మ్యాగీ తరహా కేసులకు కొత్త చట్టం!
న్యూఢిల్లీ: గత కొన్ని రోజులుగా మ్యాగీ నూడుల్స్ వ్యవహారం పెద్ద హాట్ టాపిక్ గా మారింది. మ్యాగీ నూడుల్స్ ఉత్పత్తులు సురక్షితం కాదని ఢిల్లీ ప్రభుత్వం మంగళవారం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. వినియోగదారులకు అత్యంత హానికరంగా మారిన మ్యాగీ తరహా కేసుల్లో కఠిన శిక్షలకు అవకాశమున్న కొత్త చట్టాన్ని రూపొందించడానికి కేంద్ర కసరత్తులు చేస్తోంది.
ఈ తరహా కేసులకు కొత్త చట్టాన్ని తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర ఆహార శాఖ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ వెల్లడించారు. నిత్యావసర వస్తువులు, ఆహార పదార్ధాలను ఉత్పత్తి చేస్తూ వినియోగదారులను మోసం చేసేవారికి, అలాంటి హానికర పదార్ధాలు, వస్తువులకు ప్రచారం కల్పిస్తున్న వారికి యావజ్జీవ కారాగార శిక్ష విధించాలన్నప్రతిపాదన ఆ చట్టంలో పొందుపరుస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
అమితాబ్, మాధురీ, ప్రీతి జింటాలపై కేసు నమోదు..
యాగీ నూడుల్స్ వివాదం దాని ప్రచారకర్తలు, బాలీవుడ్ నటులు అమితాబ్ బచ్చన్, మాధురీ దీక్షిత్, ప్రీతి జింటాలను వెంటాడుతోంది. యూపీలో ఈ ముగ్గురిపై కేసులు నమోదు చేయగా, తాజాగా బీహార్లోనూ ఇదే పరిస్థితి ఎదురైంది. అమితాబ్, మాధురీ, ప్రీతిలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందిగా ముజఫర్పూర్ కోర్టు ఆదేశించింది.