coal allocation scam
-
బొగ్గు కుంభకోణంలో మాజీ కార్యదర్శి దోషే: కోర్టు
న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణంలో ఆ శాఖ మాజీ కార్యదర్శి హెచ్‌సీ గుప్తా, మాజీ సంయుక్త కార్యదర్శి కేఎస్ క్రోఫాలను సీబీఐ ప్రత్యేక కోర్టు శుక్రవారం దోషులుగా తేల్చింది. మహారాష్ట్రలోని లొహారా ఈస్ట్ కోల్ బ్లాక్ కేటాయింపుల్లో వీరిద్దరూ నేరపూరిత కుట్రకు, మోసం, అవినీతికి పాల్పడ్డారని పేర్కొంది. గ్రేస్ ఇండస్ట్రీస్(జీఐఎల్)ను, ఆ కంపెనీ డైరెక్టర్ ముకేశ్ గుప్తాను కూడా ప్రత్యేక జడ్జి అరుణ్ భరద్వాజ్ దోషిగా పేర్కొన్నారు. వీరికి ఆగస్ట్ 4న శిక్షలు ఖరారు చేయనున్నారు. 2005–11 సంవత్సరాల మధ్య బొగ్గు బ్లాకుల కేటాయింపుల్లో చోటుచేసుకున్న అవకతవకలపై సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ఇదీ చదవండి: ఫ్యామిలీ కోర్టుల్లో 11.4 లక్షల పెండింగ్ కేసులు -
అదనపు సోలిసిటర్ జనరల్ అమన్ లేఖి రాజీనామా
సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది అమన్ లేఖి, అదనపు సోలిసిటర్ జనరల్ పదవికి రాజీనామా చేశారు. శుక్రవారం హడావిడిగా ఆయన తన రాజీనామా లేఖను కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరెన్ రిజ్జూకి పంపించారు. తక్షణమే తన రాజీనామాను ఆమోదించాలని ఆయన మంత్రిని కోరినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే అదనపు సోలిసిటర్ జనరల్ పదవి రాజీనామాకు గల కారణాల్ని ఆయన లేఖలో తెలియజేయలేదు. కేవలం రెండు లైన్ల సందేశంతో ఆయన లెటర్ సమర్పించడం విశేషం. ఆయన తిరిగి ప్రైవేట్ ప్రాక్టీస్ వైపే వెళ్లొచ్చని సన్నిహితులు చెప్తున్నారు. సుప్రీం కోర్టు అదనపు సోలిసిటర్ జనరల్‌గా లేఖి మార్చి, 2018లో నియమించబడ్డారు. జులై 1, 2020న ఆయన్ని తిరిగి నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆయన పదవీకాలం 2023, జూన్ 30న ముగియాల్సి ఉంది. ఈలోపే ఆయన కారణం చెప్పుకుండా రాజీనామా చేయడం గమనార్హం. అమన్ లేఖి ఏఎస్జీ హోదాలో బోగ్గు కేటాయింపుల స్కామ్, 2జీ స్పెక్ట్రమ్ కేటాయింపుల స్కామ్‌లో హాజరయ్యారు. బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి ఈయన భార్యే. -
రాజ్యసభ ఎంపీపై చార్జిషీటు
న్యూఢిల్లీ: బొగ్గు గనుల కేటాయింపు కుంభకోణంలో రెండో చార్జిషీటును సీబీఐ దాఖలు చేసింది. ఢిల్లీ ప్రత్యేక కోర్టులో దాఖలు చేసిన ఈ చార్జిషీటులో రాజ్యసభ సభ్యుడు విజయ్ దార్దా, నాగపూర్‌కు చెందిన ఏఎంఆర్ ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ డైరెక్టర్లు, ఇతరుల పేర్లు ఉన్నాయి. విజయ్ దార్దా తనయుడు దేవేంద్ర, ఏఎంఆర్ ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ డైరెక్టర్లు అరవింద్ కుమార్ జైశ్వాల్, మనోజ్ జైశ్వాల్, రమేష్ జైశ్వాల్‌లతో పాటు బొగ్గు మంత్రిత్వ శాఖకు చెందిన గుర్తుతెలియని అధికారులను నిందితులుగా పేర్కొన్నారు. వీరిపై భారతీయ శిక్షా స్మృతి (ఐపీసీ)లోని సెక్షన్లు 120బీ (నేరపూరిత కుట్ర), 420 (మోసం) కింద దర్యాప్తు సంస్థ అభియోగాలు మోపింది. సీబీఐ తన మొట్టమొదటి చార్జిషీటును ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నవభారత్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్‌పై దాఖలు చేసిన సంగతి తెలిసిందే. -
యూపీఏ సర్కారు నేరాంగీకారం!
సంపాదకీయం: బొగ్గు కుంభకోణం వెల్లడైననాటినుంచీ ఏమీ జరగలేదని దబాయిస్తూ వస్తున్న యూపీఏ ప్రభుత్వం ఎట్టకేలకు దారికొచ్చింది. ‘ఎక్కడో తప్పు జరిగింద’ని సర్వోన్నత న్యాయస్థానం ముందు తాజాగా అంగీకరించింది. చావుకు పెడితే లంఖణానికి రావడం అంటే ఇదే. 195 బొగ్గు క్షేత్రాల కేటాయింపులో లక్షా 86వేల కోట్ల రూపాయల స్కాం జరిగిందని దాదాపు రెండేళ్లక్రితం వెల్లడైనప్పుడు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) అతిగా లెక్కలేసి చూపుతున్నారని కేంద్రం ఆరోపించింది. అంతా సవ్యంగానే ఉన్నదని చెప్పింది. అప్పటికీ, ఇప్పటికీ ఎంత మార్పు! బొగ్గు క్షేత్రాల కేటాయింపు ప్రక్రియలో ఎక్కడో తప్పు జరిగిందని అటార్నీ జనరల్ వాహనవతి న్యాయమూర్తుల ముందు అంగీకరించారు. వాటిని మరింత మెరుగైన పద్ధతిలో చేసి ఉండాల్సిందని కూడా అభిప్రాయపడ్డారు. వాహనవతి వాదననుంచి వెనక్కి వెళ్తే కేంద్రం నోటి వెంబడి రాలిపడిన ఆణిముత్యాలు తారసపడతాయి. 2012 మే నెలలో స్కాం గురించి కాగ్ నివేదిక లీక్ అయినప్పుడు కాంగ్రెస్ పెద్దలంతా ఇంతెత్తున ఎగిరిపడ్డారు. 2జీ స్కాంలో కూడా కాగ్ ఇలాగే వ్యవహరించిందని, ఊహాజనిత గణాంకాలతో ఒక పెద్ద అంకెను సృష్టించి ఏదో జరిగిపోయిందన్న అభిప్రాయాన్ని ప్రజల్లో కలిగించేందుకు చూసిందని ఆరోపించారు. అదే ఏడాది ఆగస్టులో పార్లమెంటు వర్షాకాల సమావేశాలను బొగ్గు స్కాం చాపచుట్టే పరిస్థితి ఏర్పడినప్పుడు ప్రధాని మన్మోహన్ సింగ్ జోక్యం చేసుకుని దానిపై వివరణనిచ్చారు. ఆ వివరణ మొత్తం కాగ్‌పై ఆరోపణలతోనే నడిచింది. అప్పుడు ఆయనన్న మాటలేమిటి? కాగ్ నివేదిక సర్వం తప్పు దారిపట్టించేలా ఉన్నదని చెప్పారు. బొగ్గును అధికంగా ఉత్పత్తిచేసి దేశావసరాలకు దాన్ని అందుబాటులోకి తేవడమే తమ కేటాయింపుల వెనకున్న ఉద్దేశమని చెప్పారు. కాగ్ చెప్పిన నష్టాలన్నీ ఊహాజనితమైనవన్న సహచర మంత్రుల వాదనను ఆయన గట్టిగా సమర్ధించారు. కాగ్ నివేదికను ప్రజా పద్దుల సంఘం(పీఏసీ) పరిశీలించడానికి ముందే పార్లమెంటు వేదికపైనుంచి దానిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదన్న సంప్రదాయాన్ని ఆయన ఉల్లంఘించారు. అటు సుప్రీంకోర్టు ఆదేశాల పర్యవసానంగా ప్రారంభమైన సీబీఐ దర్యాప్తు ఈ కేటాయింపుల్లోని కంతలను చాలానే బయటపెట్టింది. మొత్తం 195 బొగ్గు క్షేత్రాలను కేటాయించగా అందులో కేవలం 60 మాత్రమే సరిగా ఉన్నాయని సుప్రీంకోర్టుకు అందజేసిన నివేదికలో వెల్లడించింది. వాస్తవానికి బొగ్గు కుంభకోణం జరిగినకాలంలో ఆ శాఖ ప్రధాని అధీనంలోనే ఉంది. బొగ్గు క్షేత్రాల కేటాయింపు కోసం బహిరంగ టెండర్ విధానం అమలు చేయవలసి ఉన్నది. అంతేకాదు... నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసిన సంస్థల పనితీరు ఎలాంటిదో, వాటి అవసరాలు ఏపాటో స్క్రీనింగ్ కమిటీ కూలంకషంగా ఆరాతీయాలి. ఇలాంటి విధానంలోనే బొగ్గు క్షేత్రాలను కేటాయిస్తామని యూపీఏ ప్రభుత్వమే పార్లమెంటుకు 2004లో చెప్పింది. కానీ, ఆచరణలో అందుకు విరుద్ధంగా ప్రవర్తించింది. స్క్రీనింగ్ కమిటీ అంగీకారానికైనా, తిరస్కృతికైనా ఒక ప్రాతిపదిక లేదు. ఉదాహరణకు 2008లో తన ముందుకొచ్చిన 28 దరఖాస్తుల్లో ఎనిమిదింటిని కమిటీ తిరస్కరించింది. అంగీకరించినవాటికిగానీ, తిరస్కరించినవాటికిగానీ సహేతుకమైన వివరణలు లేవు. పైగా, సంబంధిత శాఖలనుంచి రాని 11 దరఖాస్తులను నిబంధనలకు విరుద్ధంగా నేరుగా తీసుకుంది. ప్రకృతి ప్రసాదించిన అరుదైన వనరుల్లో బొగ్గు కూడా ఒకటి. దాన్ని అవసరాల ప్రాతిపదికగా మాత్రమే కేటాయించాల్సి ఉండగా, విచక్షణారహితంగా కట్టబెట్టారు. ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రుల, నేతల సిఫార్సులే చెల్లు బాటయ్యాయి. పైగా, వాటిని నామమాత్రపు ధరకు కట్టబెట్టారు. చేతికందిన బొగ్గు క్షేత్రాలను చాలా సంస్థలు 2జీ స్పెక్ట్రమ్ స్కాం తరహాలోనే వేరే సంస్థలకు అమ్ముకున్నాయి. ఇలా చేతులు మారిన బొగ్గు క్షేత్రాలవల్ల ఖజానాకు వాటిల్లిన నష్టమెంతో కాగ్ అంచనా వేస్తే ఈ స్కాం 2 లక్షల కోట్ల రూపాయలు దాటినా ఆశ్చర్యంలేదు. చేతికి ఎముక లేకుండా సాగిన వ్యవహారాన్ని కాగ్ ఆరా తీసేసరికి మాత్రం ఎక్కడలేని కోపమూ వచ్చింది. యూపీఏ ప్రభుత్వం అనుసరించిన ఈ అస్తవ్యస్థ విధానంవల్ల విద్యుదుత్పానారంగానికి, పరిశ్రమలకూ పెను నష్టంవాటిల్లింది. పారిశ్రామికోత్పత్తి మందగించింది. ఉద్యోగకల్పన తగ్గిపోయింది. చాలినంత విద్యుత్తు లభ్యంకాకపోవడంతో ఉక్కు పరిశ్రమల ఉత్పత్తి తగ్గిపోయింది. దేశంలో ఇనుప ఖనిజం నిల్వలు అపారంగా ఉన్నా మన అవసరాలకు కావలసిన ఉక్కును విదేశాలనుంచి దిగుమతి చేసుకోవాల్సివచ్చింది. ఇలా బహుముఖాలుగా దేశాన్ని నష్టపరిచి కూడా యూపీఏ ప్రభుత్వం తమ తప్పేమీ లేదంటూ చెబుతూ వచ్చింది. బొగ్గు స్కాంలో ఇంకా చాలా విచిత్రాలు జరిగాయి. ఉన్నట్టుండి కొన్ని కీలక ఫైళ్లకు కాళ్లొచ్చాయి. సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని, గట్టిగా హెచ్చరించాకే సీబీఐకి ఆ ఫైళ్లు చేరాయి. బొగ్గు క్షేత్రాల కేటాయింపు జరిగాక వివిధ సంస్థలు భారీ మొత్తాల్లో పెట్టుబడులు పెట్టాయని, దాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ క్షేత్రాల్లో పనులు ప్రారంభించడానికి అనుమతించాలని కేంద్రం సుప్రీంకోర్టులో వింత వాదన మొదలుపెట్టింది. ఒకపక్క తప్పు జరిగిందని అంగీకరిస్తూనే ఇలాంటి వినతి చేయడం వింతే. బొగ్గు క్షేత్రాల కేటాయింపు ప్రక్రియలో తమ పాత్ర చాలా స్వల్పమని, తప్పంటూ జరిగితే అది కేంద్రంవైపునుంచే ఉంటుందని వివిధ రాష్ట్రాలు తప్పుకుంటున్నాయి. కేంద్రం స్వయంగా తానే అంగీకరించింది. ఇలాంటి పరిస్థితుల్లో బొగ్గు క్షేత్రాల్లో పనులకు అనుమతించమని కేంద్రం ఎలా కోరగలదో ఊహకందని విషయం. నిజానికి కాగ్ వెల్లడించినప్పుడే పొరపాట్లను అంగీకరించి, వెను వెంటనే నిష్పాక్షికమైన విచారణకు పూనుకుంటే ఈపాటికే బొగ్గు క్షేత్రాల్లో పనులు ప్రారంభమై విద్యుదుత్పాదనకు మార్గం సుగమమయ్యేది. కానీ, విలువైన సమయాన్నంతా వృధా వాదనలకు వెచ్చించి, ఇప్పుడు తప్పు ఒప్పుకుని ప్రయోజనమేమిటి? ఈ రెండేళ్ల కాలంలో దేశం ఎన్నో విధాల నష్టపోయింది. అందుకు దేశ ప్రజలకు యూపీఏ సంజాయిషీ ఇవ్వాలి. -
‘కోల్గేట్’పై సుప్రీంకు నివేదిక
న్యూఢిల్లీ: బొగ్గు గనుల కేటాయింపు కుంభకోణంలో ఇప్పటివరకూ తమ దర్యాప్తులో వెల్లడైన అంశాలపై సీబీఐ సోమవారం సుప్రీంకోర్టుకు నివేదికను అందజేసింది. సీల్డ్ కవర్లో అందజేసిన ఈ నివేదికను జస్టిస్ ఆర్ఎం లోధా నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం పరిశీలించనుంది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోని 195 బొగ్గు గనుల లీజుల కేటాయింపులో కుంభకోణం జరిగినట్లుగా ఆరోపణలొచ్చిన విషయం తెలిసిందే. 60 బొగ్గు గనుల కేటాయింపుల్లో ఎలాంటి అక్రమాలూ కనిపించలేదని సీబీఐ ఆ నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. -
విధి నిర్వహణలో.. మరింత స్వతంత్రత కావాలి: సీబీఐ
న్యూఢిల్లీ: విధి నిర్వహణలో తమకు మరిం త స్వతంత్రత అవసరమని కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) సుప్రీంకోర్టుకు తెలిపింది. రోజువారీ విధుల నిర్వహణలపై డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్(డీఓపీటీ) నియంత్రణ.. తమ సామర్ధ్యం, స్వతంత్రతలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని స్పష్టం చేసింది. నిష్పక్షపాత, సమర్ధవంతమైన, వేగవంతమైన దర్యాప్తు కోసం తమ డెరైక్టర్‌కు మరిన్ని అధికారాలు ఇవ్వాలని పేర్కొంది. సీబీఐ డెరైక్టర్‌కు డీఓపీటీలో ఎక్స్ అఫిషియో కార్యదర్శి అధికారాలు ఇచ్చి, సంబంధిత మంత్రికి సీబీఐ డెరైక్టరే నేరుగా నివేదించేలా చర్యలు తీసుకోవాలని కోరింది. బొగ్గు కుంభకోణం కేసుకు సంబంధించి ఈ మేరకు సీబీఐ తరఫు న్యాయవాది అమిత్ ఆనంద్ తివారీ సోమవారం అత్యున్నత న్యాయస్థానానికి ఒక అఫిడవిట్ సమర్పిం చారు. డీఓపీటీతో అనుసంధానమైన కార్యాలయమైనప్పటికీ.. సీబీఐ రోజువారీ విధులను ఆ శాఖ నియంత్రించే నిబంధనేదీ లేదని అందులో పేర్కొంది. కార్యనిర్వాహక నియంత్రణ నుంచి బయటకు రావాలన్న ఉద్దేశం తమకు లేదని.. అయితే సీబీఐ డెరైక్టర్‌కు పరిపాలన, ఆర్థిక పరమైన అధికారాలు చాలినన్ని లేకపోవడం వల్ల దర్యాప్తు అనవసరంగా ఆలస్యం అవుతోందని వివరించింది. విధి నిర్వహణలో అధికార సంబంధ అంచెలు తీవ్ర అడ్డంకిగా మారాయంటూ పలు ఉదాహరణలను కోర్టుకు తెలిపింది. -
ప్రధానిపై చర్యకు సీబీఐ జంకు
బొగ్గు కుంభకోణంలో దర్యాప్తుపై మోడీ ధ్వజం యూపీఏ సర్కారు సీబీఐని దుర్వినియోగం చేస్తోంది ఉదయ్‌పూర్(రాజస్థాన్): కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వంపై బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ విమర్శల దాడిని తీవ్రం చేశారు. రాజకీయ లబ్ధి కోసం కేంద్రం సీబీఐని దుర్వినియోగం చేస్తోందని, తన వ్యతిరేకుల గొంతు నొక్కి, అణచివేతకు పాల్పడుతోందని నిప్పులు చెరిగారు. బొగ్గు కుంభకోణంలో ఆరోపణలున్న ప్రధాని మన్మోహన్ సింగ్‌పై చర్యలు తీసుకోవడానికి సీబీఐ భయపడుతోందన్నారు. తనపై కానీ, ఇతర బీజేపీ నేతలపై కానీ ఒక్క ఆరోపణ వచ్చి ఉన్నా దర్యాప్తు సంస్థ తక్షణమే జైల్లోకి నెట్టేసేదని పేర్కొన్నారు. ‘ప్రధాని కార్యాలయం(పీఎంఓ)పై ఆరోపణలు వచ్చాయి. బొగ్గు స్కాంలో ఓ సీనియర్ అధికారి నేరుగా ప్రధానిపైనే ఆరోపణలు చేశారు. వసుంధర, నరేంద్ర మోడీ, శివరాజ్ సింగ్, రమణ్‌సింగ్‌లపై ఇలాంటి ఆరోపణలు వచ్చి ఉంటే సీబీఐ వారిని ఉన్నపళంగాకటకటాల వెనక్కి తోసేసేది. అయితే ప్రధాని విషయంలో మాత్రం అది పామును చూసినట్లు కొయ్యబారిపోతోంది’ అని అన్నారు. మోడీ శనివారం రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఎన్నికల బహిరంగ సభలో ప్రసంగించారు. లోక్‌సభ ఎన్నికలకు ఆరు నెలల వ్యవధే ఉందని, ఆలోపు యూపీఏ సర్కారు తప్పిదాలన్నీ బట్టబయలవుతాయని అన్నారు. ఉల్లి ధరల కట్టడిలో కేంద్రం విఫలమవుతోందని దుయ్యబట్టారు. దిగుబళ్లు ఐదు శాతమే తగ్గగా, ధరలు మాత్రం 1,500 శాతం పెరిగాయన్నారు. ఉల్లిని ఎక్కువగా పండించే కాంగ్రెస్ సారథ్యంలోని ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక లే దీనికి కారణమని ఆరోపించారు. ఆ రాష్ట్రాల్లో ఎవరు అక్రమంగా నిల్వ చేస్తూ, ధరలు పెంచుతున్నారో కేంద్రానికి తెలియకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. రాజస్థాన్ సర్కారును గద్దె దింపండి.. రాజస్థాన్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వంపై మోడీ నిప్పులు చెరిగారు. సొంత పార్టీనే నమ్మని ఆ ప్రభుత్వాన్ని ప్రజలు మళ్లీ ఎందుకు ఎన్నుకోవాలని ప్రశ్నించారు. 2009లో మతఘర్షణలు జరిగిన గోపాల్గఢ్ను రాహుల్.. రాజస్థాన్ సర్కారుకు, సీఎంకు చెప్పకుండానే సందర్శించడాన్ని ప్రస్తావించారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం లెక్కలేనన్ని ప్రాజెక్టులు ప్రారంభించిందని, రిబ్బన్ కటింగ్‌లకు కత్తెరలు కరవయ్యాయని ఎగతాళి చేశారు. ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వసుంధర రాజే, రాజేంద్ర రాథోడ్ తదితర బీజేపీ నేతలను లక్ష్యంగా చేసుకుంటోందని ఆరోపించారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదని, వారు మంత్రులను క లిసేందుకు భయపడుతున్నారని అన్నారు. అత్యాచార కేసులో అరెస్టయిన మాజీ మంత్రి బాబూలాల్ నగర్‌ను ఉద్దేశించి పరోక్షంగా ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన కాంగ్రెస్ సర్కారును గద్దె దింపాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రాహుల్ మాటలు అర్థం కావడం లేదు.. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని తాను యువరాజు(షెహజాదా) అని వ్యాఖ్యానించడంపై కాంగ్రెస్ మండిపడుతున్నా మోడీ వెనక్కి తగ్గడం లేదు . ఉదయ్‌పూర్ సభలో రాహుల్‌ను మళ్లీ యువరాజు అని పలుసార్లు సంబోధించి విసుర్లు విసిరారు. ‘నేను చిన్న పరిశోధన చేసి ఓ సంగతి తెలుసుకున్నా. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి కాంగ్రెస్ టికెట్ కోసం ప్రయత్నిస్తున్న ఆ రాష్ట్ర పోలీసు అధికారి ఒకరు యువరాజును కలిసి ముజఫర్‌నగర్- పాక్ గూఢచర్య సంస్థ ఐఎస్ఐ కథనం వినిపించారు. ఆ తర్వాతే యువరాజు.. ఐఎస్ఐ ముజఫర్ మతఘర్షణల బాధితులను కలిసిందని దేశమంతా చాటారు. దేశ పగ్గాలను ఇలాంటి వారికి అప్పగిస్తారా?’ అని ప్రశ్నించారు. ఇటీవలి ఉదయ్‌పూర్ పర్యటనలో రాహుల్ ఏం మాట్లాడారో, ఎందుకు మాట్లాడారో, ఎవరి కోసం మాట్లాడారో ఆయన పార్టీ నేతలకు సహా ఎవ్వరికీ అర్థం కాలేదని ఎద్దేవా చేశారు. అసలు తానేం మాట్లాడిందీ రాహుల్‌కే తెలియదన్నారు. ఆయన తన నాయనమ్మ, తండ్రుల కథలను ప్రసంగాల్లో వల్లెవేస్తున్నారని, అవి కాంగ్రెస్‌కు లబ్ధి చేకూరుస్తాయని అనుకుంటున్నారన్నారు. రాజస్థాన్ మతఘర్షణలపై అక్కడి కాంగ్రెస్ సర్కారును మైనారిటీ కమిషన్ విమర్శించగా, రాహుల్ మాత్రం లౌకికవాద పాఠాలు వల్లె వేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఐఎస్ఐను కలిసిన ముజఫర్ అల్లర్ల బాధితుల పేర్లు బయటపెట్టాలని, లేకపోతే క్షమాపణ చెప్పాలని మోడీ రాహుల్‌ను శుక్రవారం డిమాండ్ చేయడం తెలిసిందే. -
బిర్లాకు బొగ్గు మసి !
న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణంలో ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆదిత్య బిర్లా గ్రూపు అధినేత కుమారమంగళం బిర్లా(46)పై సీబీఐ కేసు నమోదు చేసింది. గనుల కేటాయింపులో ఆయనతోపాటు, బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి పీసీ పరేఖ్, కొంతమంది అధికారులు అవినీతి, నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని ఆరోపిస్తూ అవినీతి నిరోధక చట్టం కింద మంగళవారమిక్కడి సీబీఐ కోర్టులో ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. తర్వాత వెంటనే ఢిల్లీ, హైదరాబాద్, భువనేశ్వర్, ముంబైలలో ఆరుచోట్ల సోదాలు నిర్వహించింది. సోదాలు జరిగిన వాటిలో ఆదిత్య బిర్లా గ్రూపునకు చెందిన హిండాల్కో కార్యాలయాలు, సికింద్రాబాద్‌లోని పరేఖ్ నివాసం ఉన్నాయి. ఒడిశాలోని తలబిరాలో ఉన్న రెండో, మూడో నంబరు గనుల కేటాయింపులో అవినీతి, నేరపూరిత కుట్రకు పాల్పడినట్లు ఆదిత్య బిర్లా ప్రతినిధిగా కుమారమంగళం బిర్లా, పరేఖ్లతోపాటు హిండాల్కో, బొగ్గు శాఖకు చెందిన కొంతమంది అధికారులు, గుర్తు తెలియని వ్యక్తులపై ఎఫ్ఐఆర్ దాఖలు చేశామని సీబీఐ ప్రతినిధి కంచన్ ప్రసాద్ చెప్పారు. ప్రభుత్వరంగ సంస్థలకు ఉద్దేశించిన తలబిరా గనులను ఓ ప్రభుత్వ సంస్థతోపాటు హిండాల్కోకు కూడా కేటాయించారని, 2005లో బిర్లా, పరేఖ్‌ల మధ్య భేటీ తర్వాత స్క్రీనింగ్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుందని, అందుకే ఎఫ్ఐఆర్లో బిర్లా పేరు చేర్చామని సీబీఐ వర్గాలు చెప్పాయి. తలబిరా గనులను తమిళనాడు ప్రభుత్వ సంస్థ నైవేలీ లిగ్నైట్ లిమిటెడ్‌కు కేటాయించాల్సి ఉండగా, పరేఖ్ వాటిని విద్యుదుత్పత్తి కోసం నైవేలీ లిగ్నైట్, హిండాల్కోలు కలిసి పంచుకోవడానికి అనుమతించారని పేర్కొంది. ఫలితంగా ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లేందుకు కారణమయ్యారని తెలిపింది. అయితే గనుల్లో పని ప్రారంభించకపోవడంతో ఎంత నష్టం వచ్చిందో చెప్పలేమని, ప్రస్తుతం అంచనా వేస్తున్నామని సీబీఐ వర్గాలు తెలిపాయి. బిర్లా, పరేఖ్లను విచారణకు పిలిపిస్తామన్నాయి. తాజా కేసుతో ఈ స్కాంలో సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ల సంఖ్య 14కు చేరింది. కాగా, తమకు ఎఫ్ఐఆర్ ప్రతి అందలేదని, తాము ఎలాంటి అక్రమాలకూ పాల్పడలేదని ఆదిత్య బిర్లా గ్రూపు తెలిపింది. సీబీఐ కేసు నేపథ్యంలో హిండాల్కో, ఏబీ నువో కంపెనీల షేర్ల విలువ మంగళవారం కాస్త ఒడిదుడుకులకు లోనైంది. బొగ్గు కుంభకోణంలో మందకొడి దర్యాప్తు, గనుల కేటాయింపుల ఫైళ్ల గల్లంతుపై సుప్రీం కోర్టు సీబీఐని, కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా దుయ్యబట్టడం తెలిసిందే. కుంభకోణానికి సంబంధించిన అన్ని కేసులపై ఈ ఏడాది డిసెంబర్ నాటికి దర్యాప్తు పూర్తి చేయాలని కోర్టు సీబీఐని ఆదేశించింది. ఈ స్కాంలో సీబీఐ కాంగ్రెస్ ఎంపీ నవీన్ జిందాల్, బొగ్గు శాఖ మాజీ సహాయ మంత్రి దాసరి నారాయణరావులపైనా కేసు పెట్టడం విదితమే. -
ఫైళ్ల గల్లంతుపై ప్రాథమిక విచారణ
న్యూఢిల్లీ: బొగ్గు బ్లాకుల కేటాయింపులకు సంబంధించిన ఫైళ్ల గల్లంతుపై సీబీఐ రెండు రోజుల్లోగా ప్రాథమిక విచారణ (పీఈ) ప్రారంభించనుంది. బొగ్గుశాఖ అధికారులతో గురువారం సీబీఐ అధికారులు సమావేశమైన దరిమిలా ఈ నిర్ణయం తీసుకున్నారు. తన వద్ద ఉన్న ఫైళ్ల వివరాలతో బొగ్గుశాఖ బుధవారం సీబీఐకి ఒక లేఖ రాసింది. దీనినే ఫిర్యాదుగా పరిగణిస్తూ, దర్యాప్తు ప్రారంభించాలని కోరింది. బొగ్గు బ్లాకుల కేటాయింపులకు సంబంధించి 15 నుంచి 18 ఫైళ్లు గల్లంతైనట్లు బొగ్గుశాఖ అధికారులు, సీబీఐ అధికారులు ఈ సమావేశంలో నిర్ధారణకు వచ్చారు. తొలుత దీనిపై నేరుగా దర్యాప్తు ప్రారంభించాలని భావించినా, మొదట ప్రాథమిక విచారణ ప్రారంభించి, సాక్ష్యాధారాలు దొరికితే, కేసు నమోదు చేసుకోవచ్చని సీబీఐ నిర్ణయానికి వచ్చినట్లు అధికార వర్గాలు తెలిపాయి. 26వ స్క్రీనింగ్ కమిటీ మినిట్స్‌కు సంబంధించిన ఫైళ్లు సహా కొన్ని ఫైళ్లు గల్లంతైన విషయాన్ని బొగ్గుశాఖ అధికారులతో జరిపిన చర్చల్లో సీబీఐ అధికారులు గుర్తించారని, ఎంతగానో ప్రయత్నిస్తే ఆ సమావేశం మినిట్స్ ముసాయిదా మాత్రమే దొరికిందని చెప్పాయి. బొగ్గు బ్లాకుల కేటాయింపులపై ఇప్పటికే కొనసాగుతున్న 13 కేసులకు సంబంధించిన కీలకమైన రికార్డుల కోసం సీబీఐ అన్వేషిస్తోంది. గల్లంతైన వాటిలో ఏఎంఆర్ ఐరన్ అండ్ స్టీల్ కంపెనీకి బొగ్గు బ్లాకుల కేటాయింపు కోసం కాంగ్రెస్ ఎంపీ విజయ్ దర్దా రాసిన సిఫారసు లేఖ కూడా ఉంది. సీబీఐ గత వారం విడుదల చేసిన జాబితాలో తనకు బొగ్గుశాఖ నుంచి ఇంకా 150 ఫైళ్లు, పత్రాలు అందలేదని వెల్లడించింది. ‘బొగ్గు’ కేసుపై ఆగస్టు 29న విచారణ జరిపిన సుప్రీంకోర్టు, దర్యాప్తుకు అవసరమైన ఫైళ్ల జాబితాను బొగ్గుశాఖకు ఇవ్వాలని, బొగ్గుశాఖ రెండు వారాల్లోగా సీబీఐకి వాటిని అందించాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. -
సహజవనరులను ఉదారంగా ఎలా కేటాయిస్తారు: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: వివాదాస్పద బొగ్గు బ్లాకుల కేటాయింపు కేసులో సుప్రీంకోర్టు కేంద్రానికి ప్రశ్నాస్త్రాలు సంధించింది. బొగ్గు సహజసిద్ధంగా లభించే ప్రకృతి సంపద అనీ, సహజ వనరులను ఎవరికైనా ఉదారంగా కట్టబెట్టడానికి వీల్లేదని స్పష్టం చేసింది. బొగ్గువంటి సహజవనరుల కేటాయింపులో బిడ్డింగ్ ప్రక్రియను ఎందుకు పాటించలేదని బుధవారం జస్టిస్ ఆర్ఎం లోధా నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం ప్రభుత్వాన్ని నిలదీసింది. బొగ్గు కేటాయింపులపై దాఖలైన రెండు వ్యాజ్యాలపై తుది విచారణ సందర్భంగా అటార్నీ జనరల్ వాహనవతిని ధర్మాసనం ప్రశ్నించింది. సీబీఐకి ఇంకా అందని బొగ్గు ఫైళ్లు: బొగ్గు బ్లాకుల కేటాయింపు ఫైళ్ల గల్లంతు వ్యవహారం నానాటికీ సంక్లిష్టంగా పరిణమించడంతో ఈ అంశంపై ఎఫ్ఐఆర్ దాఖలు చేసే విషయమై సీబీఐ యోచిస్తోంది. దీనిపై చర్చించేందుకు సీబీఐ అధికారులు, బొగ్గు మంత్రిత్వ శాఖ అధికారులు త్వరలో సమావేశమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. బొగ్గు కేటాయింపులపై సీబీఐ కోరుతున్న పత్రాల విషయంలో బొగ్గు శాఖ అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఈ సమావేశానికి నిర్ణయం తీసుకున్నారు. సీబీఐ కోరుతున్న ఫైళ్లు తన వద్ద లేవంటూ బొగ్గు శాఖ వాదిస్తున్న నేపథ్యంలో ఈ సమావేశం నిర్వహించనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. -
‘బొగ్గు’పై కేంద్రానికి తలంటిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: బొగ్గు బ్లాకుల కేటాయింపుల్లో అవినీతి కుంభకోణం కేసు విచారణలో సుప్రీంకోర్టు మంగళవారం కేంద్రాన్ని తలంటింది. ఈ కుంభకోణానికి సంబంధించిన పలు అంశాలపై ప్రశ్నల పరంపర కురిపించిన ధర్మాసనం, కేంద్రాన్ని వివరణ కోరింది. ధర్మాసనం ప్రశ్నలకు బదులు చెప్పేందుకు ప్రభుత్వం తరఫున హాజరైన అడ్వొకేట్ జనరల్ జీఈ వాహనవతి, సొలిసిటర్ జనరల్ మోహన్ పరాశరన్, అదనపు సొలిసిటర్ జనరల్ పారస్ కుహాడ్లు ఉక్కిరిబిక్కిరయ్యారు. సహజ వనరును కేటాయించేటప్పుడు వేలం ప్రక్రియను ఎందుకు పాటించలేదని ధర్మాసనం ప్రశ్నించింది. బొగ్గు బ్లాకుల కేటాయింపులో 1992 నాటి పద్ధతులకు చట్టపరమైన అనుమతి ఉందా..? కేటాయింపులపై నిర్ణయం తీసుకునేందుకు స్క్రీనింగ్ కమిటీకి ఏ చట్టం ప్రకారం అధికారం కల్పించారు..? అని ప్రశ్నించింది. వీటికి బదులిస్తానని, 1992లో సరళీకరణ విధానానికి దారితీసిన పరిస్థితులను వివరిస్తానని అడ్వొకేట్ జనరల్ వాహనవతి కోర్టుకు హామీ ఇచ్చారు. ఇదివరకు కోల్ ఇండియా లిమిటెడ్ అనుబంధ సంస్థ అయిన సెంట్రల్ మైన్ ప్లానింగ్ అండ్ డిజైన్ ఇన్స్టిట్యూట్ లిమిటెడ్ (సీఎంపీడీఐఎల్) బొగ్గు బ్లాకుల కేటాయింపులు చేపడుతుండగా, అందుకోసం స్క్రీనింగ్ కమిటీని ఎందుకు ఏర్పాటు చేశారని ధర్మాసనం ప్రశ్నించింది. సీఎంపీడీఐఎల్ ఎక్స్ట్రా ప్లేయర్‌గా మారిపోయిందని, దాని పాత్రను స్క్రీనింగ్ కమిటీ పోషించిందని అక్షింతలు వేసింది. అన్నింటిపైనా వివరణ ఇవ్వాలని స్పష్టం చేసిన ధర్మాసనం, బంతి మీ కోర్టులో ఉందని అడ్వొకేట్ జనరల్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించింది. అడ్వొకేట్ జనరల్, దీనికి తేలికగా స్పందిస్తూ, ‘ఎక్కువ బంతులు ఉండటంతో గందరగోళం ఏర్పడుతోంది’ అని బదులిచ్చారు. దీనిపై స్పందించిన ధర్మాసనం... బొగ్గు బ్లాకులను ఉచితంగానే కేటాయించారని పిటిషనర్లు ఆరోపిస్తున్నారని వ్యాఖ్యానించింది. -
సీబీఐకి మరికొన్ని ‘బొగ్గు’ ఫైళ్లు!
న్యూఢిల్లీ: బొగ్గు కేటాయింపులకు సంబంధించి తాజాగా మరికొన్ని ఫైళ్లు, పత్రాలు సోమవారం సీబీఐకి అందాయి. బొగ్గు శాఖ నుంచి తాజాగా వచ్చిన ఫైళ్లు, పత్రాల పరిశీలన మొదలైందని సీబీఐ వర్గాలు వెల్లడించాయి. వాటన్నింటినీ పరిశీలించిన తర్వాతే ఇంకా తమకు ఎన్ని ఫైళ్లు రావాలో అనే విషయంపై అంచనాకు వస్తామని పేర్కొన్నాయి. కాగా, ఫైళ్లు, పత్రాలతోపాటు గల్లంతైన ఫైళ్లకు సంబంధించి బొగ్గు మంత్రిత్వ శాఖ సీబీఐకి సమగ్ర నివేదిక సమర్పించినట్టు ఆశాఖ అధికారి ఒకరు తెలిపారు. అయితే అందులో ఉన్న వివరాల గురించి వెల్లడించేందుకు నిరాకరించారు. అది అత్యంత రహస్యమైన అంశమని, దాని గురించి తాను మాట్లాడబోనని పేర్కొన్నారు. కాగా, బొగ్గు కేటాయింపులకు సంబంధించిన ఫైళ్లను సీబీఐకి పంపించారా లేదా అనే అంశంపై ఆ శాఖ మంత్రి శ్రీప్రకాశ్ జైశ్వాల్ ఏ విషయమూ వెల్లడించలేదు. మరోవైపు గల్లంతైన బొగ్గు ఫైళ్ల వ్యవహారంపై ఎప్పుడు ఫిర్యాదు చేస్తారని అడగ్గా.. ‘సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా, చట్టప్రకారం నిర్దేశించిన సమయంలోనే తగిన చర్యలు తీసుకుంటాం’ అని బొగ్గుశాఖ అధికారి బదులిచ్చారు. -
‘బొగ్గు’ ఫైళ్ల మాయంపై నిలదీస్తాం: బీజేపీ, జేడీయూ
న్యూఢిల్లీ: బొగ్గు కేటాయింపుల కుంభకోణానికి సంబంధించిన ఫైళ్లు కొన్ని కనిపించకుండా పోయాయని ప్రభుత్వం చేసిన ప్రకటనపై విపక్షాలు అగ్గిమీద గుగ్గిలమయ్యాయి. ఇది ప్రభుత్వానికి సిగ్గుచేటని ధ్వజమెత్తాయి. ఫైళ్లు ఎలా మాయమయ్యాయో, ఎవరు బాధ్యులో వివరణ ఇవ్వాలన్నాయి. ‘ఫైళ్లు కనిపించకుండా పోవడం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. అసలేం జరిగిందో ప్రజలకు సమాధానం చెప్పాలి’ అని బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు ఆదివారమిక్కడ డిమాండ్ చేశారు. ఈ వ్యవహారాన్ని సహించేది లేదని, సోమవారం పార్లమెంటులో ప్రభుత్వాన్ని నిలదీస్తానని బీజేపీ మరో నేత యశ్వంత్ సిన్హా చెప్పారు. ఫైళ్ల అదృశ్యం ప్రభుత్వ బాధ్యతారాహిత్యానికి పరాకాష్ట అని, ఈ అంశాన్ని పార్లమెంటులో లేవనె త్తుతామని జేడీయూ చీఫ్ శరద్ యాదవ్ చెప్పారు.