!

Published Wed, Mar 6 2019 12:50 PM | Last Updated on Sat, Jul 6 2019 12:42 PM

Centre Acts Tough On NRIs Abandoning Their Wives - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

‘నాకు అమెరికాలో వర్క్‌ వీసా వచ్చింది.. నువ్వు నాతో అక్కడికి రావాలంటే అదనపు కట్నం తీసుకురా.. లేదంటే నా దగ్గరికి ఎప్పటికీ రాలేవు’అంటూ తన భార్యకు ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ భర్త తెగేసి చెప్పాడు.
‘నేను ఇక్కడ మరో పెళ్లి చేసుకున్నా.. భవిష్యత్తులో ఇండియాకు రాలేను.. బై’అంటూ మరో భర్త తెగదెంపులు చేసున్నాడు.

‘మన పెళ్లి ఆస్ట్రేలియాలో జరిగింది, నువ్విపుడు ఇండియాలో ఉన్నావు. నాపై ఎలాంటి చర్యలు తీసుకోలేవు’అంటూ వెటకారంగా మాట్లాడాడు మరో ఎన్నారై భర్త.

సాక్షి, హైదరాబాద్‌: సాధారణంగా ఎన్నారై భర్తల కేసుల్లో ఇలాంటి వేధింపులు వింటూ ఉంటాం. ఇకపై ఇలాంటి ఆటలు సాగవు. భార్యలను ఇండియాలోనే వదిలేసి, అదనపు కట్నం లేదా ఇతర కారణాలను సాకుగా చూపి వేధింపులకు పాల్పడే వారి ఆగడాలకు పోలీసులు చెక్‌ చెప్పనున్నారు. తాజాగా భార్యలపై వేధింపులకు దిగుతున్న 45 మంది భర్తల పాస్‌పోర్టులను రద్దు చేస్తూ కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. విదేశాల్లో ఉండి భార్యలను వేధించడం ఇకపై కుదరదంటూ గట్టి సంకేతాలు పంపింది. ఈ తరహా బాధితులను ఆదుకునేందుకు ఇప్పటికే పార్లమెంటులో బిల్లు పెట్టిన కేంద్రం లోక్‌సభలో దాన్ని ఆమోదింపజేసుకుంది. రాజ్యసభలో ఈ బిల్లు ఆమోదం పొందాల్సి ఉంది. కొన్నేళ్లుగా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఇలాంటి కేసులు పెరిగిపోతుండటంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

బిల్లులో ఏముంది?
విదేశాల్లో ఉంటూ భారతదేశంలో ఉన్న భార్యలను వేధించే భర్తల ఆటకట్టించాలన్న కేంద్రం ఈ మేరకు ఓ చట్టం తెచ్చేందుకు యత్నిస్తోంది. ఇందులో భాగంగా కేంద్ర మహిళా–శిశు సంక్షేమ, విదేశాంగ, హోం, న్యాయశాఖలు సంయుక్తంగా ఈ బిల్లుకు రూపకల్పన చేశాయి. దీని ప్రకారం వివాహం భారత్‌లో జరిగినా, విదేశాల్లో జరిగినా వేధింపులకు పాల్పడే ఎన్నారై భర్తలు ఇకపై తప్పించుకోలేరు. భారతీయ మహిళకు చట్టపరంగా మరింత రక్షణ కల్పించాలన్నదే ఈ బిల్లు ధ్యేయం. ఇందుకోసం పాస్‌పోర్ట్‌ యాక్ట్‌ 1967, కోడ్‌ ఆఫ్‌ క్రిమినల్‌ ప్రొసీజర్‌ 1973లకు పలు మార్పులు చేసి బలోపేతం చేశారు. వివాహం జరిగిన 30 రోజుల్లో దాన్ని రిజిస్ట్రేషన్‌ చేయించాలి. దీని ద్వారా చట్టపరమైన పలు రక్షణలు మహిళలకు చేకూరతాయి. బలోపేతం చేసిన పాస్‌పోర్ట్‌ యాక్ట్‌ 1967 ప్రకారం.. విచారణకు హాజరుకాని ఎన్నారై భర్తల పాస్‌పోర్ట్‌ సీజ్‌ చేయడానికి, సీఆర్‌పీసీ 1973 ద్వారా కోర్టుకు హాజరుకాని వారి ఆస్తులను సీజ్‌ చేసే వీలు కల్పిస్తాయి.

మన రాష్ట్రంలో పరిస్థితి ఇదీ..
తెలంగాణలోనూ ఎన్నారై భర్తలపై 498–ఎ కేసులు నమోదవుతున్నాయి. వీరిలో విచారణకు హాజరుకాకపోయినా, సహకరించకపోయినా.. వారిపై పోలీసులు లుక్‌అవుట్‌ (ఎల్‌ఓసీ) నోటీసులు జారీ చేస్తున్నారు. ఇప్పటిదాకా తెలంగాణలో 232 మంది ఎన్నారై భర్తలపై లుక్‌అవుట్‌ నోటీసులు జారీ చేశారు. ఏటేటా ఈ నోటీసుల సంఖ్య పెరుగుతుండటం కాస్త ఆందోళన లిగిస్తున్నా.. న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించడంతో బాధితుల సంఖ్యపై స్పష్టత వచ్చే అవకాశముంది. ఈ నోటీసులు జారీ చేశాక, ఇక ఆ వ్యక్తి ఏ అంతర్జాతీయ విమానాశ్రయం, నౌకాశ్రయాల ద్వారా ప్రయాణం చేయలేరు. ఫలితంగా వారు పోలీసులకు చిక్కడమే కాకుండా తరువాత ఇంటర్‌పోల్‌ సాయంతో వారిని తిరిగి మన దేశానికి తీసుకువచ్చే వీలుంటుంది.

బాధితులు ముందుకు రావాలి..
ఎన్నారై భర్తల విషయంలో బాధితులు ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం. వివాహం విదేశాల్లో జరిగినా, ఇండియాలో జరిగినా.. ఇక్కడ కేసు నమోదు చేయవచ్చు. ఇలాంటి కేసుల్లో మహిళలు తమకు చట్టపరంగా ఉన్న అవకాశాలను వినియోగించుకునేందుకు పోలీసులను ఆశ్రయించవచ్చు. కేసు తీవ్రతను బట్టి చర్యలు ఉంటాయి.
– స్వాతి లక్రా, ఐజీపీ (లా అండ్‌ ఆర్డర్‌) విమెన్‌ సేప్టీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement