న్యూఢిల్లీ: ఐదేళ్లు, అంతకంటే ఎక్కువ శిక్ష పడే అవకాశమున్న కేసుల్లో నిందారోపణలను ఎదుర్కొంటున్న వారు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించడానికి తాము సుముఖంగా ఉన్నామని ఎలక్షన్ కమిషన్(ఈసీ) సుప్రీంకోర్టుకు నివేదించింది. దీనివల్ల రాజకీయ ప్రేరేపిత కేసులకు (ఉద్దేశపూర్వకంగా కేసులు మోపడం) అవకాశం ఉంటుందన్న వాదనను తోసిపుచ్చింది.
ఇందుకోసం ఎన్నికల షెడ్యూల్ వెలువడడానికి కనీసం ఐదు నెలల ముందుగానే కోర్టుల్లో అభియోగాలు నమోదు అయిన వారిపైనే నిషేధం ఉంటుందని తెలిపింది. ఈ మేరకు జస్టిస్ ఆర్.ఎమ్.లోధా నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం ముందు ఈసీ అఫిడవిట్ దాఖలు చేసింది. నేరాభియోగాలను ఎదుర్కొంటున్న వారు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధిస్తూ ఆదేశాలివ్వాలని కోరుతూ ఒక స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని సుప్రీం కోర్టు విచారించింది.
ఈ సందర్భంగా ఈసీ తన వాదనను వినిపించింది. ప్రాథమిక సాక్ష్యాధారాల పరిశీలన తర్వాత కోర్టులు మోపిన అభియోగాల్లోని వాస్తవాల ఆధారంగానే నిందితులు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించాలనేది తమ ప్రతిపాదనగా పేర్కొంది. ఈ ప్రతిపాదనను 1998లోనే కేంద్రానికి సమర్పించామని, దానిపై కేంద్ర ఇంకా చర్యలు తీసుకోవాల్సి ఉందని తెలిపింది. ఎన్నికల విధానాన్ని సంస్కరించడంతోపాటు, నేరరహిత ఎన్నికల కోసం ఈ ప్రతిపాదనగా ఈసీ పేర్కొంది. కోర్టులు నేరస్థులుగా ప్రకటించిన ఎంపీలు, ఎమ్మెల్యేలపై తక్షణం అనర్హత వేటు వేయాలని సుప్రీంకోర్టు ఈ ఏడాది జూలైలో తీర్పునిచ్చినవిషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేరాభియోగాలు ఎదుర్కొంటున్నవారిని సైతం నిషేధించాలంటూ ఈసీ ప్రతిపాదించడం గమనార్హం.
నిందితులు పోటీ చేయకుండా నిషేధానికి సుముఖం
Published Sat, Nov 23 2013 4:32 AM | Last Updated on Sun, Sep 2 2018 5:20 PM
Advertisement