సహజవనరులను ఉదారంగా ఎలా కేటాయిస్తారు: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: వివాదాస్పద బొగ్గు బ్లాకుల కేటాయింపు కేసులో సుప్రీంకోర్టు కేంద్రానికి ప్రశ్నాస్త్రాలు సంధించింది. బొగ్గు సహజసిద్ధంగా లభించే ప్రకృతి సంపద అనీ, సహజ వనరులను ఎవరికైనా ఉదారంగా కట్టబెట్టడానికి వీల్లేదని స్పష్టం చేసింది. బొగ్గువంటి సహజవనరుల కేటాయింపులో బిడ్డింగ్ ప్రక్రియను ఎందుకు పాటించలేదని బుధవారం జస్టిస్ ఆర్‌ఎం లోధా నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం ప్రభుత్వాన్ని నిలదీసింది. బొగ్గు కేటాయింపులపై దాఖలైన రెండు వ్యాజ్యాలపై తుది విచారణ సందర్భంగా అటార్నీ జనరల్ వాహనవతిని ధర్మాసనం ప్రశ్నించింది.
సీబీఐకి ఇంకా అందని బొగ్గు ఫైళ్లు: బొగ్గు బ్లాకుల కేటాయింపు ఫైళ్ల గల్లంతు వ్యవహారం నానాటికీ సంక్లిష్టంగా పరిణమించడంతో ఈ అంశంపై ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసే విషయమై సీబీఐ యోచిస్తోంది. దీనిపై చర్చించేందుకు సీబీఐ అధికారులు, బొగ్గు మంత్రిత్వ శాఖ అధికారులు త్వరలో సమావేశమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. బొగ్గు కేటాయింపులపై సీబీఐ కోరుతున్న పత్రాల విషయంలో బొగ్గు శాఖ అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఈ సమావేశానికి నిర్ణయం తీసుకున్నారు. సీబీఐ కోరుతున్న ఫైళ్లు తన వద్ద లేవంటూ బొగ్గు శాఖ వాదిస్తున్న నేపథ్యంలో ఈ సమావేశం నిర్వహించనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి.